
ఆదర్శం.. పల్సి(బి) తండా
మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. దాదాపు మూడు దశాబ్దాలుగా మద్యం, మాంసం ముట్టకుండా నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. ఎలాంటి గొడవలు లేకుండా ఠాణా మెట్లు ఎక్కకుండా ఐక్యతతో ముందుకు సాగుతున్నా రు ఈ గ్రామస్తులు. ఐక్యత రాగంతో అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా గ్రామంపై ప్రత్యేక కథనం.
– తలమడుగు
పల్సి(బి) తండా గ్రామ ముఖచిత్రం
ఈ గ్రామంలో 1997లో పలువురు మద్యానికి బాని సయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో ఎవ రూ మద్యం ముట్టవద్దని, విక్రయించవద్దని తీర్మా నం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా వచ్చారు. ఆయన బోధనలకు ప్రభావి తమై మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. దశాబ్దాలుగా అదే బాట లో కొనసాగుతున్నారు. గ్రామ జనాభా దాదాపు 900 వరకు ఉంటుంది. బాబా మరణాంతరం గ్రా మంలో ఆయన పేరిట సద్గురు నారాయణ ఆల యం నిర్మించుకున్నారు. ఇందులో ప్రతీ గురువా రం ప్రత్యేక పూజలు నిర్వహించడం, అన్నదానం చేయడం, ఏటా దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామాభివృద్ధిలోనూ సమష్టిగా భాగస్వాములవుతున్నారు. స్థానిక వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమం సైతం నిర్మించారు. నారాయణ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
నూతన పంచాయతీగా..
పల్సి(బి)గ్రామ పంచాయతీ పరిధిలో పల్సి(బి)తండా ఉండేది. 2019లో నూతన జీపీగా ఆవిర్భవించింది. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డుమెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామస్తులు. గత పాలకవర్గంలో ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇంటింటికి తాగునీటితో పాటు, సెగ్రిగేషన్ షెడ్లు వంటివి నిర్మించుకున్నారు. అలాగే గొడవలకు దూరంగా ఉంటూ పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కడం లేదు. ఆధ్యాత్మిక బాటలో ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు.

ఆదర్శం.. పల్సి(బి) తండా