హైదరాబాద్‌లో... బాబు...బంగారం!
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా రావడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. ‘గోపాల... గోపాల’ తర్వాత వెంకటేశ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ సినిమా విడుదలై ఏడాది పైనే అవుతోంది. దాంతో వెంకీ అభిమానులు ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే వెంకీ కూడా టకటకా సినిమా పూర్తి చేసేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బాబు బంగారం’ అనే టైటిల్ ప్రచారమవుతోంది.
చిత్రబృందం ఈ టైటిల్ వైపే మొగ్గు చూపుతోందని సమాచారం. ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాల తర్వాత వెంకీ, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. చినబాబు సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. హాస్యనటుడు ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి మీద కొత్త తరహా సీన్స్ తీస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది. వెంకటేశ్ కెరీర్లో విభిన్న తరహాలో సాగే చిత్రంగా ఇది నిలిచిపోతుంది. జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.