breaking news
wine shop control
-
వాటర్.. వైన్ అయిపోద్ది!
వాషింగ్టన్: కేవలం నీళ్లు, ద్రాక్ష ఉపయోగించి ఇంట్లోనే వైన్ తయారుచేసుకోగలిగితే..? అదీ మూడు రోజుల్లో, మనకు నచ్చినట్లుగా అయితే..!? భలేగా ఉంటుంది కదూ.. ఇలాంటి ‘మిరాకిల్ మెషీన్’ను అమెరికాకు చెందిన వైన్ తయారీ నిపుణుడు కెవిన్ బోయర్, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ జేమ్స్ రూపొందించారు. కేవలం రూ. 30 వేల విలువైన ఈ యంత్రంతో.. బయట దొరికే ధరలో పదోవంతుతోనే వైన్‌ను తయారుచేసుకోవచ్చని వారు చెబుతున్నారు. సాధారణంగా వైన్ తయారీ ప్రక్రియలో ఉండే పులియబెట్టడం సహా అన్ని దశలూ.. ఈ యంత్రంలోనే వాటంతట అవే జరిగిపోతాయి. యంత్రంలోని చాంబర్లో నీళ్లు పోసి ద్రాక్షపళ్ల గుజ్జు, ఈస్ట్‌ను కలిపితే చాలు. చాంబర్లలోని సెన్సార్లు వైన్ రూపొందే ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనించి, బ్లూటూత్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు పంపుతాయి. ఈ యంత్రంతో పాటు వచ్చే మొబైల్ యాప్‌తో.. వైన్‌కు ఎలాంటి రుచి ఉండాలో కూడా నిర్దేశించుకోవచ్చు. మనకు కావాల్సిన రుచి కోసం ఏయే పదర్థాలను వాడాలి, ఎంత మోతాదులో వాడాలో ఈ యాప్ సూచిస్తుంది. వైన్ ఎంత పాతబడితే అంత రుచి వస్తుందంటారు కదా..! వైన్ తయారైన తర్వాత అలాంటి వేర్వేరు రుచులకోసం ప్రత్యేకమైన పొడుల (పౌడర్)ను అందజేస్తారు. వైన్ తయారుకాగానే.. ‘తాగేందుకు వైన్ సిద్ధమైంది’ అంటూ మొబైల్లోని యాప్ చెప్పేస్తుంది కూడా. మొత్తంగా బయట దాదాపు రూ. 1,200 విలువైన వైన్‌ను రూ. 120 ఖర్చుతో తయారు చేసుకోవచ్చట. -
‘బెల్టు’తీయని ఎక్సయిజ్
యలమంచిలి, న్యూస్‌లైన్: మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సయిజ్‌శాఖ బెల్టుషాపుల నియంత్రణలో చేతులెత్తేస్తోంది. ఎక్సయిజ్ సిబ్బంది ఆయా స్టేషన్లకే పరిమితమవుతున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. సారా తయారీ, అమ్మకాల వైపు ఆ శాఖ కన్నెత్తి చూడటంలేదు. నెలకో రెండు నెలలకో మొక్కుబడిగా సారా తయారీకి ఉపయోగించే బెల్లం పులుపులపై దాడులు చేస్తూ మమ అనిపిస్తున్నారు. గత నెలలో నర్సీపట్నం ఎక్సయిజ్ సీఐ మద్యం సిండికేట్ నుంచి రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ఎక్సయిజ్ శాఖలో మామూళ్ల తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలోని 5324 గ్రామాల్లో 15 వేలకు పైబడి బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. ఎక్సయిజ్ శాఖ అండదండలతో వీటి ఏర్పాటుకు వేలం పాటల సంస్కృతి కొనసాగుతోంది. ఇక జిల్లాలో ఎక్సయిజ్ శాఖ బాధ్యతలను పోలీసు శాఖ మోస్తోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న బెల్టు షాపులను నియంత్రించాలంటూ పోలీసు శాఖకు జిల్లా ఎస్పి ఆదేశాలు జారీ చేయడంతో గత ఆరు నెలలుగా పోలీసులు బెల్టు దుకాణాలపై దాడులు చేస్తూ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం, అమ్మకందారులను అదుపులోకి తీసుకుంటున్నారు. సారా తయారీ, అమ్మకాలపై నిఘా ఉంచి, బెల్టు షాపులను నియంత్రించాల్సిన ఎక్సయిజ్ శాఖ సిండికేట్ల నుంచి నెలవారీ మామూళ్లు, మద్యం దుకాణాలకు సరకును పంపడం, అమ్మకాలను వేగవంతం చేయించడం వంటి వాటికి మాత్రమే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీథివీథినా బెల్టు దుకాణం గ్రామాల్లో 10 ఇళ్లు ఉన్నచోట ఒక బెల్టు దుకాణం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలదారులు బెల్టు షాపులకు సరకును పంపించి అమ్ముతున్నారు. ఇళ్ల వద్దనే మద్యం అందుబాటులో ఉండడంతో కూలీలు, పేదలు, మత్స్యకార్లు సంపాదనంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారు. బెల్టుషాపుల నుంచి స్వాధీనం చేసుకున్న సరకును ఏ మద్యం దుకాణం నుంచి తీసుకువచ్చారో బాటిళ్లపై ఉన్న బ్యాచ్ నంబరు, సీరియల్ నంబరు ద్వారా ఎక్సయిజ్ శాఖ గుర్తించవచ్చు. ఈ ఆధారాలతో సంబంధింత మద్యం దుకాణ యజమానిని హెచ్చరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ శాఖ ఇవేమీ పట్టించుకోవడం లేదు. పోలీసు శాఖకు కూడా మామూళ్ల మంత్రం ఇప్పటికే ఎక్సయిజ్ శాఖను మామూళ్లతో లోబరుచుకున్న సిండికేట్లు పోలీసు శాఖకు లంచాలు ఎరవేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషాపులపై పోలీసు శాఖ దాడు లు చేస్తుండటం సిండికేట్లకు మింగుడుపడటంలేదు. దీంతో పోలీసు అధికారులనూ మామూళ్లతో కట్టడికి సిండికేట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లా లో పలు ప్రాంతాల్లో పోలీసులతో సిండికేట్లు ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. సారాపై దాడులేవీ? జిల్లాలో తీరప్రాంతంతోపాటు పాయకరావుపేట పరిసరాల్లో పెద్దఎత్తున సారా తయారవుతోంది. మండలంలో అరట్లకోట, గుంటపల్లి, పెదరామభద్రపురం, ఎస్.నర్సాపురం, పెంటకోట, వెంకటనగరం, పాల్మన్‌పేటల్లో ఆరుపీపాలు మూడు క్యాన్లుగా తయారీ, అమ్మకందారులు వెలిగిపోతున్నారు. ఈ మండలంలో సారా బట్టీలను ఏర్పాటు చేసుకోవడానికి నెలకు రూ.5 వేలు మామూళ్లు ఎక్సయిజ్‌శాఖకు సమర్పించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యలమంచిలి మండలం, పెదపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున సారా తయారీ అవుతోంది.