breaking news
Swachch hyderabad
-
'ఇక చెత్త అన్నది కనిపించకూడదు'
-
ఇక చెత్త అన్నది కనిపించకూడదు: కేసీఆర్
రాష్ట్ర రాజధాని నగరం అంతా అద్దంలా మెరిసిపోవాలని, ఇక ఎక్కడా చెత్త అన్నది కనిపించకుండా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ లక్ష్యాన్ని రెండు నెలల్లోనే సాధించగలమని, ప్రజల్లో ఆ విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయం సాధించిన సందర్భంగా ఇందులో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన శుక్రవారం ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు తాను, మంత్రులు గమనించిన అంశాలను ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ లైన్ల గురించి చాలాచోట్ల ఫిర్యాదులు వచ్చాయని, పలు ప్రాంతాల్లో హైటెన్షన్ లైన్లు వంగిపోయి ఇళ్లమీదుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎంత డబ్బయినా ఇస్తామని.. నగరంలో ఇక ఇళ్లమీద నుంచి ఉన్న హైటెన్షన్ లైన్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు. ఇక మరికొన్ని చోట్ల మురుగునీటి పైపులైన్లు, మంచినీటి పైపులైన్లు కలిసి ఉన్నాయని, దానివల్ల ఇబ్బంది అవుతోందని.. ఏడాది, రెండేళ్లలో మొత్తం లైన్లన్నీ మార్చేయాలని తెలిపారు. అన్నింటికంటే పెద్ద సమస్య నాలాలని కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. నగరంలో మొత్తం 77 నాలాలున్నాయని, రెండు మాత్రం హుస్సేన్ సాగర్‌లో కలుస్తాయని, మిగిలిన 72 మూసీలో కలుస్తాయని.. వీటి నిడివి 390 కిలోమీటర్లని వివరించారు. అయితే ఇవన్నీ నూరుశాతం ఆక్రమణల్లో ఉన్నాయని ఆయన కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు, అధికారులకు చేతులెత్తి నమస్కరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలాల్లో చెత్త, చెదారం వేస్తున్నారని, విరిగిన బకెట్లు, పాడైన పరుపులు కూడా వేస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 26న హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశానని, అందులో ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తానని అన్నారు. పేదలకు గృహనిర్మాణం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్లకు గౌరవప్రదమైన పద్ధతిలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే భూములు సేకరించడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో చూడటం ద్వారా సమగ్ర గృహనిర్మాణం చేయిస్తామన్నారు. ముందు ముందు హైదరాబాద్‌లో స్లమ్ కల్చర్ అన్నది లేకుండా చూడాలని తెలిపారు. -
మూత్రం పోస్తే వారితోనే కడిగించండి
హైదరాబాద్: రోడ్డుపై ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే.. వారికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ అని చెప్పి, రెండు బకెట్ల నీరు ఇచ్చి వారితోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు సూచించారు. రోడ్డుపై ఎవరైనా చెత్త వేస్తే దానిని వారిచేతే తీయించేలా చూసినప్పుడే క్లీన్ హైదరాబాద్ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో శనివారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆనంద్‌నగర్, వెంకటరమణకాలనీ, పద్మావతినగర్‌లలో నెలకొన్న సమస్యలను స్థానికులు వివరించగా.. గవర్నర్ తన డైరీలో రాసుకున్నారు. ఆనంద్‌నగర్ కాలనీలో ఓ పురాతన ఇంట్లో, వెంకటరమణకాలనీలోని పార్కులో చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వాటిని గవర్నర్ పరిశీలించారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు -
ప్రణాళికతోనే ‘స్వచ్ఛ’త
* ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభోత్సవంలో కేసీఆర్ * స్థానిక నాయకత్వం భాగస్వామ్యం పెరగాలి * నేతలంతా ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి * ‘ప్లాన్ ద బస్తీ’ పేరుతో బస్తీ ప్రణాళికలు రూపొందించండి * దీనిని ప్రజావసరాలు తీర్చే కార్యక్రమంగా తీర్చిదిద్దాలి త్వరలోనే అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ‘స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. వాటన్నింటికి స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిగా నిలవాలి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో పౌర సదుపాయాలు తగిన స్థాయిలో లేకపోవడం బాధ కలిగిస్తోంది. - సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సరైన ప్రణాళిక, స్థానిక నాయకత్వం కలిస్తేనే సమస్యలు లేని హైదరాబాద్ నగరం సాధ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇందుకోసం స్థానిక నాయకులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్‌తో కలసి సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ప్రపంచంలోని ఎన్నో సుప్రసిద్ధ నగరాలు సైతం ఒకప్పుడు అధ్వానంగానే ఉన్నాయని.. తగిన ప్రణాళికలతో, స్థానిక నాయకత్వం కృషితో అద్భుతంగా రూపొందాయని ఆయన చెప్పారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు స్థానికంగానే నాయకత్వ లక్షణాలు పెంచాలన్నారు. స్థానిక నాయకత్వం, తగిన ప్రణాళికలు కలిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం ద్వారా దానిని నిరూపిద్దామని చెప్పారు. త్వరలోనే అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, వాటన్నింటికి స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిగా నిలవాలన్నారు. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో సదుపాయాలు తగిన విధంగా లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రజల మధ్యకు వెళ్లండి ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమానికి ప్యాట్రన్లు/మెంటార్లుగా ఉన్న వీవీఐపీలు ఆదివారం వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు గంటల పాటు ప్రజలతో గడపాలని.. స్థానిక సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల మధ్యకు వెళితే.. వారిలో ప్రేరణ వస్తుందన్నారు. ప్రజలకు సౌలభ్యంగా ఉన్న సమయంలో బస్తీల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ‘ప్లాన్ ద బస్తీ’ పేరుతో బస్తీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన గవర్నర్‌కు, నీతి ఆయోగ్ నుంచి రూ.75 కోట్లు మంజూరు చేయించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపారు. పక్కాగా కార్యక్రమాన్ని రూపొందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను, ఆయన బృందాన్ని సీఎం అభినందించారు. నిరంతర ప్రక్రియ కావాలి.. దేశంలోనే తొలిసారిగా, ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వం వెళ్లే ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ఇది 4 రోజుల్లోనే ముగియవద్దని, నిరంతర ప్రక్రియ కావాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కారులోంచి వెళ్లే వారెవరైనా రోడ్డు మీద ఓ కాగితం పడేస్తే.. ప్రజలు ఆపి దాన్ని వారితోనే తీసివేయించేలా చైతన్యం రావాలన్నారు. ఇది మన హైదరాబాద్ అనే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా సచివాలయ ఉద్యోగులు సీఎం కార్యాలయం ఉండే సమతా బ్లాక్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఊడ్చి శుభ్రం చేశారు. నినాదం కాదు.. విధానం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వచ్ఛ భారత్ ప్రధాని మోదీ నినాదం కాదని, ఒక విధానమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను చేపట్టాలని సూచించారు. జీవ వ్యర్థాల నిర్వహణపై శ్రద్ధ చూపాలని, పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఉంటేనే హైదరాబాద్ స్వచ్ఛ నగరం అవుతుందని వ్యాఖ్యానించారు. ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ లోగోను, జీహెచ్ఎంసీ రూ పొందించిన ఫేస్బుక్ పేజీని, రసమయి బాలకిషన్ రూపొందించిన పాటల సీడీలను గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.