breaking news
Vadachennai
-
వడచెన్నై చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన
చెన్నై ,పెరంబూరు: వడచెన్నై చిత్రానికి వ్యతిరేకంగా ఈ నెల 29న ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తమిళ్ తిరైపడ పాదుగాప్పు కళగం ప్రకటించింది. నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించి తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం వడచెన్నై. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేశ్, ఆండ్రియా, సముద్రకని, అమీర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో పలు సంభాషణలు ఆక్షేపణీయంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా వాటిని చిత్రం నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్ తిరైపడ పాదుగాప్పు కళగం నిర్వాహకులు వడచెన్నై చిత్రంలోని అసభ్య సంభాషణలను తొలగించాలంటే ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. చిత్రంలో మహిళలు అసభ్యంగా మాట్లాడే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని వాటిని తొలగించాలంటూ, చిత్ర దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా ఈ నెల 29న చెన్నైలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. -
వడచెన్నై నుంచి వైదొలిగినట్టేనా?
తాజాగా ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న నాయకి ఎవరైనా ఉన్నారంటే అది నటి సమంతనే. ఇటీవల అనూహ్యంగా తెరపైకి వచ్చి ఈ చెన్నై చంద్రం ప్రేమ, పెళ్లి విషయాలు ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారారు. అయితే సమంత టాలీవుడ్ నటుడు నాగచైతన్య ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం ఇటీవల వదంతుల పర్వంగానే సాగింది. సమంత కూడా తన ప్రియుడెవరన్న విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచినా తాను ప్రేమలో పడ్డ విషయాన్ని ఇటీవల స్పష్టంగానే బహిరంగపరిచారు. నాగచైతన్య నటుడు నాగార్జున వారసుడన్న విషయం తెలిసిందే. వారి పెళ్లికి కుటుంబసభ్యులు పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అసలు విషయం ఏమిటంటే సమంత నాయకిగా ప్రస్తుతం టాప్ లెవల్లో కొనసాగుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం అఆ ఘనవిజయాన్ని సాధించింది. ఇటీవల తమిళంలో నటించిన తెరి, 24 చిత్రాలు పెద్ద విజయాలను అందుకున్నాయి. అయినా ప్రస్తుతం ఈ చెన్నై చిన్నది ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో నటిస్తున్న ఆ తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు. అంతే కాదు చాలా కాలం క్రితమే నటుడు ధనుష్‌కు జంట గా నటించడానికి అంగీకరించిన తమిళ చిత్రం వడచెన్నై నుంచి వైదొలగినట్లు తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం. పొల్లాదవన్, ఆడుగళం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత దర్శకుడు వెట్రిమారన్, నటుడు ధనుష్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వడచెన్నై. అయితే చాలా కాలంగా ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మూడు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. దీంతో పెళ్లికి సిద్ధమైన నటి సమంత ఈ చిత్రం నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కమిట్ అయినందుకు ఒక భాగంలో నటించినా, రెండు, మూడు భాగాల్లో నటించకపోతే బాగుండదన్న విషయాన్ని నటుడు ధనుష్‌కు వివరించి చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపినట్లు, అందుకు ఆయనా సరే అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదన్నది గమనార్హం.