ప్రగతి వివరణ.. ప్రణాళిక రూపకల్పన | - | Sakshi
Sakshi News home page

ప్రగతి వివరణ.. ప్రణాళిక రూపకల్పన

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

నేడు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహణ ప్రతీ పంచాయతీలో ఫిర్యాదుల పెట్టె ప్రత్యేక నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

కై లాస్‌నగర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరిస్తూ గ్రామ, వార్డుల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈ సభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక నిధులు సైతం కేటాయించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయనున్నారు.

సంక్షేమ పథకాల ప్రగతిని తెలిపేలా...

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత చేరువచేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా రైతుభరోసా, ఇందిరమ్మ

ఇళ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, సన్నరకం వడ్లకు బోనస్‌, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కొత్త రేషన్‌కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డుస్థాయిలో ప్రజలకు వివరిస్తారు. అలాగే త్వరలో కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటి తదితర పథకాలను ప్రజలకు వివరిస్తారు. దీంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారుల పేర్లను సభల్లో చదివి వినిపిస్తారు. వాటి అమలుపై పలువురి అభిప్రాయాలు స్వీకరిస్తారు.

సమస్యల పరిష్కార ‘ప్రణాళిక’

ఆయా సభల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చిస్తారు. ప్రాధాన్యత ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలనే దానిపై తీర్మానాలు చేస్తారు. ఈ వివరాలన్నింటిని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించేలా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయస్తారు. సమస్యలను, స్థానికంగా ఉన్న పరిస్థతులను అధికారుల దృష్టికి తీసుకొచ్చేలా ప్రభుత్వం నుంచి వారు ఇంకా ఏమి ఆశిస్తున్నారనే వివరాలను తెలియజేసేలా ప్రతి జీపీ పరిధిలో ఫిర్యాదుల పెట్టెను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రజల భాగస్వామ్యంతో ..

ప్రత్యేక నిధుల విడుదల

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దశలవారీగా ప్రభుత్వం సభలను నిర్వహిస్తుంది. ఇందుకోసం జిల్లాకు రూ.166.20లక్షలను మంజూరు చేసింది. అయితే నేడు నిర్వహించే గ్రామ, వార్డు సభలకు రూ.10వేల చొప్పున కేటాయించింది. ఏప్రిల్‌ 16న నిర్వహించే మండల, మున్సిపల్‌ స్థాయిలో జరిగే సభలకు రూ.2లక్షల చొప్పున, నియోజకవర్గస్థాయిలో జరిగే కార్యక్రమానికి రూ.10లక్షలు, జిల్లా స్థాయి కార్యక్రమానికి రూ.50లక్షల చొప్పున నిధులను కేటాయించింది.

జిల్లాలో..

గ్రామ పంచాయతీలు : 473

విడుదలైన నిధులు : రూ.47.30లక్షలు

మున్సిపాలిటీలోని వార్డులు: 49

విడుదలైన నిధులు : రూ.4.90లక్షలు

సర్పంచ్‌, కౌన్సిలర్‌ అధ్యక్షతన నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో రైతులు, యువత, స్వయం సహాయక మహిళా సంఘాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులను ఆహ్వానించనున్నారు. కలెక్టర్‌ రాజర్షి షా ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌ మేజర్‌ పంచాయతీలో నిర్వహించే గ్రామసభలో పాల్గొననున్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌ తమ నియోజకవర్గాల్లోని ప్రధాన పంచాయతీల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. కాగా సభల ప్రాధాన్యత చాటేలా ముద్రించిన ప్రచార పోస్టర్లను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సందేశాన్ని వీడియోరూపంలో ప్రజలకు వివరించనున్నారు. అనంతరం సభ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement