కాసిపేట: సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభించకముందు ఇచ్చిన హామీల మేరకు ఓపెన్‌కాస్ట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత యువకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని కోమటిచేను, పల్లంగూడ, సోమగూడం ప్రాంతాలలో ఇంటికో ఉద్యోగం, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి రైతుల వద్ద భూమిని యాజమాన్యం కాసిపేట –2 ఓపెన్‌కాస్ట్‌లకు సేకరించి నేడు నిర్వాసితులకు మొండి చేయి చూపించిందన్నారు. ఓపెన్‌కాస్ట్‌లో గత పదేళ్లుగా దుర్గ, ఆర్వీఆర్ కంపెనీలలో డంపర్ ఆపరేటర్లుగా పని చేసిన తమను మరిచి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్‌ప్రెస్‌వే కంపెనీ కార్మికులను తీసుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు దుర్గం గోపాల్, బాధిత యువకులు కుమ్మరి శ్రీకాంత్, కుడిమెత చంద్రమౌళి, వెడ్మ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు.


