breaking news
sunitha mahendra reddy
-
పట్టం పట్నంకే..
* రంగారెడ్డి జిల్లా పరిషత్ కూడా గులాబీదే * చైర్‌పర్సన్‌గా పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నిక * కాంగ్రెస్‌ను కాదని టీఆర్ఎస్తో టీడీపీ దోస్తీ * ‘దేశం’కు వైస్ చైర్మన్ పదవి.. చక్రం తిప్పిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘పాలమూరు ఫార్ములా’తో అధికార టీఆర్ఎస్ రంగారెడ్డి జెడ్పీనీ కైవసం చేసుకుంది. టీడీపీతో జతకట్టి జెడ్పీ పీఠంపై గులాబీ గుభాళించింది. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏడుగురు తెలుగుదేశం జెడ్పీటీసీలు మూకుమ్మడిగా.. టీఆర్ఎస్ను బలపరిచారు. అంతేకాక కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు సభ్యులు కూడా అధికారపార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి రెండోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పంచుకోవడానికి పవర్‌షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనతో కంగుతిన్నాయి. రంగారెడ్డి జెడ్పీని కైవసం చేసుకోవడానికి ఏమాత్రం బలంలేని టీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన తొమ్మిది మంది జెడ్పీటీసీలను తనవైపునకు తిప్పుకుని చైర్పర్సన్ పదవిని సునాయాసంగా కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయం వరకు.. కాంగ్రెస్-టీడీపీల కూటమి నుంచే చైర్పర్సన్ ఎన్నికవుతారనే ప్రచారం జరిగింది. పదవీ కాలం పంచుకోవడంలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నదానిపై సందిగ్ధం ఉన్నా.. టీఆర్ఎస్కు జెడ్పీ పీఠం దక్కకుండా చేయాలని రెండుపార్టీల నాయకత్వాలు భావించాయి. కానీ, మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో తనకున్న పాత పరిచయాలను అనుకూలంగా మార్చుకుని వారి ఆశలపై నీళ్లు చల్లారు. టీడీపీ జెడ్పీటీసీలు ఎవరూ చేజారిపోకుండా ఆయన ముందునుంచీ వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్తో అంతర్గతంగా జరుగుతున్న ఒప్పందం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఎనిమిది జెడ్పీలలో నల్లగొండ మినహా మిగిలిన ఏడింటిలో విజయకేతనం ఎగురవేసింది. ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, మండల పరిషత్‌ల ఎన్నికలు హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వాయిదాపడ్డాయి. రెండు మినహా అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి.. ఈ నెల 4న ఎన్నికలు వాయిదా పడిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్, హన్మకొండ మండల పరిషత్‌లలో ఎన్నిక మళ్లీ వాయిదాపడింది. కరీంనగర్ జిల్లా ముత్తారం, మహాముత్తారం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మెదక్ జిల్లా సదాశివపేట, నల్లగొండ జిల్లా మునగాల, యాదగిరిగుట్ల, భువనగిరి, ఆత్మకూరు, నిజామాబాద్‌లోని బిక్కనూరు, రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల, శంషాబాద్, కీసర, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్, వెంకటాపురం, నల్లబెల్లి, జనగామలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు, నల్లగొండ జిల్లా చివ్వెంల, గరిడేపల్లిల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయినట్లు అధికారవర్గాలు వివరించాయి. -
బరిలో 190 మంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ అంకం సోమవారం ముగియడంతో తుది బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో అభ్యర్థులు సరికొత్త వ్యూహాలతో ప్రచార రంగంలోకి దూకారు. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 334 మంది నామినేషన్లు వేయగా వీరిలో 144 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒక్కో స్థానానికి సగటున ఆరుగురు పోటీపడుతున్నారు. పార్టీ అధిష్టాన నేతల బుజ్జగింపులు, బెదిరింపుల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులు పలువురు వెనక్కితగ్గారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామన్న భరోసాతో పోటీ నుంచి తప్పుకొన్నారు. జిల్లా మొత్తం మీద ఇబ్రహీంపట్నం, మంచాల జెడ్పీటీసీ స్థానాల నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. డివిజన్ల వారీగా చూస్తే తూర్పు డివిజన్లోని 8 స్థానాల్లో 72 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల నుంచి 33 మంది అభ్యర్థులను నిలపగా తెలుగుదేశం పార్టీ 30 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థులతో ఉన్న సర్దుబాటు కారణంగా మూడు స్థానాల్లో పోటీ నుంచి తప్పుకుంది. టీఆర్ఎస్ కూడా ఒక స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. సరూర్‌నగర్ నుంచి ఆ పార్టీ పోటీలో లేదు. జెడ్పీచైర్మన్ పోటీ రసవత్తరం ప్రతిష్టాత్మక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. నవాబ్‌పేట్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున లక్ష్మారెడ్డి చైర్మన్ కుర్చీ రేసులో ఉన్నారు. ఘట్కేసర్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. ఇక చైర్మన్పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి పోటీపడుతున్న మాజీ జెడ్పీచైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి యాలాల జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థులు బరిలో ఉన్న ఈ మూడు స్థానాల్లో పోటీ రసవత్తరంగా ఉంది.