breaking news
Tetra pack milk
-
అంగన్వాడీలకు టెట్రా ప్యాక్ పాలు
సాక్షి, వరంగల్ రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ 1 నుంచి విజయ పాల పాకెట్లకు బదులుగా.. టెట్రా ప్యాకెట్ పాలను సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండక.. పగిలిపోతుండటంతో.. 90 రోజుల పాటు నెలల పాటు నిల్వ ఉండే టెట్రా ప్యాక్ పాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 22, 28,150 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇందులో గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు. వీటిని వేడి చేసి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న విజయ డైరీ పాల ప్యాకెట్లు ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. ఒక్కోరోజు ఆలస్యం అయితే పాలు వేడి చేయగానే పగిలిపోయేవి. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు పాల ప్యాకెట్లు చేరడం కష్టంగా ఉండేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయ టెట్రా పాల ప్యాకెట్లను అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు విజయ టెట్రా పాల ప్యాకెట్లను నెలకు సరిపడా సరఫరా చేశారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 5,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరికి రోజుకు 200 మిల్లీలీటర్ల పాలను అందించనున్నారు. ఈ లెక్కన రోజుకు 1,06,262 లీటర్ల పాలు సరఫరా చేయనున్నారు. -
చిన్నారులపై టెట్రాప్యాక్ పాల ప్రయోగం
నల్లగొండ : నల్లగొండ శిశుగృహలోని చిన్నారుల మృతుల సంఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. అతితక్కువ బరువు కలిగిన చిన్నారులు శిశుగృహకు వస్తున్నారని, రోగనిరోధక శక్తి లోపించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. లోతుగా గమనిస్తే అధికారుల తప్పిదం ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. శిశుగృహలో గతంలో మృతిచెందిన చిన్నారులకు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వరుస మరణాలకు మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే పొరపాటు ఎక్కడ జరిగిందో అవగతమవుతోంది. కానీ ఆ దిశగా అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. 2016 ఏప్రిల్ నుంచి 2017 జూలై వరకు శిశుగృహలో మృతిచెందిన చిన్నారులు ఆరుగురు మాత్రమే. ఆ తర్వాత ఆగస్టు, నవంబర్, అక్టోబర్ అంటే మూడు నెలల్లోనే 11 మంది మృతి చెందారు. అదికూడా ఒక్క అక్టోబర్‌లోనే ఏడుగురు శిశువులు మృతిచెందడం గమనార్హం. వరుస మరణాలకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే అధికారుల తప్పిందం ఎక్కడ జరిగిందో బహిర్గతమవుతుంది. వికటించిన ప్రయోగం నాలుగైదేళ్ల నుంచి చిన్నారులకు లాక్టోజెన్ 1, 2, జీరోలాక్ పాల డబ్బాలనే వాడుతున్నారు. ఈ పాల డబ్బాలను నల్లగొండ పట్టణంలోని అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలకు అవసరమయ్యే ఇంజక్షన్లు, సబ్బులు, మందులు అపోలో నుంచే తెప్పిస్తున్నారు. అదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు శిశుగృహకు పాల డబ్బాలతో పాటు, ఇతర మందులను సప్లయ్ చేసేందుకు ఫిబ్రవరిలో టెండర్లు పిలిచారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో నాలుగైదు ఏజెన్సీలు పోటీ పడగా.. దీంట్లో అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియ పూర్తికాగా.. మార్చి నుంచి శిశుగృహకు పాల డబ్బాలు, మందులను అపోలో పంపిణీ చేస్తోంది. ఆగస్టు వరకు అక్కడి నుంచే పాల డబ్బాలు కొనుగోలు చేశారు. దీనికిగాను అపోలో ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 