రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు మనుషులు క్షతగాత్రులుగా మారినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఈ రోజుల్లో మూగ జీవాలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వాటికి అండగా నిలుస్తూ చికిత్స అందిస్తోంది పట్టణంలోని గోమాత సేవా ఫౌండేషన్. 2011లో ఈ స్వచ్ఛంద సంస్థ ప్రారంభమైంది. మూగజీవాలు అనారోగ్యంతో ఎక్కడైనా పడిపోవడం, అచేతన స్థితిలో కదలకుండా ఉండడం, రహదారి ప్రమాదంలో గాయాలు కావడం, ఏదైనా మురికి కాలువలో పడిపోవడం వంటి సమయంలో ఆ జీవాలకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు వాటి బాగోగులు చూసుకుంటున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. స్థానికులు సమాచారం అందిస్తే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని సపర్యలు అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు గోమాతలు చనిపోతే వాటికి శాస్తోక్త్రంగా అంత్యక్రియలు సైతం నిర్వహిస్తుండడం విశేషం. తమకు యంత్రాంగం మరింతగా సహకరిస్తే మూగజీవాల బాగోగులు పూర్తిస్థాయిలో చూడడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
యంత్రాంగం సహకరించాలి..
ఫౌండేషన్‌ను 15ఏళ్ల క్రితం ప్రారంభించాం. అప్పటి నుంచి గోమాతల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాత్రి, పగలు ఏ సమయమైనా సంప్రదించిన వెంటనే అక్కడికి చేరుకుని జీవాలకు చికిత్స అందిస్తున్నాం. పలు సందర్భాల్లో మరణిస్తే అంత్యక్రియల సైతం చేస్తున్నాం. ఫౌండేషన్ తరఫున ఇప్పటివరకు ఎన్నో ఆవులను ప్రమాదాల నుంచి కాపాడమే కాకుండా, వాటి బాగోగులు చూసుకున్నాం. అధికార యంత్రాంగం సహకరిస్తే మూగజీవాల సేవలో మరింతగా పాటుపడతాం.
– సురేష్ ఓటార్కార్, గోమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆదిలాబాద్


