మెరుగైన విద్య అందించాలి
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లక్ష్మణ్
ఉట్నూర్ : గిరిజన సంక్షేమ ఆశ్రమ, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ లక్ష్మణ్ ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐటీడీఏ పీవో కర్ణన్, డీడీటీడబ్ల్యూ, సహాయ సంక్షేమాధికారులతో గిరిజన విద్య, ఉపకార వేతనాలు, పోషకాహారం, ట్రైకార్, కాస్మొటిక్స్పై సమీక్షించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యాభివృద్ధితోపాటు గిరిజన సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఐటీడీఏ పీవో కర్ణన్ వివరించారు.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన కాస్మొటిక్స్తోపాటు పాఠశాలల్లో ల్యాబ్, లైబ్రరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం సిబ్బంది ఆశ్రమాల్లో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సహాయ సంచాలకులకు వారి పరిధిలోని ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణకు వాహన సౌకర్యాలు అత్యవసరమని పీవో వివరించడంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నెలాఖరు వరకు బెడ్షీట్స్తోపాటు, కాస్మొటిక్స్ పూర్తి స్థాయిలో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో(జనరల్) నాగోరావ్, ఈఈటీడబ్ల్యూ రమేశ్, ఐకేపీ ఏపీడీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.