breaking news
Srilaksmi
-
స్త్రీలక్ష్మి
కడుపు నిండా కష్టాల కాయలే.. అందుకే పండలేదు! అక్కాచెల్లెళ్ల బాధ్యతలు... తమ్ముళ్ల జీవితాలు నిలబెట్టాలనుకోవడంతోనే... సగం జీవితం జారిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే... పాత్రల్ని పోషించాల్సి వచ్చింది! శ్రీలక్ష్మి జీవితంలోని కష్టం తెలుసుకుంటే... కడుపుబ్బా నవ్వించే ఆమెలో కడలిని మించిన స్త్రీలక్ష్మి ఉందనిపించింది. నవ్వు వెనక ఇంత తడి ఉంటుందని మీరూ తెలుసుకోండి... తెలుగు చిత్రసీమలో సూర్యకాంతం, ఛాయదేవి తర్వాతి తరంలో రమాప్రభ, ఆ తర్వాత శ్రీలక్ష్మి... మీ తర్వాత ఆ స్థాయిలో ఏలిన తెలుగు లేడీ కమెడియన్లు కనిపించరేం? శ్రీలక్ష్మి: రమాప్రభగారి తర్వాత నేనంటే హ్యాపీగా ఉంది. నేనూ, ఆవిడా కలసి చాలా సినిమాల్లో నటించాం. ఓసారి రమాప్రభగారు ‘నా తర్వాత నువ్వేనే’ అన్నారు. అప్పట్లో నాకు మంచి క్యారెక్టర్లు దక్కాయి. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాను. అది నా అదృష్టం. మా తర్వాత లేడీ కమెడియన్లు అంతగా ఎందుకు ఏలలేకపోయారంటే... ఇప్పుడంతా టీ డికాషన్ టైపు. ఫస్ట్ టైమ్ టీ పెట్టినప్పుడు డికాషన్ చిక్కగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఫిల్టర్ చేస్తే చిక్కదనం తగ్గుతుంది. ఇండస్ట్రీలో ఎక్కువమంది ఆర్టిస్టులు వచ్చే కొద్దీ, చిక్కదనం తగ్గింది. మనం ఏమీ చేయలేం. ఈ తరంలో లేడీ కమెడియన్లు ఎవరున్నారో కూడా నాకు తెలీదు. కోవై సరళగారు వచ్చారు. కానీ, ఆవిడ తమిళ ఆర్టిస్టు కాబట్టి తెలుగు ఆర్టిస్టుగా చూడకూడదు. జంధ్యాలగారి సినిమాల్లో మీరు అద్భుతం. మీ కాంబినేషన్ గురించి ఏం చెబుతారు? మా కాంబినేషన్ గురించి నేను కలలో కూడా ఊహించలేదు. పది సినిమాల్లో హీరోయిన్గా నటించాను. ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. ‘రెండు జళ్ల సీత’లో మా తమ్ముడు రాజేశ్ ఓ హీరో. అందులో ఓ కామెడీ క్యారెక్టర్ ఇస్తే, సరేనని చేశా. దాన్ని ప్రేక్షకులందరూ రిసీవ్ చేసుకున్నారు. క్యారెక్టర్ పెద్ద హిట్టు. దాంతో వరుసగా కామెడీ క్యారెక్టర్లు వచ్చాయి. అప్పుడు జంధ్యాలగారి సినిమాలే ఓ ఐదారు చేశాను. విశ్వనాథ్‌గారు, రాఘవేంద్రరావుగారు, దాసరిగారు, కోదండరామిరెడ్డిగారు, ఈవీవీగారు, రేలంగి నరసింహారావుగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు.. ఇలా అగ్ర దర్శకులందరి సినిమాలూ చేయడంతో నాకు పెద్ద పేరొచ్చింది. అయితే చేతి నిండా సంపాదన అన్న మాట. ‘బ్లాక్ మనీ’ ఉంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పవు..! (నవ్వుతూ..) ఎంత బిజీగా ఉన్నా మోదీ పరిపాలనలా ఉండేది. ఐదు, పది వేలకు మించి పారితోషికం ఇచ్చేవాళ్లు కాదు. దాంతో నో బ్లాక్, ఓన్లీ వైట్. ఇప్పుడు మోదీ గారు పెద్ద నోటు రద్దు చేసి, నాకు మా పాత రోజులను గుర్తు చేశారు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో దేవదాస్ కనకాల గారి దర్శకత్వంలోని ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’, తమిళంలో ‘స్పరిశం’, ‘జో డిపురా’, మలయాళంలో ఓ మూడు సినిమాల్లోనూ హీరోయిన్గా చేశా. కానీ, అవేవీ పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ‘నేను హీరోయిన్’ అని మీరు ఫిక్స్ అయినా, ప్రేక్షకులు మాత్రం ‘కమెడియన్’ అని ఫిక్స్ చేశారు. అప్పుడెలా ఫీలయ్యారు? కమెడియన్‌గా ఫిక్స్ చేశారు కాబట్టే ఆ హీరోయిన్ మీ ముందు కూర్చొని మాట్లాడుతోంది. కామెడీ క్వీన్‌గా ఏలుతున్న టైమ్‌లో ‘అయ్యో.. హీరోయిన్ ఫీచర్స్ అన్నీ ఉండి, మీరు హీరోయిన్ అవ్వలేదు’ అని ఎవరైనా అన్నా పట్టించుకునేదాన్ని కాదు. ఒకవేళ వాళ్లు మనస్ఫూర్తిగా ఆ మాట అన్నా, ‘హీరోయిన్గా నన్నెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో మాట్లాడి నేను ఫీలయ్యేలా చేసి, నాకు ఏవేవో గుర్తు చేసి ఉన్నది చెడగొట్టడానికి మాట్లాడుతున్నారు’ అని మనసులో అనుకునేదాన్ని. నేను ఫీలైంది ఏంటంటే... 