ఇందిరమ్మ చీరలు సిద్ధం
పంపిణీకి కసరత్తు ..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందడం, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని ఈనెల 19 నుంచి చీరల పంపిణీ ప్రారంభించాలని యోచిస్తోంది. ఒకవేళ ఆరోజు కాకుంటే డిసెంబర్ 7న శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా అందించనుండగా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో రాని కారణంగా తొలుత ఒక చీరను పంపిణీ ఇవ్వనున్నారు. మరో చీరను సంక్రాంతి సందర్భంగా అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో..
స్వయం సహాయక సంఘాలు : 10,990
గ్రామైక్య సంఘాలు : 554
ఆయా సంఘాల్లోని సభ్యులు : 1,48,052
ఇప్పటి వరకు జిల్లాకు చేరిన చీరలు : 80,530
ఇంకా రావాల్సిన చీరలు : 67,522
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు అందించా లని నిర్ణయించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని ఈనెల 19నుంచి లేదా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రోజైన డిసెంబర్ 7న పంపిణీ షురూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చేరుకుంటున్న చీరలను ఆయా మండల కేంద్రాల్లో గల వ్యవసాయ మార్కెట్‌యార్డు గోడౌన్లలో భద్రపరుస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా, గ్రా మీణ ప్రాంతాల్లో సెర్ప్‌ద్వారా అందించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభు త్వ నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 1,48,052 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్దేశమేంటంటే...
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ పురస్కరించుకుని తెల్లరేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే వాటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని గతేడాది ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులకు యూని ఫాం తరహా అందడంతో పాటు చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చాలని భావించారు. ఈ చీరలను అక్టోబర్‌లోనే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా వాటిని అందించాలని నిర్ణయించింది.
పూర్తిస్థాయిలో చేరని చీరలు
జిల్లాలో 1,48,052 మందికి చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 6.30మీటర్ల చీరలు 1,04,129 మందికి, 9మీటర్ల గోచి చీరలు 43,923 మందికి అ వసరమున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 6.30 మీట ర్ల చీరలు 80,530 మాత్రమే వచ్చాయి. వీటిని జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు గోడౌన్లలో భద్రపరుస్తున్నారు. జిల్లాకు ఇంకా 67,522 చీరలు సరఫరా కావాల్సి ఉంది. అయితే గోచి చీరలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. పంపిణీ ప్రా రంభించే నాటికి పూర్తిస్థాయిలో వస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు.
ఇంకా ఆదేశాలు రాలేదు
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా జిల్లాకు అవసరమైన చీరలను పంపిస్తోంది. అవి ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. వాటిని ఈనెల 19నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– జాదవ్ గోవింద్, అదనపు డీఆర్డీవో


