
డీసీసీ అధ్యక్ష ఎంపికకు అభిప్రాయ సేకరణ
కైలాస్‌నగర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి (డీసీసీ) ఎంపికపై మరోసారి అభిప్రాయ సేకరణ జరి గింది. ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర జేవర్గి ఎమ్మెల్యే అజయ్ సింగ్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రెండోసారి విచ్చేశారు. పట్టణంలో ని గాయత్రి గార్డెన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. డీసీసీ నియామకంపై తొలుత నాయకులందరితో మాట్లాడారు. అనంత రం దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో పాటు పార్టీ శ్రేణులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. పార్టీ పరంగా, రాజకీయంగా పదవులు కలిగిన బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ముఖ్య నాయకులతోపాటు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్ల నుంచి సామాజిక వర్గాల వారీగా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని దానిపై విడివిడిగా అభిప్రాయాలు స్వీకరించారు. జనరల్ అయితే ఎవరు.. ఎస్టీ అయితే ఎవరు.. బీసీ అయితే ఎవరు.. అనే దానిపై పార్టీ శ్రేణులు ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా నివేదిక సిద్ధం చేసి అధిష్టానానికి పంపనట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ రహస్యంగా నిర్వహించారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించారు. కాగా ఈ సమావేశంలో డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా సమాచారం. ఇది గమనించిన పరిశీలకులు బయటకు వచ్చి ఇరువురికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమనిగింది.