
నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనంతో పాటు దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నిమజ్జనోత్సవం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలీసు సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. 30 మంది మహిళా సిబ్బందితో బందోబస్తు, షీటీంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకతాయిల వేధింపులకు గురయితే మహిళలు డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం దృష్ట్యా ఆదిలాబాద్ వన్‌టౌన్, టూటౌన్, మావల పోలీసు స్టేషన్ల పరిధిలో 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9 సెక్టార్లు, 4 క్లస్టర్లుగా విభజించి సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, పట్టణ సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ఫణిందర్, ప్రేమ్‌కుమార్, స్వామి, అంజమ్మ, పద్మ, ఎస్సైలు పాల్గొన్నారు.