breaking news
very important
-
నిన్న నేడు రేపు
నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం. నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా చేవను మనం నింపుకోవాలి. మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి. నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి. నిలిచి ఉండే చెలిమితోనూ, నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి. నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి. పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని నిరూపించుకోవాలి. మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి. మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి. ‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘. – రోచిష్మాన్ -
క్రీడలకు విశేష ప్రాధాన్యం
ఎల్ఐసీ హెచ్ఆర్డీ ఆర్ఎం నరసింహారావు సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ టోర్నీ ప్రారంభం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజరు(హెచ్ఆర్డీ) కెవీపీవీ నరసింహారావు పేర్కొన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న క్రీడాకారులు జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి పోటీలలో రాణించి పతకాలు సాధిస్తున్నారన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్‌లోని సూర్య గార్డెన్స్‌లో సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం రోజున టోర్నమెంటును నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్యారమ్స్ క్రీడాకారిణి అపూర్వ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు దేశం తరఫున ఎంపికైందని తెలిపారు. ఎల్ఐసీలో పనిచేస్తున్న క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తి సహాయసహాకారాలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు అపూర్వను పూలబొకే, శాలువాతో సత్కరించారు. అనంతరం క్యారమ్స్, చెస్ పోటీలను నరసింహారావు, రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజరు ఈఏ విశ్వరూప్, మేనేజర్(పీఆర్) నాగేంద్రకుమార్, స్పోర్ట్స్ ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్, ఎన్బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, క్యారమ్స్ చీఫ్ రిఫరీ ఎస్కే అస్మదుల్లా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ఎల్ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల ఫలితాలు క్యారమ్స్ పురుషుల విభాగంలో 18 మంది,మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. తొలిరోజు పోటీలు క్వార్టర్ ఫైనల్స్ వరకూ జరిగాయి. పురుషుల విభాగంలో కె.బాలగురవయ్య(బెంగళూరు)–డి.వీరలింగం(దర్బాన్), కె.రఘునాథరావు(హైదరాబాద్)–జగన్నాథరావు(విశాఖపట్నం) , మహిళల విభాగంలో ఎస్.అమలాదేవి(బెంగళూరు)–ఎస్.అపూర్వ(హైదరాబాద్), పి.నిర్మల(వరంగల్)–వీకే కేగివల్లి(దర్బన్) సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నారని చీఫ్ రిఫరీ ఎస్కే అస్మదుల్లా తెలిపారు. చెస్ పురుషుల విభాగంలో 18మంది, మహిళల విభాగంలో 18మంది పోటీపడ్డారు. ఆరు రౌండ్ల పోటీల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పురుషుల విభాగంలో కె.నారాయణభట్(షియోగా) మూడుకు మూడు పాయింట్లు, రవిప్రకాష్(మైసూరు) మూడుకి 2.5పాయింట్లు, మహిళల విభాగంలో రాధాకుమారి(రాజమహేంద్రవరం) మూడుకి మూడు పాయింట్లు, రాధికాదేవి(మచిలీపట్నం) మూడుకు మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారని చెస్ చీఫ్ ఆర్బిటర్ జి.వి.కుమార్ తెలిపారు.