చెన్నూర్‌రూరల్: ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమతం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. టీచర్లు, పోలీసులు, అటవీశాఖ, ఎకై ్సజ్‌శాఖ ఇలా అనేక రంగాలలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారు. అటవీశాఖలో మహిళలు మగవారికి తీసిపోకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ డివిజన్, చెన్నూర్ రేంజ్ పరిధిలో ఏడుగురు మహిళలు వివిధ పోస్టుల్లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీవైఆర్‌వో (డిప్యూటీ రేంజ్ అధికారులు), ఒక్కరు ఎఫ్‌ఎస్‌వో(ఫారెస్టు సెక్షన్ అధికారి), నలుగురు ఎఫ్‌బీవో (ఫారెస్టు బీట్ అధికారులు)లు ఉన్నారు.
విధులు, బాధ్యతలు..
నెలలో రెండుసార్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరేడ్ చేయడంతోపాటు పురుషులతో సమానంగా ప్రతీరోజు అడవుల్లో కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్లను గమనించడంతో పాటు వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు, ఉరులు, ఉచ్చులు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అడవిలో స్మగ్లర్లు కలప దొంగతనం చేయకుండా అప్రమత్తంగా ఉండడం, వన్యప్రాణుల మేత కోసం గడ్డి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తొట్లు, కుంటలు ఏర్పాటు చేయడం, అడవిని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అటవీ సంపద కాపాడేందుకు రాత్రి పెట్రోలింగ్ చేయడం, అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టడం, అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల, అడవుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారు గోదావరి నదిలో మొసళ్ల కేంద్రం సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. జంతుగణన, బర్డ్‌వాచ్, బటర్‌ఫ్లై వాచ్‌లో పాల్గొంటున్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద, ఆకుల కల్లాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు.


