రాష్ట్రంలో శ్రీశ్రీ రవిశంకర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ శ్రీశ్రీ రవిశంకర్ ఈ నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ సొసైటీ ఎఫెక్స్ మెంబర్ వి.భాస్కర్‌రావు, మీడియా ప్రతినిధి పి.వాణిబాల తెలిపారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5న శాంతి, సామరస్యాలు లక్ష్యంగా ఇస్లామిక్ మదర్సా బోర్డు, హ్యూమన్ లైఫ్ అవేకెనింగ్ సొసైటీ (హాస్) సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే అంతర్జాతీయ శాంతి సదస్సులో రవిశంకర్ పాల్గొని ప్రధానోపన్యాసం చేస్తారన్నారు.
6న వరంగల్‌లో జరిగే ధ్యానం, జ్ఞానం సభలో, ఆ సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో పెరల్స్ ఆఫ్ విజ్డమ్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 7న ఉదయం 9 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎంఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న రుద్రాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.