breaking news
Union Budget-2023
-
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్‌లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్‌లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
ఫిబ్రవరి 2న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: వాడీవేడీ చర్చలకు వేదికగా నిలిచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఉభయసభలనుద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ బిర్లా గతంలో ప్రకటించారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాతి విడత మార్చి 12న మొదలై ఏప్రిల్ ఆరో తేదీన పూర్తికానుంది. ప్రధాన సమస్యలపై నిలదీత! 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాజా ఆర్థిక పరిస్థితి, సన్నగిల్లిన కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, పెరిగిన చైనా సరిహద్దు వివాదం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ల జోక్యం, గౌతమ్ అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ సంచలనాత్మక నివేదిక, జాతీయస్థాయి కుల గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కొన్ని పార్టీలు ‘బాయ్‌కాట్’ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ సహా డీఎంకే, టీఎంసీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకోగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈసారి బడ్జెట్ సెషన్ మొత్తం 27 సిట్టింగ్‌లలో ఉండనుంది. ఈ సారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ డుమ్మా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నా«థ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, మంత్రులు పీయూశ్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, శివసేన, బీజేడీ తదితర 27 పార్టీల తరఫున 37 మంది నేతలు హాజరయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి విపక్షాలు సహకరించాలని మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించాల్సిందేనని విపక్షాల నేతలు డిమాండ్‌చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభా పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరీ, మల్లికార్జున ఖర్గే కశ్మీర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లడంతో భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కాంగ్రెస్ పక్షనేతలు తనను కలసి తమ అభిప్రాయాలు పంచుకుంటారని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. తృణధాన్యాలతో వంటకాలు పార్లమెంట్ క్యాంటీన్లో ఈసారి తృణధాన్యాలతో చేసిన వంటకాలు ఎంపీలకు కొత్త రుచులను అందివ్వనున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు ఇలా పలు రకాల చిరుధాన్యాలతో వండిన ఆహార పదార్థాలు ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు క్యాంటీన్లో అందుబాటులో ఉంచుతారు. -
ఆకాంక్షలు నెరవేరేనా
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ఇదే. ఎంత కాదన్నా బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల ప్రభావం కొన్ని వర్గాలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు 9 ఏళ్లుగా పాలిస్తోంది. మరోసారి ప్రజామోదం కోసం బడ్జెట్‌ను ఒక అవకాశంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తారా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటారా? అన్నది ఫిబ్రవరి 1న తేటతెల్లం అవుతుంది. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. డిమాండ్ పరిస్థితులు దీన్నే తెలియజేస్తున్నాయి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. నిర్మలమ్మకు ఇది ఐదో బడ్జెట్ కానుంది. మధ్యతరగతికి ‘ఐటీ’ తాయిలం..? రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదు. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లుగా ఇదే బేసిక్ పరిమితి కొనసాగుతోంది. రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించారు. కానీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఔషధాల భారాన్ని దింపరూ.. పరిశోధన, అభివృద్ధికి, ఫార్ములేషన్, ఏపీఐల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలపై జీఎస్టీని సులభతరం చేయాలని కోరుతున్నాయి. దేశ ఫార్మా పరిశ్రమ 2023 ముగిసే నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్నా.. సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం (ఎస్ఈఐఎస్) కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకూ వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65 శాతంగా ఉందని, కనుక ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఈ భారాన్ని దింపొచ్చని పరిశ్రమ కోరుతోంది. పాలసీదారులు/బీమా కంపెనీలు మనదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ అంతర్జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పెట్టుకుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంతో మందికి భారంగా పరిణమించిదని, దీన్ని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోంది. ఉదాహరణకు రూ.10,000 ప్రీమియంపై రూ.1800 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పన్ను తగ్గింపుతో ప్రీమియం తగ్గడం వల్ల మరింత మంది బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తారని పరిశ్రమ చెబుతోంది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నెరవేర్చితే అది కచ్చితంగా బీమా వ్యాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా అధిక కవరేజీనిచ్చే టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతుంని పరిశ్రమ అంటోంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం ఒక కుటుంబానికి రూ.25,000 వరకు ఉంటే సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు కావాలని, యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) ఆదాయంపై పన్ను ఎత్తేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలని బీమా రంగం కోరుతోంది. ఉపాధి కల్పన అమెరికా, యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కారు భారత్‌లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీనికింద ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ పేరుతో దేశీ తయారిని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం పీఎల్ఐ ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్‌తో తెలుస్తుంది. స్టార్టప్‌లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. ఫిన్‌టెక్/ఎంఎస్ఎంఈ దేశీ ఫిన్‌టెక్ పరిశ్రమ తమకు మరిన్ని మద్దతు చర్యలు కావాలని కోరుతోంది. అందరికీ ఆర్థిక సేవల చేరువలో తమ పాత్ర కీలకమని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు కీలకంగా వ్యవహరిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అవసరాలు తీర్చడంలోనూ ఫిన్‌టెక్ పరిశ్రమ చేస్తున్న సేవలను గుర్తు చేసింది. 45 శాతం మందికి ఉపాధినిస్తూ, జీడీపీలో 30 శాతం వాటాను ఎంఎస్ఎంఈ పరిశ్రమ కలిగి ఉంది. కనుక బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఫిన్‌టెక్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కార్పొరేట్ రంగం డిమాండ్.. కొత్తగా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే దేశీ కంపెనీలకు అతి తక్కువగా 15 శాతం కార్పొరేట్ పన్నును కేంద్రం లోగడ ప్రకటించింది. 2024 మార్చి 31లోపు తయారీ కార్యకలాపాలు ఆరంభించేవి ఈ ప్రయోజనం పొందొచ్చు. ఈ గడువును పొడిగించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయట పడేందుకు కంపెనీలకు సమయం పట్టిందని.. ఇప్పుడు నూతన పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నందున గడువు పొడిగించాలనే డిమాండ్ ఉంది. కొత్త ప్లాంట్ తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కనీసం 2–3 ఏళ్లు పడుతుందని, కనుక ప్రస్తుత గడువు చాలదన్న అభిప్రాయం ఉంది. ఆదాయపన్ను విషయంలో ఊరట కల్పిస్తే అది హౌసింగ్ పరిశ్రమ వృద్ధికి మేలు చేస్తుందని రియల్టీ భావిస్తోంది. భారీ ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం తమకు క్షేత్రస్థాయిలో రుణ లభ్యత సమస్యగా ఉందని చెబుతోంది. ఎంఎస్ఎంఈ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కీలకమైన ఆటోమొబైల్ రంగం పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. కనిష్టంగా 28%, గరిష్టంగా 40 శాతానికి పైనే వాహనాలపై పన్నుల భారం వేస్తున్నారని.. మార్కెట్ విస్తరణకు ఇది అవరోధంగా నిలుస్తున్నట్టు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ కోర్కెలు మూలధన లాభాల పన్ను పరంగా ఉపశమనం కల్పిస్తే అది మార్కెట్లకు మంచి జోష్‌నిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెట్, ఈక్విటీ, ప్రాపర్టీలకు వేర్వేరు మూలధన లాభాల పన్ను, హోల్డింగ్ పీరియడ్ అమలవుతున్నాయి. వీటి మధ్య ఏకరూపతకు అవకాశం ఉందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఇప్పటికే సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలోనే మూలధన లాభాల పన్ను విషయమై అంచనాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాల మూలధన లాభాలపై నష్టాన్ని, స్వల్పకాల మూలధన లాభాలతో సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యారంగం దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కారు ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై జీఎస్టీ భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకుని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలనే డిమాండ్ ఉంది. గృహ కల్పన అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కారు నినాదం. దీని సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరల ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్‌పై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. రైతులను చూస్తారా..? సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావాల్సిన ముడి సరుకుల కోసం ఇస్తున్న రూ.6,000ను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పనిలేకుండా సాగుకు కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రి టెక్ స్టార్టప్‌లకు రాయితీలు కల్పించాలని, ఆగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముడి చమురు మాదిరే వంట నూనెల విషయంలోనూ 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీంతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్’ పేరుతో నూనె గింజల సాగుకు ఆర్థిక సహకారం అందించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఏటా రూ.25,000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించాలని కేంద్రానికి సూచించింది. దీనివల్ల దిగుమతులను 30 శాతానికి తగ్గించొచ్చని పే ర్కొంది. సాగు రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్న బడ్జెట్లో వ్యవసాయానికి మెరుగైన కేటాయింపులు చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్‌కు పెద్ద పీట వేస్తారా? ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20–30 శాతం పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గర్తు చేసింది. హెల్త్‌కేర్ రంగానికి 2022–23 బడ్జెట్లో 16.5 శాతం అధికంగా రూ.86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపుల పట్ల భారీ అంచనాలతో ఉన్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా హెల్త్‌కేర్ పరిశ్రమ డిజిటైజేషన్‌కు అదనపు నిధులు అవసరమని అపోలో టెలీహెల్త్ సీఈవో విక్రమ్ తాప్లూ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పటికీ, వీటి విస్తరణకు మరిన్ని నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్ సేవల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు అవసరమని డాక్టర్ అగర్వాల్ సైతం పేర్కొన్నారు. స్వచ్చందంగా మెడికల్ ఇన్సూరెన్స్‌కు ప్రతిపౌరుడికీ అవకాశం కల్పించాలని కోరారు. అది కూడా ఉచితంగా అందించాలని సూచించారు. కేన్సర్ కేర్ వసతుల పెంపునకు మరిన్ని నిధులు అవసరమని నిపుణుల సూచనగా ఉంది. హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలనే డిమాండ్ సైతం ఉంది. – బిజినెస్ డెస్క్