
ప్చ్.. దశ మారలే!
రైతు మోములో కనిపించని దశమి కళ దిగుబడిపై తప్పని ఆందోళన పండుగ వేళ అప్పుల పరేషాన్ భారీ వర్షాలతో సాగు అస్తవ్యస్తం
సాక్షి,ఆదిలాబాద్: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచ్చిందయ్యా.. దశనే మా ర్చిందయ్యా.. ఇది ఓ సినిమాలోని పాట. అయితే ఇప్పుడు జిల్లాలోని రైతులకు ఆ సరదా లేదు.. దశ అంతకంటే లేదు.. ఎందుకంటే ఈ దసరా వచ్చిందంటే ఇటు పత్తి, అటు సోయా దిగుబడులు చేతి కొచ్చేవి. పండుగ వేడుకలు నిర్వహించేందుకు ఆ దిగుబడుల్లో కొంతమేర విక్రయించుకొని సంబరాలు జరుపుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆ ప రిస్థితే లేదు. దీనంతటికి వానాకాలంలో కురిసిన భారీ వర్షాలే కారణం. ఏకంగా 35 శాతం అధిక వర్షపాతం నమోదుతో పంటల పరిస్థితి పూర్తిగా ఆగమాగం అయిపోయింది. పత్తి కాయలు విచ్చుకొని తెల్లటి పత్తి బయటకు కనిపించాల్సిన సమయంలో దిగువ భాగంలో ఆ కాయలు పూర్తిగా మురిగిపోయి ఉండటం, పైభాగంలో ఉన్న కాయలు అసలుకే విచ్చుకోలేదు. తేమశాతం అధికంగా ఉండడమే కా రణంగా తెలుస్తోంది. పత్తి పంట కాలం మరో నెల పెరిగింది. దీంతోపాటు రైతు అంతర్‌కృషి, మందుల కోసం మళ్లీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. దిగుబడులు చేతికొచ్చి ఆనందపడాల్సిన సమయంలో ఇంకా పంట కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి లో అన్నదాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దశమి ఉత్సాహం రైతు ఇంట్లో కనిపించడం లేదు. చేతిలో కాసులు లేక కర్షకులు దిగాలు చెందుతున్నారు.
వెంటాడుతున్న అప్పులు..
సాధారణంగా జిల్లాలో వానకాలం సీజన్‌లోనే భారీగా పంటలు సాగవుతాయి. పత్తి, సోయా, కందులను పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. దీనికోసం రైతులు బ్యాంకులతో పాటు దళారుల వద్ద ప్రైవేట్ అప్పులు తీసుకుంటారు. పంట దిగుబడులు ఏటా దసరా వరకు చేతికొస్తాయి. దీంతో వాటిని విక్రయించి అప్పులు తీర్చి రైతు తన ఖర్చుల కోసం మిగతా మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, పిల్లల చదువులు, ఇతరత్రా వాటి కోసం డబ్బులను లెక్కలతో సరిపోల్చుకుంటాడు. అయితే ఇప్పుడు ఇవేమి రైతుకు కనిపించడం లేదు. అప్పులు మాత్రం మీద పడ్డాయి. ప్రైవేట్ అప్పుల పరంగా దళారుల నుంచి రైతులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
వానాకాలంలో పంటల సాగు వివరాలు..
(ఎకరాల్లో)
మొత్తం సాగు విస్తీర్ణం: 5.85లక్షలు
పత్తి : 4.40లక్షలు
సోయా : 62,500
కంది : 55వేలు
ఇతర పంటలు : 27,500