breaking news
V. Nagi Reddy
-
మోగిన పంచాయతీ నగారా!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 12,732 గ్రామ పంచాయతీలు, 1,13,170 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 7–21 తేదీల మధ్యలో తొలి దశ, 11–25 తేదీల మధ్యలో రెండో దశ, 16–30 మధ్యలో మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న తొలి దశ కింద 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ కింద ఈ నెల 25న 4,137 గ్రామ పంచాయతీలు, 36,620 వార్డుల్లో, మూడో దశ కింద ఈ నెల 30న 4,115 గ్రామ పంచాయతీలు, 36,718 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మూడు దశల కింద మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. తొలుత వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లతో అదే రోజు ప్రిసైడింగ్ అధికారి సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. చెయ్యెత్తే పద్ధతిలో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 200 లోపే ఉండడం, ఎక్కడా 600 మందికి మించి ఓటర్లు లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం సరిపోతుందని నాగిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా, 19 పంచాయతీలు మినహా అన్ని చోట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 17 పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం తీరకపోవడం, మరో రెండు పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో 1,48,033 మంది ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. ఓటేయనున్న కోటిన్నర మంది ఓటర్లు గతేడాది మే 17న ప్రచురించిన గ్రామీణ ఓటర్ల జాబితా ప్రకారం 68,50,309 మంది పురుషులు, 68,66,300 మంది మహిళలు, 860 మంది ఇతరులు కలిపి మొత్తం 1,37,17,469 మంది ఓటర్లున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా గత నవంబర్ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించగా, మొత్తం పల్లె ఓటర్ల సంఖ్య 1,49,52,058కు పెరిగింది. మరో వారం రోజుల్లో రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించనుండడంతో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరగనుంది. గుర్తింపు రాజకీయ పార్టీలకు గతేడాది మే నెలలో ఓటర్ల జాబితాలను పంపిణీ చేశామని వి.నాగిరెడ్డి ప్రకటించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఓటేసేందుకు అవకాశం ఉండదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒక కార్డును పట్టుకొస్తే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. డిపాజిట్లు, ఎన్నికల వ్యయ పరిమితులు సర్పంచ్ స్థానానికి పోటీచేసేందుకు జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్‌ను చెల్లించాలి. జనరల్ కేటగిరీ వార్డు మెంబరు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250ల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 5వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5లక్షలలోపు, వార్డు అభ్యర్థులు రూ.50వేలలోపు.. 5వేల లోపు జనాభా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5లక్షలలోపు, వార్డు అభ్యర్థులు రూ.30వేల లోపు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయం నిర్దేశించిన పరిమితులకు మించితే తీవ్ర చర్యలు తప్పవని నాగిరెడ్డి హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేస్తే.. ఎన్నికల్లో గెలిచినా అనర్హత వేటు పడవచ్చన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రాశామని, ప్రభుత్వం ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అనుసరించి ఉంటుందని భావిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదన్నారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేరుండదు ! ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని నాగిరెడ్డి తెలిపారు. 3 కోట్ల బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశామన్నారు. 3,36,34,279 బ్యాలెట్ పేపర్లు, 92,223 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేరు ఉండదని, కేవలం ఎన్నికల గుర్తు మాత్రమే ఉంటుందన్నారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేరుతో పాటు చివర్లో నోటా ఉంటుందన్నారు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు లెక్కలను సమర్పించని కారణంగా 12,745 మందిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేశామన్నారు. వీరిలో సర్పంచ్‌గా గెలిచిన 9 మంది, పోటీ చేసిన 1300 మంది, వార్డు సభ్యుడిగా గెలిచిన 1266 మంది, పోటీ చేసిన 8,528 మంది, జడ్పీటీసీగా పోటీచేసి ఓడిపోయిన 311 మంది, ఎంపీటీసీగా పోటీచేసి ఓడిపోయిన 1,331 మంది అభ్యర్థులున్నారన్నారు. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్! షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచ్చిందని వి.