
చదువు సాగేదెలా..!
సర్కారు బడులకు చేరని పార్ట్–2 పాఠ్య పుస్తకాలు
సమీపిస్తున్న ఎస్‌ఏ–2 పరీక్షలు
రవాణా చార్జీలు లేక గోదాములకే పరిమితం
విద్యార్థులకు తప్పని తిప్పలు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పార్ట్–2 పాఠ్య పుస్తకాలు ఇంకా గోదాముల్లోనే నిల్వ ఉన్నాయి. పార్ట్–1 పుస్తకాల సిలబస్ సెప్టెంబర్‌లో పూర్తయింది. అక్టోబర్ నుంచి పార్ట్–2 సిలబస్ బోధించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌కు ముందే సంబంధిత పాఠశాలలకు ఆయా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉండగా, జాప్యం జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు లేకపోవడంతో పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకే పరిమితం అయ్యాయి. ఈనెల 24 నుంచి సమ్మెటీవ్ అసిస్మెంట్ (ఎస్‌ఏ–1)పరీక్షలు జరగనున్నాయి. ఇందులో పార్ట్–2కు సంబంధించిన సిలబస్ ఉంటుంది. కాగా, పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేటట్లు కనిపించడం లేదు.
గోదాముల్లోనే నిల్వ..
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఇదివరకు ఒకేసారి పాఠ్య పుస్తకాలను బడులకు సరఫరా చేసేది. అయితే బైలింగ్వల్ (తెలుగు, ఆంగ్ల భాష)లో పుస్తకాలను ప్రచురిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. జూన్‌లో పార్ట్–1కు సంబంధించి 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలను బడులకు సరఫరా చేశారు. పార్ట్–2కు సంబంధించి తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు 1లక్ష 36వేల 610 పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. గత జూలై నుంచి ఈనెల 15వరకు జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తకాల గోదాంకు పుస్తకాలు చేరుకున్నాయి. వీటిని సంబంధిత పాఠశాలలకు పంపించాల్సి ఉంది. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గణితం, ఈవీఎస్, 6,7 తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పుస్తకాలు పంపిణీ జరగాల్సి ఉంది.
నిధుల లేమితో ఇబ్బందులు..
పాఠ్య పుస్తకాలను సంబంధిత మండలాలకు సరఫరా చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమగ్ర శిక్ష నుంచి రూ.3లక్షలు మంజూరు చేశారు. అయితే ఇవి కాగితాలకే పరిమితం అయ్యాయి. మొదటి విడతలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీఈబీ ద్వారా రూ.లక్ష 50వేలు విడుదల చేయించారు. మరో రూ.1లక్ష 20వేలు పాఠ్య పుస్తకాల మేనేజర్ తన సొంత ఖర్చుతో సరఫరా చేశారు. ప్రస్తుతం రెండో విడత సరఫరాకు నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులు గోదాంకు వచ్చి పాఠ్య పుస్తకాలను తీసుకెళ్తున్నారు. దూర మండలాలకు సంబంధించి ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ విషయమై జిల్లా విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్‌ను వివరణ కోరగా.. రూ.3లక్షల నిధులు మంజూరైనప్పటికీ విడుదల కాలేదు. సంబంధిత మండలాల ఎంఈవోలు పాఠ్య పుస్తకాలను గోదాముల నుంచి తీసుకెళ్లాలని సూచించాం. నిధులు వచ్చిన తర్వాత వారికి చెల్లిస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.
జిల్లాలో..
డీఈవో పరిధిలోని పాఠశాలలు 739
విద్యార్థుల సంఖ్య 65,000
పంపిణీ చేసిన పార్ట్–1 పుస్తకాలు 4,83,110
జిల్లాకు చేరుకున్న పార్ట్–2 పుస్తకాలు 1,36,610