breaking news
Thota Prabhakar
-
అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలి
నెల్లూరు(క్రైమ్): అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలు జిల్లాలో శనివారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాల్లో భాగంగా తాము తీసుకుంటున్న చర్యలను ఏసీబీ డీఎస్పీ విలేకరులకు తెలియజేశారు. జిల్లాలో అవినీతిపరుల భరతం పట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా ఈ ఏడాది వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవినీతిపరులపై నిఘా ఉంచామన్నారు. 10 కేసుల్లో అవినీతి పరులైన అధికారులను కటకటాల వెనక్కి పంపామని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఏడు, ఐదు ఆకస్మిక తనిఖీలను నిర్వహించామన్నారు. అవినీతి అధికారులతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన అధికారులు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. తోట ప్రభాకర్‌రావు డీఎస్పీ – 94404 46184, శివకుమార్‌రెడ్డి సీఐ – 9440446186, శ్రీహరి ఎస్సై – 94404 46185, కార్యాలయం 0861 – 331833 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. వారోత్సవాలిలా... సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కృష్ణచైతన్య డిగ్రీ కళాశాలలో అవినీతి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మంగళవారం వాకర్స్, సీనియర్ సిటిజన్లతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, చిల్డ్రన్స్‌పార్క్‌లో సమావేశం, ఆరో తేదీ ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు బీవీనగర్‌లోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు డీకేడబ్ల్యూ కళాశాలలో పీజీ, డిగ్రీ విద్యార్థులకు అవినీతి – సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై ఇంగ్లిష్, తెలుగులో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. ఏడో తేదీన గాంధీబొమ్మ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, జిల్లాస్థాయి అధికారులతో భారీ ర్యాలీని నిర్వహించనున్నామని తెలిపారు. 8వ తేదీన ప్రజలతో మమేకం, తొమ్మిదో తేదీన సమావేశాన్ని నిర్వహించి వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేయనున్నామని ప్రకటించారు. బ్లూ రిబ్బన్‌ను ధరించాలి అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని, దేశాభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ప్రతిన బూనాలని కోరారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధిగా తమ చేతికి బ్లూ రిబ్బన్‌ను ధరించాలని సూచించారు. అనంతరం వారోత్సవాల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఏసీబీ సీఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై శ్రీహరి, ఏసీబీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీవో @ రూ.30 కోట్లు
సాక్షి, నెట్వర్క్: ప్రకాశం జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో) కె.రాంప్రసాద్‌కు చెందిన ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు, గూడూరు, గుంటూరు, తెనాలి, వినుకొండ, బెంగళూరు ప్రాంతాల్లోని ఆర్టీవోకు చెందిన ఆస్తులతో పాటు బంధువుల ఇళ్లపై నెల్లూరు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదాయానికి మించి దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బయటపడిందిలా..: రాంప్రసాద్ కుమార్తెకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ఏవో వరకుమార్ కుమారుడితో వివాహమైంది. అల్లుడికి కట్నం కింద రూ. 1.50 కోట్ల నగదు, కిలో బంగారు ఆభరణాలు, ఎకరా స్థలం, ఒక ప్లాటు ఇస్తానని రాంప్రసాద్ ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. కానీ కట్నం తక్కువ ఇచ్చాడని.. ఈ విషయమై గొడవల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.