నాగిరెడ్డి ప్రకటించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించడానికి వీలుండదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల యాత్రకు ఎన్నికల కోడ్ వర్తించదని, అయితే ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మైక్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతిస్తామన్నారు. మిగిలిన సమయాల్లో మైకుల ద్వారా శబ్ధకాలుష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రైవేటు వ్యక్తుల డబ్బులను జప్తు చేయమని, కేవలం ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రవాణా చేసే డబ్బును మాత్రమే పట్టుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ఆపండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారానికి, హోర్డింగులు పెట్టేందుకు ప్రభుత్వ భవనాలను టీఆర్ఎస్ వాడుకుంటోందని ఆయనకు చెప్పారు. అధికార పక్షానికి అధికారులు వంతపాడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన హోర్డింగులను, ప్రభుత్వ భవనాలకు కట్టిన ఫ్లెక్సీలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
నియమావళి పటిష్టం
ప్రశాంత ఎన్నికలకు పార్టీలు సహకరించాలి ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి సిటీబ్యూరో: త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం టూరిజం ప్లాజాలో రాజకీయపార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వార్డుకొక రిటర్నింగ్ అధికారిని నియమించినట్లు తెలిపారు. దాదాపు 7750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని , 10 వేల ఈవీఎంలను ఎన్నికలకు వినియోగిస్తుండగా, మరో రెండువేల ఈవీఎంలను అదనంగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరు మించి సంతానం ఉండరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని, టెండర్ ఓట్లు 0.1 శాతం కంటే ఎక్కువ పోలైతే రీపోలింగ్‌కు అవకాశముందని తెలిపారు. అభ్యర్థుల గరిష్ట వ్యయం పరిమితి రూ. 2లక్షలుగా నిర్ణయించామని, ఎన్నికల ఖర్చుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలని తెలిపారు. నామినేషన్ డిపాజిట్ రూ. 5వేలు కాగా, ఎస్సీ,ఎస్టీలకు నామినేషన్ రూ. 2500 లని చెప్పారు. వ్యయపరిమితిని రూ. 2 లక్షలకంటే పెంచాలని వచ్చిన సూచనల్ని పరిశీలిస్తామన్నారు. దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరమైన హైదరాబాద్ ఎన్నికలు ప్రశాం తంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాల్సిందిగా కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను ప్రజ లకు మరింత అందుబాటులో ఉంచేందుకు మొట్టమొదటిసారిగా ఓటర్ల పోలింగ్ కేంద్రాలను వెబ్సైట్లో తెలుసుకునేలా, పోల్స్లిప్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూ డా కల్పించామన్నారు. సమావేశంలో ప్రధాన పార్టీల ప్రతినిధులతోపాటు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి(టీఆర్ఎస్), వనం రమేశ్(టీడీపీ), వెం కటరెడ్డి(బీజేపీ), సుధాకర్(సీపీఐ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎం.శ్రీనివాస్(సీపీఎం), రామకృష్ణ(బీఎస్పీ) తదితరులు మాట్లాడారు. వివిధ అంశాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఎన్నికల తేదీ పొడిగించాలి: మర్రిశశిధర్‌రెడ్డి (కాంగ్రెస్) డిసెంబర్ 15 లోగా పూర్తికావాల్సిన వార్డుల రిజర్వేషన్లు పూర్తికానందున, అందుకనుగుణంగా ఎన్నికల తేదీని పొడిగించాలి. హైకోర్టుకిచ్చిన సమాచారం మేరకు, జనవరి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియపూర్తిచేసేందుకు డిసెంబర్ 15 నాటికే వార్డుల రిజర్వేషన్లు పూర్తి కావాల్సి ఉంది. అది ఆలస్యం జరిగినందునఎన్నికలు కూడా జనవరి తర్వాత జరపాలి. లేని పక్షంలో న్యాయపోరాటానికి వెనుకాడం. నగరంలో పెద్దయెత్తున వెలసిన రాజకీయఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి. మరింత సమయం అవసరం లేదు: జాఫ్రీ (ఎంఐఎం) వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాక ఇక అభ్యంతరాలకు ఆస్కారముండదు. చట్టం, నిబంధనల మేరకు వార్డుల్ని వెలువరించాక నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరపవచ్చు. ఎన్నికల తేదీని పెంచాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్లు వచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. అంతా గందరగోళం: శివకుమార్ (వైఎస్సార్సీపీ) వార్డుల డీలిమిటేషన్లో, బీసీ జాబితాలో అంతా గందరగోళం జరిగింది. అవి సరిచేయకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదు. వార్డుల రిజర్వేషన్లకు, ఎన్నికల షెడ్యూలుకు మధ్య కనీసం వారం రోజుల వ్యవధి ఉండాలి. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి తలొగ్గి వ్యవహరించొద్దు. అలా చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారు.