breaking news
United movements
-
హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు
తిరుపతి, న్యూస్‌లైన్ : సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం తిరుపతిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత కాంగ్రెస్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారన్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణల సవరణల ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 విభాగాలపై అధికారాలను దాఖలు పరచి స్థానిక స్వపరిపాలన, స్వయం పోషకత్వాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు, హక్కుల సాధనకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ.అరవిందనాథరెడ్డి, బిర్రు ప్రతాప్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, కాట్రగడ్డ రఘు, టంకాల బాబ్జీ, వీరంకి గురుమూర్తి, సుమతి, చింతాల సోమన్న, జగ్గాల రవి, పడాల వెంకట్రామారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్తం.. సమైక్యం
సాక్షి, తిరుపతి: జిల్లాలో బుధవారం 22వ రోజూ సమైక్య ఉద్యమాలు కొనసాగాయి. చిత్తూరు ఎమ్మెల్యే సీకే.బాబు తిరుమలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ చిత్తూరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షకు టీడీపీ నేత కఠారిమోహన్, న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ, ప్రజలు మద్దతు పలికారు. వరదయ్యపాళెంలో వైఎస్సార్ సీపీ నాయకుడు చిన్న, అడ్వొకేట్ దశరథయ్య చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షను బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. నగరిలో సత్యస్వరూప ఇందిర ఆమరణ దీక్షకు కూర్చొన్నారు. శ్రీకాళహస్తిలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విభజనపరులకు సమైక్య రక్తాన్ని ఎక్కించమంటూ చంద్రగిరిలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కొయ్య, కొలిమి, బంగారు పనులను చేస్తూ నిరసన తెలిపారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో తెలంగాణ ఉద్యోగులకు రాఖీలు కట్టి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. నగరంలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, వర్కర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఉద్యోగులు, నాలుగుకాళ్ల మండపం వద్ద కేబుల్ ఆపరేటర్లు, టౌన్‌క్లబ్ వద్ద ఎన్జీవోలు, ఎస్వీయూలో విద్యార్థులు, ఆర్టీసీ బస్టాం డ్లో ఉద్యోగ, కార్మికులు, కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సాప్స్ నేతలు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్డీవో కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. జాతీయ జెండాతో నిరసన ర్యాలీ పుత్తూరులో సమైక్యవాదులు అతి పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. నగరిలో చేనేత కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సత్యవేడులో ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేశారు. నాగలాపురం, నారాయణవనంలో ర్యాలీ నిర్వహించారు. కుప్పంలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు. అన్ని మండల కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాలు ఊపందుకున్నాయి. పలమనేరులో బుద్ధిమాంద్యం పిల్లలు ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో ఆటో యూనియన్లు ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులతో కలిసి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. గంగవరం మండలంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీకోట మండలంలో సుమో, జీపు డ్రైవర్లు విద్యార్థులతో కలసి ర్యాలీ చేశారు. అరగుండుతో నిరసన పీలేరులో విశ్వనాథరెడ్డి, మదనపల్లె మల్లికార్జున కూడలిలో భాస్కర్ అరగుండుతో నిరసన తెలిపారు. పీలేరులో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు దహన సంస్కారాలు చేశారు. వివిధ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. మదనపల్లెలో రవాణా శాఖ జేఏసీ, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల ఆధ్వర్యంలో సుమారు 100 ప్రైవేటు, ఆర్టీసీ బస్సులతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మిట్స్ కళాశాల ఆధ్వర్యం లో వాహనాల ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్‌లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త షమీమ్ అస్లాం ఆధ్వర్యంలో గాడిదలకు కేసీఆర్ బొమ్మను తగిలించి నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నీరుగొట్టివారిపల్లెలో వివేకానంద మున్సిపల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిలో ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పెనుమూరులో డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పుంగనూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు సంఘీభావం చిత్తూరులో వైఎస్సార్ సీపీ నేత ఏఎస్.మనోహర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పూతలపట్టు సమన్వయకర్తలు, టీడీపీ నేత కఠారిమోహన్ మద్దతు పలికారు. ఎంఎస్ఆర్ కూడలి వద్ద విద్యార్థినీ విద్యార్థులు మానవహారం నిర్వహించి సంఘీభావం తెలిపారు. కుప్పం, రామకుప్పం మండలాల్లో వైఎస్సార్ సీపీ నేతల ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. శాంతిపురంలో రిలేదీక్షలు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్ సీపీ నేత గుమ్మడి బాలకృష్ణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. పీలేరు మండలం తలుపులలో మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ కే.రజియా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పుంగనూరులో వైఎస్సార్ సీపీ నేతల రిలే దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పీటీఎం మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేతలు రిలే దీక్షలు ప్రారంభించారు.