breaking news
Yamuna Vihar
-
ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ కౌన్సిలర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండ చల్లారటం లేదు. సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కొందరు ముష్కరులు ఓ ముస్లిం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించగా బీజేపీ కౌన్సిలర్ వారిని అడ్డగించి ముస్లిం కుటుంబాన్ని కాపాడిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. యమున విహార్‌లో సోమవారం రాత్రి నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 150 మంది ముష్కరులు దగ్గరలోని ముస్లిం కుటుంబాల నివాసాలను చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని ఓ ముస్లిం ఇంటిని చుట్టుముట్టారు. (హింసాత్మకంగా మారుతున్న సీఏఏ నిరసనలు) అనంతరం వారికి చెందిన కారు, బైక్ వాహనాలకు నిప్పంటించారు. ఈ ముస్లిం కుటుంబానికి సన్నిహితుడైన బీజేపీ వార్డు కౌన్సిలర్‌కు విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డగించాడు. వారు ఎలాంటి దాడికి పాల్పడకుండా అడ్డుకుని ముస్లిం కుటుంబాన్ని కాపాడాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబంలోని ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘రాత్రి 11.30 గంటల సమయంలో జైశ్రీరాం అంటూ కొందరు గుంపులు గుంపులుగా మా ఇంటి వైపు పరిగెత్తుకు వచ్చారు. మా ఇంటి కింద అద్దెకు ఉంటున్న వ్యక్తి బొటిక్‌తో పాటు, మా వాహనాలను దగ్ధం చేశారు. అనంతరం మా ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెండు నెలల పాపతో సహా అక్కడనుంచి బయటపడేందుకు ప్రయత్నించాం. కానీ సరిగ్గా అదే సమయంలో వార్డు కౌన్సిలర్ వచ్చి మా ఇంటితో పాటు కుటుంబాన్ని కాపాడాడు’ అని పేర్కొన్నారు. కాగా మంగళవారం జరిగిన అల్లర్లలో ఏడుగురు మృతి చెందగా 150 మంది గాయాలపాలయ్యారు. (సీఏఏపై ఆగని ఘర్షణలు..) -
ఎన్నికల ప్రచారంలో మాయా బిజీ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్నందున, బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం రాజధాని బాట పట్టారు. మొదటగా యమునావిహార్లో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీకి హాజరై ప్రసంగించారు. ముజఫర్‌నగర్ అల్లర్ల నేపథ్యంలో ముస్లింలు ఈసారి కాంగ్రెస్‌కు బదులు తమకే ఓట్లు వేస్తారని ఢిల్లీ బీఎస్పీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకే ముస్లిం జనాభా అధికంగా ఉండే యమునావిహార్లో మాయావతి ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో తమ పార్టీకి చక్కటి స్పందన వస్తోందని, తమ అధినేత్రి తదుపరి ఎన్నికల ర్యాలీ అశోక్ విహార్‌లో ఉంటుందని పార్టీ ఎన్నికల ప్రచార విభాగం ఇన్చార్జ్ ఎంఎల్ తోమర్ అన్నారు. ‘ముస్లింలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు. వాళ్లు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. యూపీలో మేం అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం కాబట్టి ఢిల్లీలోనూ వారికి మేమే ప్రత్యామ్నాయంగా అవతరిస్తాం. షీలా దీక్షిత్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదు. మాయావతి ఈ అంశాలపై దృష్టి సారిస్తారు’ అని తోమర్ వివరించారు. మాయావతి శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు అశోక్‌విహార్, తుగ్లకాబాద్, నజఫ్‌గఢ్, నరేలా, ఆర్కే పురం, త్రిలోక్‌పురి, ద్వారక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 2008 ఎన్నికల్లోనూ ఆమె ఢిల్లీలో త్రిలోక్‌పురి, సుల్తాన్‌పురి, అలీగావ్లో ప్రచారం చేసినప్పుడు అనూహ్య స్పందన వచ్చిందని బీఎస్పీ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆమె ఏకంగా ఎనిమిది ర్యాలీల్లో పాల్గొంటున్నందున తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని తోమర్ ఆశాభావం వ్యక్తపరిచారు. సంప్రదాయ ఓటర్లయిన దళితులతోపాటు జాట్లు, ముస్లిం ఓట్లపై బీఎస్పీ కన్నేసింది. ఢిల్లీ రాజకీయాల్లో తాము మూడోశక్తిగా అవతరించామని, యూపీలో మాయావతి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాల్సిందిగా తాము ఢిల్లీవాసులను కోరుతున్నామని తోమర్ అన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ రెండు స్థానాలను గెలిచింది. ఈసారి తమ ఓట్ల సంఖ్య 14 నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఢిల్లీ బీఎస్పీ అంచనా వేసింది. ద్రవ్వోల్బణం అదుపు, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా వంటి అంశాలను ఈపార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది.