breaking news
UAE Woman
-
టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న భారత్, పాక్ మ్యాచ్!
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 24న (ఆదివారం) జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను రూపొందించింది. దాయాది సమరాన్ని ఆదివారం జరిపితే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. టి20 షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్లతో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా గ్రూప్‌లో చేరుతాయి. -
3 రోజుల్లో లోకం చుట్టిన వనిత
నవంబర్ 18, 2020 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ వారు 3 రోజుల 14 గంటల్లో (87 గంటలు) 7 ఖండాలు చుట్టిన వనితగా అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్ ఖాలా అల్రొమైతీని ప్రకటించారు. ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఘనత సాధించింది. గతంలో అమెరికన్ నటి జూలీ బెర్రీ 92 గంటల్లో ఈ రికార్డ్ సాధించారు. ‘మా దేశం చిన్నదే కావచ్చు. కాని మేం కూడా రికార్డులు సాధించగలమని నిరూపించడానికే ఈ ప్రయాణం కట్టాను’ అంటున్నారు డాక్టర్ ఖాలా. ‘లోకం చుట్టిన వీరుడు’ అని సినిమా ఉంది. ఎం.జి.ఆర్ హీరో. ‘లోకం చుట్టిన వీరురాలు’ అని ఎవరూ సినిమా తీయలేదు. ఎందుకంటే లోకం చుట్టే పని పురుషుడిది అని లోకం అభిప్రాయం. సాహసయాత్రలు చేసిన సింద్బాద్, గలీవర్లు పురుషులే. కాని స్త్రీలు చేసిన సాహసప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే వెలికి తీసి గ్రంథస్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే అతి తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డు (ఏడు ఖండాలను తాకిన) ఒక వనితకు సొంతం కావడం. ఆ వనిత పేరు డాక్టర్ ఖాలా అల్‌రొమైతీ. యు.ఏ.ఇ దేశస్తురాలు. ఆమె ఫిబ్రవరిలో దాదాపు కరోనా దుమారం మొదలవుతున్న సమయంలో ఈ రికార్డు సాధించి తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కింది. నవంబర్ 18, 2020న ఆమె రికార్డును అధికారికంగా ప్రకటించారు. 3 రోజుల 14 గంటలు స్త్రీలను నాలుగు గోడల మధ్య ఉంచే పురుష సమాజం ఇది. ఇక ఇస్లామీయ సమాజాలలో వారికి స్వేచ్ఛ ఉండదనే ప్రచారం ఉంటుంది. కాని అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ ఖాలా ఈ లోకాన్ని చుట్టిన వనితగా రికార్డ్ సాధించాలనుకున్నారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ కరోనా సంగతి తెలియని రోజుల్లోనే 2020 సంవత్సరానికి ‘డిస్కవర్ యువర్ వరల్డ్’ అనే థీమ్ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు. ఇక మా దేశంలో అన్ని దేశాల పౌరులు నివసిస్తారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఏ దేశం వారినైనా మీరు చూడొచ్చు. వారందరూ రావడం వల్లే మా దేశం ఎంతో కళకళలాడుతుంది. అందుకని వారికి కృతజ్ఞతగా కూడా వారున్న దేశాలను, ఖండాలను చుట్టి రావాలని అనుకున్నారు’ అంటారు డాక్టర్ ఖాలా. ఫిబ్రవరిలో మొదలైన ఆమె ప్రయాణం ఫిబ్రవరి 13, 2020న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ముగిసింది. అంటే అంతకు నాలుగు రోజుల ముందు ఆమె దుబాయ్ నుంచి బయలుదేరిందన్న మాట. ఏడు ఖండాలను తాకి ఆస్ట్రేలియాలో యాత్ర ముగించడానికి ఆమె తీసుకున్న సమయం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లు. ఇంతకు ముందు ఉన్న రికార్డు ఏడు ఖండాలను అత్యంత తక్కువ టైమ్‌లో చుట్టి రావాలని ఇంతకు ముందు అనుకున్నది కూడా ఒక స్త్రీనే. ఆమె పేరు జూలీ బెర్రీ. అమెరికన్ నటి. ఆమె తన స్నేహితుడు కేసె స్టివార్ట్తో కలిసి ‘72 గంటల్లో 7 ఖండాలు’ అనే రికార్డు యాత్ర చేసింది. 13 డిసెంబర్ 2017న సిడ్నీలో మొదలుపెట్టి డిసెంబర్ 16న చిలీలో తన యాత్ర ముగించింది. అయితే ఆమె ఆశించినట్టుగా 72 గంటల్లో కాక యాత్ర 92 గంటల్లో ముగిసింది. అయినప్పటికీ అది అత్యంత తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డుగా గిన్నిస్ బుక్‌లో నమోదైంది. ఈ యాత్రలో జూలీ ఆమె మిత్రుడు దాదాపు 48 గంటలు అసలు నిద్ర లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ టెన్ టు సిక్స్ చేసే పని పట్ల విసుగు ఉండటం వల్లే ఈ యాత్ర చేసి విజయవంతం అయ్యారు. నా కుటుంబం తోడు నిలిచింది ‘యాత్ర మొదలెట్టానన్న మాటే కాని మధ్యలో చాలాసార్లు అనుకున్నాను ఆగి వెనక్కి వెళ్లిపోదామా అని. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. ఎయిర్‌పోర్టుల్లో ఫ్లయిట్లను పట్టుకోవడం అంత సులభం కాదు. కాని నా కుటుంబం నాకు అన్ని విధాలుగా సహకరించి యాత్ర పూర్తి చేసేలా చూసింది’ అన్నారు డాక్టర్ ఖాలా. ‘మాది చిన్న దేశమే అయినా రికార్డ్ సృష్టించిన విశేషాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తయిన భవనం మా దేశంలో ఉంది. లార్జెస్ట్ హైడెఫినేషన్ వీడియో వాల్ మా దేశంలో ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే పోలీస్ కార్ కూడా మాకే సొంతం. మా దేశ అధ్యక్షుడు, ప్రధాని.. ఇద్దరూ తమ పౌరులను గొప్ప పనులు చేయమని ప్రోత్సహిస్తుంటారు. మహిళల ముందంజకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వారిని చూసి కూడా నేను స్ఫూర్తి పొందాను’ అంటారు డాక్టర్ ఖాలా. ఖాలా వివాహిత. పిల్లల తల్లి. అయినప్పటికీ ఆమె ఈ అరుదైన రికార్డు కోసం సంకల్పం తీసుకున్నారు. ‘నా సాఫల్యం నా దేశానికి, నా సమాజానికి అంకితం ఇస్తున్నాను. నన్ను చూసి కలలు కనవచ్చని వాటిని సాఫల్యం చేసుకోవచ్చని ఎవరైనా స్ఫూర్తి పొందితే అంతే చాలు’ అన్నారు ఖాలా. పత్రికలు ఈ రికార్డు అనౌన్స్ అయ్యాక ఖాలాను మెచ్చుకుంటూ కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘ఆమె లోకం చుట్టింది. మనం ఇంకా పక్క మీద నుంచి లేవడానికే తాత్సారం చేస్తున్నాం’ అని హెడ్డింగ్ పెట్టింది. కదలడం జీవ లక్షణం. ఈ కరోనా తర్వాత ఎంత వీలైతే అంత లోకం చుడదామనుకునేవారు తప్పక ఖాలా వంటి మహిళలను చూసి స్ఫూర్తి పొందుతారు. – సాక్షి ఫ్యామిలీ -
నా భర్త అతి ప్రేమతో చచ్చిపోతున్నా..
అబుదాబి: సాధారణంగా భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు. అభిప్రాయబేధాలు వస్తేనో, వేధింపులు తట్టుకోలేకనో.. భార్యనో, భర్తనో మరో వ్యక్తితో సంబంధాలు పెట్టుకున్న సందర్భాల్లో విడిపోవాలని అనుకుంటారు. అయితే టెక్నాలజీ పెరిగాక వింత వింత కారణాలతో విడిపోతున్న జంటల సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరో విడాకులు వివాదం అందర్ని తెగ ఆకర్షిస్తోంది. భర్త అతి ప్రేమతో తనకు ఊపిరాడటం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వింత సంఘటన యూఏఈలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయ్యింది. తన భర్త అతి మంచితనం వల్ల తాను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భార్య కోర్టులో కేసు వేసింది. తాను చెప్పిన పనేకాక చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడని భర్తపై ఆరోపణలు చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. అందుకు ఆమె ‘అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు. పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు. అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి’ అని పేర్కొంది. భార్య ఆరోపణలపై భర్తను ప్రశ్నించగా.. తనకు తన భార్యంటే చాలా ప్రేమని, ఆమెను కష్టపెట్టడం ఇష్టం ఉండదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తన భార్య తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని చెప్పుకొచ్చాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని సదరు భర్త తేల్చి చెప్పాడు. వీరిద్దరి వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రస్తుతానికి కేసును వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మహిళను ఉరితీసిన యూఏఈ
రియాద్: ఉగ్రవాద చర్యలకు పాల్పడిందనే కారణంతో గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ దేశానికి చెందిన ఓ మహిళను ఉరితీసింది. 2014 డిసెంబర్లో అమెరికాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హతమార్చిన నేపథ్యంలో ఆమెకు సోమవారం ఉదయం ఉరిశిక్షను అమలు పరిచింది. అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి(31) అనే మహిళ గత ఏడాది అబుదాబిలోని ఓ షాపింగ్ మాల్ టాయిలెట్లో ఇద్దరి కవలల తల్లి అయిన అమెరికన్ టీచర్ ఇబోల్యా ర్యాన్‌ను కత్తితో పొడవడమే కాకుండా అక్కడే మరో అమెరికన్ ఈజిప్టు వైద్యుడిపై బాంబుదాడికి పాల్పడింది. అంతేకాదు ఆమెపై ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాపింపజేసిన ఆరోపణలున్నాయి. ఈ నేరాలకు సంబంధించి ఆమెకు గత ఏడాది యూఏఈ కోర్టు ఉరిశిక్ష విధించగా సోమవారం అమలుచేసింది. అయితే, ఎలా ఉరితీశారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా నిరసించే దేశాల్లో యూఏఈ ఎప్పుడూ ముందే ఉంటుంది.