breaking news
Sun screen lotion
-
స్కాల్ప్ సమస్యలు మాడుతోంది
ఎవరికైనా సరే... తొలి కిరణం సోకేది మాడుకే. తొలుత మాడిపోయేది మాడే. భానుడి చండప్రచండానికి మొదట గురయ్యేదీ, ఎక్కువగా ప్రభావితమయ్యేది కూడా మాడే. ఎండలకు మాడే ఈ మాడు తాలూకు... మూడు ప్రధాన సమస్యలు. అవి... వెంట్రుకలు రాలడం, దురద. చుండ్రు. ఎండ వల్ల పొడిబారి దురద పెరగవచ్చు. చుండ్రు రాలడం మరింతగా జరగవచ్చు. ఇవిగాక మరికొన్ని వ్యాధుల వల్లనే వచ్చేవి కాస్తంత అరుదు... అప్రధానం. మూడు సమస్యలను ప్రత్యేకంగా ఇచ్చాం. మిగతావి గుదిగుచ్చాం. మొత్తం మీద మాడుపై ప్రత్యేక కథనమిది. తల గోక్కుంటుంటే వెంటనే చదవవచ్చు. ఊరికే తల గీరుకోకూడదని అనుకున్నా వెంటనే ఈ కథనాన్ని చదవాల్సిందే. ఎండల్లో తిరుగుతుంటే చర్మం నల్లబారుతుండటం మనకు తెలిసిందే. స్కిన్ట్యాన్ను గుర్తించిన వెంటనే మనం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడమో, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడమో చేస్తుంటాం. మరి ఎండ వల్ల మాడుపై ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది. దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలకు ఆస్కారం ఉంటుందనే విషయాలపై అవగాహన పెంచుకుందాం. ఎండలో మాడుపై పడే దుష్ప్రభావాలు! మిగతా చర్మంతో పోలిస్తే మన మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. అలా నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అనీ... ఆ నూనెను సీబమ్ అని అంటారు. ఈ సీబమ్ సాధారణ వాతావరణంలో స్రవించే మోతాదుకంటే ఎండకాలం ఎక్కువగా స్రవిస్తుంటుంది. పైగా పది రెట్లు ఎక్కువగా. అందుకే ఈ సీజన్లో జుట్టు త్వరగా జిడ్డుగా మారడం, అణిగినట్లుగా కనిపించడం జరుగుతుంది. పైగా జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.అందరి చర్మంపైనా మలసేజియా అనే ఫంగస్ నివసిస్తూ ఉంటుంది. దానికి మన చర్మం పైన స్రవించే ఈ ‘సీబమ్’ ఆహారం. ఇక ఎండలో తిరిగేవారిలో సీబమ్ పెరగడం వల్ల ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది చుండ్రుకు కారణమవుతుంది. అదే ఫంగస్ పెరుగుదల విపరీతంగా, అత్యంత ఎక్కువగా జరిగితే... అది సెబోరిక్ డర్మటైటిస్ అనే చర్మవ్యాధికి దారి తీస్తుంది. ఎండ కారణంగా... చెమట వల్ల... ఎండలో మాడుపై సీబమ్ పెరగడంతోపాటు కొందరిలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇది జుట్టు దట్టంగా ఉండేవారికి నరకమే. ఇలాంటి స్థితిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. వీటివల్ల హెయిర్ ఫాలికిల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా అనిపించే కురుపులు) వస్తుంటాయి. వాటి వల్ల నొప్పి, దురద ఎక్కువగా ఉండవచ్చు. నేరుగా పడే ఎండ వల్ల! నేరుగా మాడుపై ఎండ పడుతూ ఉండటం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వెంట్రుకలపై ఎండ నేరుగా పడితే ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్ డ్యామేజ్) దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యను ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లువియమ్’ అని కూడా అంటారు. వీటితో పాటు తీవ్రమైన ఎండల వల్ల కొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి వస్తుంటాయి. ఎండలో హెల్మెట్‌తో సమస్యా? హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు మరింతగా రాలుతుందనే అపోహ ఉంది. కానీ హెల్మెట్ జుట్టును, మాడును ఎండ నుంచి కాపాడుతుంది. కాలుష్యం నుంచీ రక్షిస్తుంది. జుట్టును రాలకుండా ఆపుతుంది. అయితే పరిశుభ్రమైన గుడ్డను తల మీద కప్పుకుంటే మంచిది. అలా చేయడం వల్ల చెమటతో తడిసి, అపరిశుభ్రంగా ఉన్న హెల్మెట్‌ను ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులను నివారించవచ్చు. స్కాల్ప్ అంటే ఏమిటి...? మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అంటుంటాం. ముక్కు, చెవి, నుదురులాగ స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాలూ ఇలా ఉంటాయి. ఎస్ అంటే స్కిన్, సీ అంటే కనెక్టివ్ టిష్యూ, ఏ అంటే ఎపోన్యూరోటికా, ఎల్ అంటే లూజ్ ఏరియోలా, పీ అంటే పెరియాస్టియమ్ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలై నుంచి పి అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉండే పొరలకు ఉన్న పేర్ల తాలూకు ఇంగ్లిష్ అక్షరాలతో స్కాల్ప్ అనే పదాన్ని రూపొందించారు. మాడు సమస్యల నివారణ కోసం... పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుతో పాటు పలు మాడు సమస్యలకు కారణమయ్యే అంశాలను నివారిస్తాయి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల మాడు మీద చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. మాడుపై చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. డాక్టర్‌ను సంప్రదించాల్సినదెప్పుడు... మాడుకు సమస్య వచ్చినట్లు గ్రహించిన తర్వాత, డాక్టర్‌ను తప్పక సంప్రదించాల్సిన అవసరం ఈ కింది సందర్భాల్లో ఉంటుంది. ∙మాడు మీద విపరీతంగా దురద పెడుతున్నప్పుడు ∙ఎండలో ఉన్నప్పుడు దురద మరింతగా పెరుగుతుంటే ∙చీముతో కూడిన కురుపులు కనిపించినప్పుడు ∙మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్ పెచ్చులు వచ్చినప్పుడు ∙ఎండలో తిరిగినప్పుడల్లా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే... తప్పనిసరిగా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాలి. అపోహ... వాస్తవం ⇒ఎండల్లో హెల్మెట్ కారణంగా మరింత జిడ్డు పెరగడం, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ హెల్మెట్ ఈ సీజన్లో నేరుగా ఎండ వెంట్రుకలపై పడటం వల్ల కలిగే దుష్ప్రభావాలనుంచి కాపాడుతుంది. కాకపోతే లూజ్‌గా ఉండే పరిశుభ్రమైన గుడ్డను చుట్టుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం మేలు. ⇒మంచి షాంపూ వాడిన తర్వాత కాసేపు ఎండలో వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తాయని అనుకుంటాం. కానీ నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వాటిని డల్‌గా చేస్తుంటుంది. అందుకే నేరుగా ఎండలోకి వెళ్లేవారు వెంట్రుకలకు రక్షణగా క్యాప్ ధరించడం మేలు. అది కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరింత మంచిది. ఎండ వేళల్లో... దువ్వుకోవాల్సిందిలా... ⇒రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే బాగా దువ్వుకోవడం, మంచి దువ్వెన ఉపయోగించడం మేలు. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. అది మాడుకు మేలు చేస్తుంది. ⇒ఎండల్లో సాధారణంగా పెరుగుతూ మాడును మాడ్చేసే పై సమస్యలను తెలుసుకుంటే, దానికి బదులు సమస్యనే మాడ్చవచ్చు. చికిత్సతో మాన్పవచ్చు. అంతేకాదు... పైన పేర్కొన్న జాగ్రత్తలు కేవలం మాడుకే గాక మిగతా చర్మానికే మేలు చేస్తాయి. ఎండలో మాడు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒మాడుపై సీబమ్ ఎక్కువగా రావడం వల్ల జుట్టు డల్‌గా, జిడ్డుగా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయాలి. ⇒మన స్కాల్ప్ తాలూకు పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే మాడుకు మంచిది. ⇒చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ ఉన్నవారు తప్పనిసరిగా చర్మవ్యాధి నిపుణులను కలిసి వారు సూచించే మందులను తీసుకోవాలి. జాగ్రత్తలను తప్పక పాటించాలి. ⇒జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు... ఆయిలీగా ఉండే కండిషనర్స్‌ను వాడకూడదు. ⇒జిడ్డు చర్మం, జిడ్డు ఎక్కువగా ఉండే మాడు కలిగిన వారు తలకు నూనె పెట్టడం కూడా అంత మంచిది కాదు. ⇒నేరుగా ఎండలోకి వెళ్లేవారు, మోటార్ బైక్‌పై వెళ్లేవారు ఏదైనా వదులుగా ఉండే కాటన్ తల గుడ్డతో తలను కవర్ చేసుకొని ఆ పైనే హెల్మెట్ ధరించాలి. ⇒ ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అందరికీ మేలు. డాక్టర్ సింధూర కంభంపాటి కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,హైటెక్ సిటీ, హైదరాబాద్ -
