ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలి
కై లాస్‌నగర్: ప్రజావాణి పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతితో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ 30 రోజుల్లోపు పరిష్కరించాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు అందాయి. వాటిలో కొందరి నివేదన..
రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో ఎంఎస్ నంబర్ 3 ప్రకారం 17 వెనుకబడిన కులాలను గుర్తించింది. ఇందులో 13 కులాలను బీసీ(ఏ)లో, నాలుగు కులాలను బీసీ(బి)లో చేర్చింది. బీసీ(ఏ)లో సీరియల్ నంబర్ 64లో ఉన్న ఓడ్ కులస్తులైన మేము అన్నింటిలో వెనుకబడి ఉన్నాం. కేంద్ర జాబితాలో గల ఓబీసీలో మా కులం లేనందున సైనిక్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో మా పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విషయాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం.
– ఓడ్ కులస్తులు, ఆదిలాబాద్


