ఈజీఎస్ పనులకు చాలా కుటుంబాలు అనాసక్తి
నామ్‌కే వాస్తేగా జాబ్‌కార్డు
వంద రోజుల పనులు కొందరికే..
సగటున 48 పని దినాలే నమోదు
సాక్షి,ఆదిలాబాద్: ఉపాధి హామీ పథకంలో గడిచిన మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని కొత్త ఏడాదిలో లక్ష్యాన్ని నిర్ధారిస్తారు. అయితే జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్‌కార్డు ఉన్నప్పటికీ పనులకు దూరంగా ఉంటున్నారు. నామ్‌కే వాస్తేగా కార్డును మెయింటేన్ చేస్తున్నారు. ఇక ఏడాదిలో వంద రోజుల పనులు కొన్ని కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. సగటున కుటుంబానికి 48 పనిదినాలు మాత్రమే నమోదవుతున్నాయి. మరో వైపు వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువవుతోంది. జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్‌కార్డు ఉన్నప్పటికీ ఉపాధి పనులకు దూరంగా ఉండడం గమనార్హం.
వందల రకాల పనులు..
ఉపాధిహామీ పథకం కింద 230 రకాల పనులను ప్రభుత్వం చేపడుతోంది. ముఖ్యంగా కందకాలు తవ్వడం, మట్టి రోడ్ల నిర్మాణం, రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల రాళ్లు ఏరడం, ఫిష్‌పాండ్స్, చెక్‌డ్యాంలు, పశువుల పాకల నిర్మాణం, పాఠశాలలకు ప్రహరీలు, భోజన గదులు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం వంటివి ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు. గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్నవారు పనులు నిర్వహిస్తుండగా వారికి రూ.307 వేతనం అందుతుంది.
వివిధ కారణాలతో...
వివిధ కారణాలతో పలువురు జాబ్‌కార్డు దారులు ఉపాధిహామీ పనులకు దూరంగా ఉన్నారు. ప్రతీ మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త ఏడాదిలో లక్ష్యం నిర్దేశిస్తుంది. – రవీందర్, డీఆర్డీవో
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ..
మొత్తం జాబ్‌కార్డులు : లక్ష 75వేలు
యాక్టీవ్‌గా ఉన్నవి : లక్ష 11వేలు
ఉపాధి కూలీలు : 3లక్షల 46వేలు
యాక్టీవ్‌గా ఉన్నవారు : 2లక్షల 7వేలు
జిల్లాలో 2025–26 వార్షిక సంవత్సరంలో మొత్తం 44లక్షల 79వేల పని దినాలు మంజూరయ్యాయి. దీని కింద రూ.119 కోట్ల 70లక్షల వేతనాలు చెల్లించాలి. వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువ కాగా, ఇప్పటివరకు 95 శాతం లక్ష్యం పూర్తయింది. కూలీల వేతనాల కింద ఇప్పటివరకు రూ.113 కోట్ల 94లక్షలు చెల్లించారు. మరో రూ.5.76 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో లక్ష్యం పూర్తి చేసే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వేలాది మంది కుటుంబాలు ఉపాధి హామీకి దూరంగా ఉండడంతో ఈ పనులు చేపట్టేందుకు అనాసక్తి కనబర్చుతున్నారనేది స్పష్టమవుతుంది.