‘అస్తమా’నం ఏసీ వద్దు
- అతి చల్లదనం ప్రమాదకరం - రోగాల బారినపడే ప్రమాదం - కాస్త చల్లగా ఉంటే చాలు - జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఒకప్పుడు ఎయిర్ కండీషనర్ అంటే విలాసం. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఆహ్లాదం. ఇప్పుడు అది ఓ అవసరం. ఇల్లు.. ఆఫీసులు, షాపింగ్‌మాల్స్, ప్రయాణించే బస్సులు, ఏటీఎం సెంటర్లు.. ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా అదే. సంపన్నులతో పాటు ఇప్పుడు సగటు మధ్య తరగతి జీవి, దిగువ తరగతి వారిని ఏసీ ‘చల్లగా’ చేరుకుంటోంది. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో... ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని పేర్కొంటున్నారు. ఆధునిక పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా మారుస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది. వాతావరణ మార్పుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి మనిషి విభిన్న రకాల ఉత్పత్తులను సృష్టించుకుంటూ.. ప్రకృతిని ఢీకొడుతున్నాడు. అదే కోవలోనే ఆవిర్భవించిన ఎయిర్ కండీషనర్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. విపరీతమైన శారీరక, మానసిక శ్రమ మనల్ని నిస్సత్తువకు గురిచేయకుండా ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం నివారిస్తుంది. చెమట పోయడం వంటి చికాకులకు చెక్ పెడుతుంది. అదే సమయంలో దీని వల్ల న ష్టాలు లేకపోలేదు. ఇవీ సమస్యలు... - ఏసీపై పేరుకుపోయే దుమ్ము ధూళి కారణంగా ఫంగస్ వ్యాపించి ఎలర్జీలు రావచ్చు. - కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం ఉంది. - అధిక సమయం ఏసీలో ఉండడం వల్ల ఆకస్మిక జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, శ్యాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. - చర్మంపై దుష్ర్పభావం చూపించవచ్చు. ఇవీ జాగ్రత్తలు - ఏసీ అమరిక నిర్వహణ సరైన విధంగా ఉండాలి - ఇంట్లోని ఏసీని మరే సీజన్లోనూ వాడకుండా వేసవిలో మాత్రమే వినియోగించ డం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారు వినియోగానికి ముందు ఒకసారి టెక్నీషియన్‌కు చూపించడం మంచిది. - గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. గాలిలో సగటు తేమ శాతం 60 నుంచి 70 శాతానికి మధ్య ఉండాలి - వాతావరణంలో అకస్మాత్తుగా ఏర్పడే హెచ్చుతగ్గులు దేహంపై దుష్ర్పబావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఒక అన్‌క్రషబుల్ జాకెట్‌ను దగ్గర ఉంచుకోవాలి. తీవ్రమైన ఎండ నుంచి అత్యంత చల్లని ఎయిర్ కండీషన్డ్ రూంలోకి వెళ్లే ముందు ఇది ధరిస్తే.. అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. - టెంపరేచర్ 20 నుంచి 40 డిగ్రీలకు మారిన సమయంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వినియోగించడం మంచిది. - ఎక్కువగా ఏసీలో ఉండే వారు దాహం వేయడం లేదని అనుకోకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీరు తీసుకుంటూ ఉండాలి. అతిగా వాడితే అనర్థమే... వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ..దానిని అతిగా ఉపోయగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు..దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేరుంచాలి. లేదంటే దానిలో ఫంగస్ పేరుకుపోరు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. బ్రాండెడ్ కాకుండా వాడితే అనేక దుష్పరిణామాలు. కొన్ని ఏసీలు వాతావరణంలోని మలినాలను వేరుచేసి స్వచ్ఛమైన గాలి అందించే విధంగా మార్కెట్లోకి వచ్చారు. అలాంటివే మేలు. శ్వాసకోస వాధులు ఉన్నవారైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవారైనా...చిన్న పిల్లలైనా జాగ్రత్తలు తప్పనిసరి. ఏసీ ఆటో ఆఫ్‌లో ఉండి గది ఉష్ణోగ్రతను సమాన స్థారులో ఉంచేదిగా ఉండాలి. ఈ విధానం చాలా మంచిది. -డాక్టర్ విజయేందర్‌రెడ్డి, కరీంనగర్