సత్య నాదెళ్లకు రూ. 520 కోట్ల ప్యాకేజీ
శాన్ఫ్రాన్సిస్కో: సీఈవో సత్య నాదెళ్లకు 8.4 కోట్ల డాలర్ల ప్యాకేజీ(సుమారు రూ. 520 కోట్లు) ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వాటాదారులు అనుమతించారు. అయితే సత్యకు అతిగా చెల్లిస్తున్నారంటూ పెట్టుబడిదారుల సలహా గ్రూప్ ఒకటి వ్యాఖ్యానించిన నేపథ్యంలో 72% మంది వాటాదారులు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. సాధారణంగా సీఈవోలకు ప్యాకేజీ విషయంలో సగటున 91.5% వోటింగ్ మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా ఐఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ అనలిటిక్స్ సంస్థ పేర్కొంది.
కాగా, ఈ ప్యాకేజీ ద్వారా గడిచిన ఏడాదికి అమెరికా సీఈవోలలో అత్యధిక ప్యాకేజీ పొందుతున్న వ్యక్తిగా సత్య నిలవడం విశేషం. అయితే తొలి ఏడాదికి గరిష్టస్థాయిలో వేతనం(ప్యాకేజీ) పొందిన వ్యక్తులలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ తొలిస్థానంలో ఉన్నారు. 2011లో సీఈవో అయిన కుక్కు 37.8 కోట్ల డాలర్ల ప్యాకేజీ లభించింది. ఈ బాటలో గతేడాది ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్ స్టాక్ ఆప్షన్లతో కలిపి 67.3 కోట్ల డాలర్లు అందుకున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ 2013లో కేవలం 1.3 మిలియన్ డాలర్ల ప్యాకేజీ పొందినప్పటికీ, 16 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉన్న సంగతి ప్రస్తావనార్హం.