breaking news
unqualified persons
-
తెలంగాణ: అర్హతలేని వైద్యులు 19.08 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యులుగా అవతారం ఎత్తిన అనర్హుల సంఖ్య గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అర్హతలేని వైద్యులు తెలంగాణలో ఐదోవంతు మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆ సంస్థ ‘హెల్త్ వర్క్‌ఫోర్స్ ఇన్ ఇండియా’పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 19.08 శాతం మంది గుర్తింపుపొందిన సంస్థ నుంచి ఎలాంటి వైద్యపట్టా పొందకుండా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయసగటు 17.93 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక 58.24 శాతం మంది అర్హత లేకుండానే నర్సులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. 10 వేల జనాభాకు 7.3 మంది డాక్టర్లు... దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లలో 3.52 శాతం మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి 10 వేల మంది జనాభాకు 7.3 మంది డాక్టర్లు, 13.8 మంది నర్సులున్నారు. సంప్రదాయ వైద్యంలో 10 వేల మంది జనాభాకు 3.4 శాతం మంది డాక్టర్లున్నారు. ఒక డాక్టర్‌కు ఇద్దరు నర్సులు, ఒక ఏఎన్ఎం ఉండాలి. అయితే ఈ లెక్క తెలంగాణలో సరిపోయింది. రాష్ట్రంలోని డాక్టర్లలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది స్త్రీలు ఉన్నారు. నర్సుల్లో 83 శాతం మంది మహిళలు ఉన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వైద్యపట్టా ఉన్నవారిలో 67 శాతం మంది ప్రాక్టీస్ చేస్తుండగా ఏడు శాతం మంది వైద్య నిరుద్యోగులుగా ఉన్నారు. మరో 27 శాతం మంది అవకాశం ఉండి కూడా ఖాళీగా ఉంటున్నారు. నివేదికలో తెలంగాణ ముఖ్యాంశాలు ►27,600 మంది అల్లోపతి డాక్టర్లు, 52,500 మంది నర్సులు ఉన్నారు. ►ఆయుష్ డాక్టర్లు 12,800 మంది, డెంటల్ డాక్టర్లు 6,700 మంది ఉన్నారు. అనుబంధ రంగాల ఆరోగ్య కార్యకర్తలు 54,900, ఫార్మసిస్టులు 12,100 మంది ఉన్నారు. ►30–40 ఏళ్ల మధ్య వయస్సు డాక్టర్లు 73 శాతం, 41–50 ఏళ్లవారు 18.53 శాతం, 51–65 ఏళ్ల/వారు 8.2 శాతం మంది ఉన్నారు. ►నర్సుల్లో 15–29 మధ్య వయస్సువారు 25.49 శాతం, 30–40 ఏళ్ల వయస్సువారు 31.5 శాతం, 41–50 ఏళ్ల వయస్సువారు 43 శాతం మంది ఉన్నారు. ఊ డాక్టర్లు 35 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో, 65 శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు. నర్సులు 42 శాతం పల్లె ప్రాంతాల్లో, 58 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. ►86 శాతం మంది డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేదా సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 14 శాతం మంది కేవలం ప్రభుత్వ సర్వీసుల్లోనే పనిచేస్తున్నారు. నర్సుల్లో దాదాపు సమాన సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ►సబ్ సెంటర్లలో 2,324 ఏఎన్ఎం, పీహెచ్‌సీల్లో 187 వైద్య సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 41 అల్లోపతి డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ పోస్టులు 151, నర్సుల పోస్టులు 164 ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 296 నర్సులు, 122 ఎంబీబీఎస్ డాక్టర్లు, 367 స్పెషలిస్ట్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆయుష్ డాక్టర్ల పోస్టులు 27 ఖాళీగా ఉన్నాయి. ►పదివేల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్యలో తెలం గాణ దేశవ్యాప్తంగా ఏడో స్థానాన్ని ఆక్రమిం చింది. నర్సుల్లో 10వ స్థానంలో నిలిచింది. ►అల్లోపతి డాక్టర్లు, నర్సుల సంఖ్య విషయమై దేశంలో రాష్ట్రం 11, డెంటల్ డాక్టర్ల సంఖ్యలో 7, ఫార్మసిస్టుల్లో 8 స్థానాల్లో ఉంది. అర్హతలేనివారు డాక్టర్లుగా చలామణి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఐదోవంతు మంది అర్హతలేనివారే వైద్యులుగా చలామణి అవుతుండటం విస్మయం కలిగించే అంశం. ప్రైవేట్ ప్రాక్టీషనర్లుగా చలామణి అయ్యేవారు కూడా వీరిలో ఉన్నారు. వైద్య, డెంటల్, ఆయుష్, నర్సు కోర్సులు వంటివేవీ చదవకుండా ఆయా రంగాల్లో చలామణి కావడాన్ని నివేదిక బట్టబయలు చేసింది. – డా.కిరణ్ మాదల, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ప్రాణాలతో చెలగాటం
గుంటూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సుమారు నాలుగువేల మందుల షాపులు ఉండగా ఒక్క గుంటూరులోనే సుమారు 700 వరకు ఉన్నాయి. వీటిల్లో చాలా షాపులు నిబంధనల మేర నిర్మాణం జరగలేదు. పేరుగాంచిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం మందుల షాపులు సక్రమంగా లేవు. కొందరు చిన్న సందులో, మరి కొందరు ఇరుకు గదుల్లో ఇలా ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో ఉన్నాయి. నిర్మాణ లోపాలతోపాటుగా ఔషధాలు పాడవకుండా నిల్వ చేసేందుకు కొన్ని షాపుల్లో శీతలీకరణ యంత్రాలూ లేవు. ఇటీవల సంగడిగుంటలోని ఓ మందుల షాపులో చిన్నపిల్లలకు సంబంధించిన మందులను స్థానికుడు కొనుగోలు చేశాడు. తీరా ఇంటికి వెళ్లి చూశాక అందులో పురుగులు దర్శనమిచ్చాయి. జీజీహెచ్‌లోని మెడికల్ స్టోర్‌లో కూడా ఇంజెక్షన్లో పురుగులు ప్రత్యక్షమవటంతో ఆస్పత్రి అధికారులు ఖంగు తిన్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం పలు విమర్శలకు తావిస్తుంది. తూతూ మంత్రంగా తనిఖీలు ఔషధ తనిఖీ అధికారులు నెలకు కనీసం 50 తనిఖీలు నిర్వహించాలి. అందులో 10 డ్రగ్ నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం పంపించాలి. కాని డ్రగ్ ఇన్స్పెక్టర్లు చేస్తున్న తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. షాపులో పదో తరగతి తప్పిన వ్యక్తి మందుఉయ అమ్ముతూ జిల్లా వైద్యాధికారులకు రెండేళ్ల కిందట దొరికిపోయాడు. చాలా షాపుల్లో అర్హత లేని వారే మందులను విక్ర యిస్తున్నారు. షాపుల నిర్వాహకులకుగాని, మందుల విక్రయాలు చేసే వారికి కాని అర్హతలు లేకుండానే జిల్లాలో జోరుగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ను దుకాణదారులు ఎగ్గొడుతున్నారు. ఇటీవల జీజీహెచ్‌లోని జనరిక్ మందుల షాపులో బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేసిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆరు లక్షల రూపాయలు జరిమానా విధించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లుకు ఈ విషయం తెలిసినప్పటికీ తమకు వచ్చే మామూళ్ల వల్ల వ్యాపారస్తులపై ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ వివరణ.. నిబంధనల ప్రకారం ఉన్న మందుల షాపులకే అనుమతులు ఇస్తున్నట్లు గుంటూరు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. తన పరిధిలో సుమారు 700 వరకు మందుల షాపులు ఉన్నాయని, వాటిల్లో నిబంధనలు పాటించని ఐదుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి నెలా తన పరిధిలోని 50 మందుల షాపులను నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్టు వెల్లడించారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. హోల్‌సేల్, రిటైల్ మందుల షాపులను నిర్మించాలంటే తప్పని సరిగా 15 స్కేర్ మీటర్లలో నిర్మించాలి. రిటైల్షాపునకు తప్పని సరిగా ఫార్మసీ అర్హత కలిగిఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ (బి.ఫార్మసీ లేదా డిఫార్మసీ విద్యార్హత)లో రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. మందులు, ఇంజెక్షన్లు పాడవుకుండా డ్రగ్స్ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్‌ను షాపులో ఏర్పాటు చేయాలి.