కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖ ర్చుల వివరాలు విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటంది. నిబంధనల మేరకు వాటిని సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. గడువులోపు సమర్పించని పక్షంలో పదవి లో ఉన్న వారు అనర్హతకు గురికానున్నారు. ఓటమి పాలైన వారు భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఏ ఎ న్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఈమేరకు మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన వారిలో సగం మంది ఇప్పటికీ వివరాలు సమర్పించనేలేదు. అధికారులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పలువురు నుంచి స్పందన లేదు. ఇందులో ఓటమి పాలైన వారితోపాటు గెలిచిన వారు కూడా ఉండటం గమనార్హం.
వివరాలు ఇవ్వాల్సిందే..
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవ రి 11న జరిగాయి. అదే నెల 13న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల్లోపు తమ ప్రచార వ్యయ నివేదికలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో తెరిచిన బ్యాంక్ ఖాతా ఆధారంగా వారు చేసిన వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంది.
27తో ముగియనున్న గడువు..
మున్సిపల్ పరిధిలోని 49వార్డులకు గాను 314 మంది పోటీ చేశారు. వారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యయం వివరాలు సమర్పించేందుకు ఈనెల 27వరకు అవకాశముంది. ఇప్పటి వరకు కేవలం 161మంది మాత్రమే వివరాలు అందజేశారు. ఇంకా 153 మంది సమర్పించాల్సి ఉంది. గడువు ఇంకా వారమే ఉండగా ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గడువులోపు అందజేయాలి
కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తమ ప్రచార వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం విధిగా సమర్పించాల్సిందే. ఈసీ నిబంధనల మేరకు ఈ నెల 27వరకు అవకాశముంది. లేకుంటే గెలిచిన వారు పదవి కోల్పోవడంతో పాటు ఓడిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉంటుంది.
– జి.రాజు, మున్సిపల్ కమిషనర్