4 లక్షలు చెల్లించారు. ఈ విధంగా ఏడాది పాటు సప్లయ్ చేయాల్సిన అపోలో ఏజెన్సీ కాంట్రాక్టును అధికారులు అర్ధంతరంగా ఆపేశారు. అపోలో నుంచి పాల డబ్బాలు, మందులను తెప్పించడం మానేసి, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న ‘విజయ డెయిరీ స్టైల్’ పాలను పిల్లలపై ప్రయోగించారు. కొవ్వు, కొలెస్ట్రాల్ పాళ్లు తక్కువగా ఉన్న టెట్రా ప్యాకెట్లను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు వాడుతూ వచ్చారు. తక్కువ బరువు, రోగనిరోధక శక్తి లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఈ పాలను వాడడంతో మరింత బరువు తగ్గిపోయారు. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండడంతో అప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హుటాహుటిన హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో చిన్నారులు అక్కడ మృ త్యువాత పడ్డారు. టెట్రాపాలు వికటించాయన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికా రులు వాటిని వాడడం మానేసి, అక్టోబర్ 15 నుంచి డెక్సోలాక్ పాల డబ్బాలను వాడుతు న్నారు. అనాలోచిత నిర్ణయాలు అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే చిన్నారులు మృతిచెందారని వైద్యులు ఆరోపిస్తున్నారు. శిశుగృహ చిన్నారులకు పట్టించే పాల విషయంలో ఐసీడీఎస్ అధికారులు వైద్యుల సలహాలు, సూచనలు పాటించలేదని స్పష్టమవుతోంది. కొన్నేళ్లుగా చిన్నారులకు లాక్టోజెన్, జీరోలాక్ పాల డబ్బాలనే వాడుతున్నప్పుడు అధికారులు ఉన్న పళంగా టెట్రాప్యాక్ పాలను ఎందుకు వినియోగించాల్సి వచ్చిందనే దానిపైన నోరు మెదపడం లేదు. నాసిరకమైన పాలను వాడుతున్నారని వైద్య పరీక్షల్లో తేలినా అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఏ రకమైన పాల డబ్బాలను వాడాలనే దానిపైన వైద్యులను సంప్రదించకుండా సొంత నిర్ణయాలనే అమలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యుల విషయంలోనూ.. శిశుగృహ చిన్నారులను పరీక్షించేందుకు తొలుత ప్రభుత్వ వైద్యుడు శ్రీకాంత్‌ను విజిటింగ్ డాక్టర్‌గా తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఆయన్ని కాదని మరో ప్రభుత్వ వైద్యుడు ప్రభాకర్‌రెడ్డిని తీసుకున్నారు. ఆగస్టు వరకు ప్రభాకర్‌రెడ్డి విజిటింగ్ డాక్టర్‌గా పనిచేశారు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి ప్రభాకర్‌రెడ్డిని కూడా కాదని, ప్రైవేట్ వైద్యుడు సుధాకర్‌ను ఆశ్రయించారు. ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ 31 వరకు పిల్లలకు ఆయనే వైద్యపరీక్షలు చేశారు. ఈ సమయంలోనే పిల్లలు రోగాల బారినపడ్డట్టు సమాచారం. ఈయన సూచనల మేరకు చాలా మంది పిల్లలను నీలోఫర్‌కు తరలించారు. పిల్లలు మరణించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు సుధాకర్‌ను కాదని మళ్లీ ప్రభాకర్‌రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 1 నుంచి ఆయనే పిల్లలకు వైద్య చిక్సితలు అందిస్తున్నారు. నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ‘నల్లగొండ’ వైద్యులు నల్లగొండ : హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశుగృహ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ పిల్లల వైద్యుడు దామెర యాదయ్య, ఐసీడీఎస్ పీడీ పుష్పలతను పంపినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. చిన్నారులు అనారోగ్యంగా ఉన్నందున వారిని నీలోఫర్‌కు తరలించడం జరిగిందని చెప్పారు. నీలోఫర్ వైద్యులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. నామమాత్రంగా విచారణ శిశుగృహలో చిన్నారుల వరుస మృతులపై ఉన్నతాధికారులు చేపట్టిన విచారణపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ వేర్వేరుగా నిర్వహించిన విచారణలో శిశుగృహ రికార్డులను మాత్రమే పరిశీలించారు తప్ప అందులో పనిచేస్తున్న సిబ్బందిని, ఆయాలను, ఇతర ఉద్యోగులను వ్యక్తిగతంగా విచారించలేదు. పిల్లలకు వైద్యం అందించిన డాక్టర్లను సంప్రదించలేదు. తక్కువ బరువుతో పిల్లలు చనిపోతున్నారన్న కారణాలనే పైకి ప్రచారం చేస్తున్నారు. టెట్రా పాల ప్రయోగం పిల్లలపైన జరిగిందా..? లేదా..? అన్నది కూడా విచారించ లేదు. పాల సరఫరా విషయంలో అధికారులు సొంతగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..? అనే కోణంలో విచారణ అధికారులు దృష్టి సారించలేదు. -
పాలు కావాలి
- 200 అంగన్వాడీలలో ఇబ్బందులు - రవాణా చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్టర్ - అమలు కాని టెట్రాప్యాక్ పథకం - గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం ఇందూరు: మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రారంభించిన ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకం అమలుకు కావాల్సిన అన్ని సరుకులు సక్రమంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నా, పాల విషయంలో మాత్రం సమస్య తలెత్తింది. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్న విజయ డెయిరీ కొన్ని ప్రాజెక్టులకు పాలు సరఫరా చేయలేకపోతోంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, తదితర ప్రాజెక్టుల పరిధిలోని సగం అంగన్వాడీలకు పాలు సరఫరా కావండలేదు. పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో సరఫరా చేయలేకపోతున్నామని డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారని సీడీపీఓలు, ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు. దూర ప్రాంతాల అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు రవాణా చార్జీల భారం ఎక్కువ కావడం కూడా ఇందుకు కారణమని తెలిసింది. ఘనంగా ప్రారంభం గత జనవరి పదిన ఈ పథకం ప్రారంభమైంది. మొదటగా అన్ని ప్రాజెక్టులకు సక్రమంగానే పాలను సరఫరా చేసిన డెయిరీ నిర్వాహకులు, కొన్ని రోజుల తరువాత నిలిపివేశారు. మూడు ప్రాజెక్టులలో దాదాపు 200 అంగన్వాడీలకు పాలు సరఫరా కావడం లేదు. సోమవారం ఏకంగా అర్బన్ ప్రాజెక్టులో ఉన్న 151 అంగన్వాడీలకు పాలు రాలేదు. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. వారు కేంద్రాలలో కేవలం భోజనం చేసి వెళుతున్నారు. పాలు ఎందుకివ్వడం లేదని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని కేంద్రలలో స్థానికంగా పాలు లభ్యమైతే కొనుక్కొచ్చి అందజేస్తున్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలంటే గర్భవతిగా ఉన్న సమ యంలో కడుపునిండా ఆహారం ఉండాలి. విటమిన్లు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు తాగితే కడుపులో ఉన్న బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వారికి కేంద్రాలలో రోజూ 200 మిల్లీలీటర్ల పాలు తప్పసరిగా అందజేస్తారు. తరువాత బాలింతలు కూడా పాలు తాగాల్సి ఉంటుంది. వారికి ఇవి బలాన్నివ్వడంతోపాటు పాలు ఎక్కువగా రావడానికి పాలు తోడ్పడుతాయి. టెట్రాప్యాక్ పాలు ఎక్కడ? మారుమూల ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు రోజూ పాలను సరఫరా చేయడం కష్టమవుతుందని భావించి, దూర ప్రాంత అంగన్వాడీలకు టెట్రాప్యాక్ల ద్వారా పాలను అందజేయాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు నిలువ ఉండే విధంగా టెట్రాప్యాక్ పాలు ఉంటాయి. అంటే, వారానికి ఒకసారి పాలను అందజేస్తారు. ఈ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.