breaking news
water spring
-
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
ఆహా.. ఏమిటీ ఊట
♦ మూడు దశాబ్దాలుగా ఉబికి వస్తున్న నీటి ఊట ♦ కరువులోనూ రెండెకరాల పంటకు నీరు ♦ అబ్బురపరుస్తున్న బావి మెదక్: రెండేళ్ల కరువు...భానుడి భగభగలకు జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి అడుగంటిపోయాయి. కానీ ఓ గ్రామంలో 30 ఏళ్ల క్రితం తవ్విన కేవలం 3గజాలలోతు బావిలో నీటి ధారలు ఉబికి వస్తున్నాయి. తీవ్ర కరువులోనూ రెండెకరాల పంట పొలానికి నీటి తడులందిస్తోంది ఆ బావి. ఈ నీటి ఊటలను చూసిన జనం విస్మయం చెందుతున్నారు. మండలంలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన బద్దం ప్రతాప్‌రెడ్డికి గ్రామ శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. తన పొలంలో 30ఏళ్ల క్రితం కేవలం 3గజాల లోతులో ఓ బావిని తవ్వాడు. అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్కలంగా నీరు వస్తోంది. ఆ బావి ఆధారంగా తన 4 ఎకరాల పొలంలో పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా కరువు ఏర్పడటంతో ప్రస్తుత రబీ సీజన్లో రెండెకరాల్లో మాత్రం పలు రకాల కూరగాయల పంటలతోపాటు పశువుల మేతకోసం పచ్చి గడ్డిని పెంచుతున్నాడు. ఈ బావి ఉండటంతో భయానక కరువులోనూ నీటిగోస లేకుండా పంటలు పండించుకుంటానని రైతు బద్దం ప్రతాప్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా 500 అడుగుల లోతు బోర్లు తవ్వినా నీటి ఊటలు కనిపించక ప్రజలు ఆందోళన చెందుతోంటే, కేవలం 3గజాల లోతులో ఉబికి వస్తున్న జలాన్ని చూసి ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెదక్-అక్కన్నపేట మధ్య వేస్తున్న రైల్వేలైన్ ఏర్పాటులో ఈ బావి పూడుకుపోతుందని రైతు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.