నకి‘లీలలు’ | - | Sakshi
Sakshi News home page

నకి‘లీలలు’

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

జిల్లాలో జోరుగా నకిలీ విత్తన దందా నమ్మిస్తూ.. మోసగిస్తున్న వ్యాపారులు దిగుబడి రాక లబోదిబోమంటున్న రైతులు ఇటీవల బేలలో నకిలీ విత్తన రాకెట్‌ బట్టబయలు

నిందితులు విత్తనాలు

ఆదిలాబాద్‌టౌన్‌: వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే జిల్లాలో నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అక్రమార్కులపై పోలీసులు, వ్యవసాయ అధికారులు ఏటా కొరడా ఝుళిపిస్తున్నా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని ప్రై వేట్‌ కంపెనీలు పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తూ రైతులకు వీటిని అంటగడుతున్నాయి. నాటిన తర్వాత మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కాత రాకపోవడంతో రైతులకు ఏటా నష్టాలు తప్పని పరిస్థితి.ఇటీవల బేలలో నకిలీ విత్తన రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. 150 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో..

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 91వేల ఎకరాలుగా ఉంది. ఇందులో అత్యధికంగా 4లక్షల 30వేల ఎకరాల్లో పత్తి ఉండగా.. తర్వాత 90వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో కంది, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతున్నాయి. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌లో అత్యధికంగా పత్తి సాగవుతుండడంతో దళారులు ఈ విత్తనాలపై దృష్టి పెట్టారు. ఏటా ఖరీఫ్‌కు ముందు పల్లెల్లో తిరగడం, కంపెనీల ప్రచారం చేపట్టడం, పేరున్న రైతులకు ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నారు. గిఫ్టులు, ఆఫర్లతో మభ్యపెడుతూ ఆకర్షిస్తున్నారు. తర్వాత కనిపించకుండా ఉడాయిస్తున్నారు.

అధిక దిగుబడి అంటూ..

తమ కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని దళారులు రైతులను నమ్మిస్తున్నారు. ము ఖ్యంగా గుజరాత్‌కు చెందిన కేటుగాళ్లు జిల్లాలోని పలువురు డీలర్లు, వ్యాపారులు, ఏజెంట్లను నియమించుకొని వారి దందా సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వీరి వ్యాపారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంటగడతారు. బ్రాండెడ్‌ బీటీ విత్తనాల పేర్లలోని అక్షరాలను అటుఇటూ చేస్తూ అదే మాదిరి పలికే పేర్లతో తయారు చేస్తున్నారు. వీటిని పసిగట్టని రైతులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. గతంలో జిల్లాకు కర్నూల్‌, విజయవాడ, ఒంగోలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు వచ్చాయనే ప్రచారం ఉంది. ఇటీవల బేలలో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన నకిలీ విత్తనాలను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు..

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. మండలానికొకటి చొప్పున నియమించింది. ఇందులో తహసీల్దార్‌, మండల వ్యవసాయ అధికారి, ఎస్సై ఉంటారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో, ఏడీఏ, డీఎస్పీ ఉంటారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో అదనపు కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, అదనపు ఎస్పీ సభ్యులు గా ఉంటారు. వీరంతా గోదాములు, విత్తన దుకా ణాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ట్రాన్స్‌పోర్టులలో తనిఖీలు చేపడతారు. ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులు నకిలీ విత్తనాల వైపు వెళ్లకుండా చర్యలు చేపడతారు. ఎక్కడైనా విక్రయించినట్లు సమాచారం అందితే వెంటనే దాడులు జరిపి కేసులు నమోదు చేస్తారు.

మూడేళ్లుగా జిల్లాలో నకిలీ విత్తన కేసుల వివరాలు

సంవత్సరం కేసులు పట్టుబడిన స్వాధీనం చేసుకున్న

2024 5 18 776 కిలోలు

2025 9 22 170 కిలోలు

2026 1 4 150 విత్తన ప్యాకెట్లు

Advertisement
 
Advertisement
Advertisement