30 ఏళ్లకు పైగా అందర్నీ నవ్విస్తూ, నేనూ నవ్వుతున్నాను. హీరోయిన్గా చేసి ఉంటే తాత్కాలిక ఆనందం, అదృష్టం దక్కి ఉండేవేమో. ఐదేళ్లు లేదా పదేళ్లలో కనుమరుగయ్యేదాన్ని. ఇప్పటివరకూ ఉండేదాన్ని కాదు. ఆడియన్స్ నన్ను కమెడియన్‌గా ఆదరించడం నాకు ప్లస్ అయింది. సుత్తివేలు, సుత్తి వీరభద్ర రావుతో మీ కాంబినేషన్ బాగుంటుంది. ఆ కాంబి నేషన్ పోయాక అవకాశాలు తగ్గాయా? ఏం తగ్గలేదు. సుత్తివేలు, వీరభద్రరావు, నేను - అదో టైమ్. తర్వాత నూతన ప్రసాద్, బాబూ మోహన్, బ్రహ్మానందం, నేను - అదో టైమ్. ఏ కాంబినేషన్ క్రేజ్ దానిదే. రెండు తరాల కమెడియన్లతో నటించా. మూడు పదుల కెరీర్ తర్వాత ఇప్పుడూ బిజీగా ఉండాలనుకుంటున్నారా? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. రెండోసారి, మూడోసారి వచ్చినా అంతకు ముందు ఉన్నంత అదృష్టం రాదు. మళ్లీ అంతే బిజీ కావడం అనేది జరగదు. ఆ టైమ్‌లో శ్రీలక్ష్మి బెస్ట్ కమెడియన్‌గా అందరి మనసుల్లో చోటు దక్కించుకుందనేది పెద్ద విషయం. నేను చచ్చేంత వరకూ ఆ పేరు ఉంటుంది. కోట్లు కోట్లు కూడగట్టుకోలేకపోయినా అభిమానుల నుంచి బోల్డంత ప్రేమ దక్కించుకున్నాను. అది చాలు. మీ నాన్నగారు అమరనాథ్ ఆర్టిస్టు కదా! (మధ్యలోనే అందుకుంటూ...) ఆయన హీరో. సుమారు ఓ వంద సినిమాలు చేశారు. ‘అమర సందేశం’, ‘దక్షయజ్ఞం’, ‘వదినగారి గాజులు’, ‘చెరపకురా చెడేవు’ వంటి మంచి మంచి సినిమాలు చేశారు. మీ నాన్నగారు పోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు సినిమాల్లోకి వచ్చారట. వంద సినిమాల హీరో కూతురికి కష్టాలా? నాన్నగారు బాగా సంపాదించారు. మేం ఎండలో వెళితే కందిపోతామని ఆయన టెన్షన్ పడేవారు. చాలా బాగా పెంచారు. నిర్మాతగా ‘మగవారి మాయలు’, ‘అమరజ్యోతి’ వంటివి తీసి నష్టపోయారు. మేం పెరిగే టైమ్‌కి (1965లో) ఆయన రిటైర య్యారు. 1980 ఫిబ్రవరిలో మరణించారు. నేను మార్చిలో పరిశ్రమకు వచ్చాను. నాన్నగారు చనిపోయిన ఓ నెలలో ముఖానికి మేకప్ వేసుకోవలసిన పరిస్థితి. అప్పుడు చిత్ర పరిశ్రమపై ఆసక్తీ, ఇటు రావాలనే ధ్యాస కూడా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను. ఒకవేళ చిత్రసీమకు రాకపోయుంటే ఏం చేసేవారు?z చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, హౌస్‌వైఫ్‌గా ఉండేదాన్ని. మరి... ఆ ఫ్యామిలీ లైఫ్ మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉందా? ఉందనుకోండి. ఫ్యామిలీ లైఫ్ లేకుండా లేదు, అదీ ఉంది. కానీ, సినీ ఫీల్డ్‌లోని మహిళల ఫ్యామిలీ లైఫ్ వేరు. భర్త ఉద్యోగం చేస్తుంటే, కేవలం హౌస్ వైఫ్‌గా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం... ఆ లైఫ్ వేరు కదా! నాన్నగారు పోయిన తర్వాత, ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుని నా దారిన నేను వెళ్లాలనుకోలేదు. ఆయన బాధ్యతలను భుజాన వేసుకున్నాను. ఒకవేళ నా స్వార్థం చూసుకుంటే... ఈ రోజు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెటిల్ అయ్యేవారు కాదు. వాళ్లందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్లను చూసి నేను హ్యాపీ. మీరెంత మంది? మా అమ్మగారికి చాలామంది సంతానం. అందులో ఎనిమిది మంది మాత్రమే బతికాం. నాన్నగారు పోయే నాటికి అందరం చిన్న పిల్లలమే. అక్క తర్వాత నేను. ఆ తర్వాత తమ్ముళ్లూ, చెల్లెళ్లు. అందరూ పెళ్లి చేసుకుని ఓ స్టేజికి వచ్చేవరకూ నా బాధ్యతలు నెరవేర్చా. ఓ అక్కగా మీరు నిలబడ్డారని మీ తోడబుట్టినవాళ్లకు అభిమానం ఉంటుందా? ఉండనవసరం లేదు. ఆ ప్రేమాభిమానాలు ఆవగింజంత ఉన్నా ఫరవాలేదు. నేను ఏం అనుకుంటున్నానంటే... నేను డ్యూటీ కింద చేశా. నా డ్యూటీ పూర్తైది. ఎవరో ఏదో చేస్తారనో, అభిమానంగా చూస్తారనో, అభినందిస్తారనో చేయలేదు. నాన్నగారు మరణించడంతో భగవంతుడు నాకో డ్యూటీ వేశాడనుకున్నాను. అది నిర్వర్తించాను. ఇప్పుడు ఎవరి జీవితాలను వాళ్లు చూసుకుంటున్నారు. నాకు బాధ్యతలు ఏమీ లేవు. ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మీరు చేసినప్పుడు, అవతలి వ్యక్తులు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని కోరుకోవడం తప్పు కాదేమో? ప్రేమగా చూసుకోమని నేను చెప్పకూడదు కదా! నాకు మాత్రం మావాళ్లంటే చాలా ప్రేమ. ఒకవేళ వాళ్లు ఛీ అన్నా... ఛా అన్నా.. నాకు ప్రేమ ఉంటుంది. వాళ్లకు ఉండాలనే రూల్ లేదు. ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్లది. ఎవరికీ టైమ్ లేదు. ‘నేను నీకు చేశాను కాబట్టి.. ఈరోజు నువ్వు నాకు చేయాలి’ అని రూల్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెళ్లవుతున్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎవరూ అడగలేదా? అడిగారు. పెళ్లి సంబంధాలు చాలానే వచ్చాయి. నా ఫ్యామిలీ ముఖ్యమనుకుని వాటిని తిరస్కరించాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ పెళ్లి చేసుకోమనలేదా? వాళ్లు ఎలా అంటారండీ! వాళ్లకూ అనే వయసు లేదు. ‘నువ్వు ఏం అనుకుంటే అది చెయ్’ అని మా అమ్మగారు అన్నారు. ఆ టైమ్‌లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, నటిగా కంటిన్యూ అయిపోవాలనుకున్నా. ఇప్పుడైతే.. సినీ ఫీల్డ్‌లోకి ప్యాషన్‌తో వస్తున్నారు. వచ్చీ రావడంతోనే సంపాదించుకుంటున్నారు. బాగా సెటిల్ అవుతున్నారు. పాత తరం ఆర్టిస్టుల్లో నా లాంటి చాలామంది రంగు వేసుకున్నది మా కుటుంబాల కోసమే. అలాంటి పరిస్థితి వచ్చినందుకు మేం ఫీలయ్యేవాళ్లం కాదు. మీ ఫ్యామిలీ బాధ్యతలన్నీ నెరవేర్చి ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఎంత టైమ్ పట్టింది? నేను ఫీల్డ్‌లోకి వచ్చి 35 ఏళ్లు అవుతోంది. నా వరకూ నేను చేసుకోవడం, నన్ను నేను పట్టించుకోవడం గత పదీ పదిహేనేళ్లుగానే. ఇప్పుడు కాస్త ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. కెరీర్ స్టార్టింగ్‌లో మా వాళ్ల ఫ్యామిలీలు సెటిల్ కావాలని కష్టపడ్డా. లైఫ్‌లో మంచి వయసులో సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి.. బాధ్యతలను ఈదారన్న మాట! అవునండీ. ఉదయం షూటింగ్‌కి వెళితే.. రాత్రి వచ్చి ఎలా నిద్రపోయేదాన్నో కూడా తెలిసేది కాదు. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు షూటింగ్ ఉంటుందా? అని ఎదురు చూసేదాన్ని. అక్కడికెళితే ఓ రిలాక్సేషన్. ఇంటికొస్తే ఏడుపొక్కటే తక్కువ. అలాగని కంటిన్యూస్‌గా పని చేసినా ఒత్తిడి అనిపించేది. ఎవరైనా రోగం రాకూడదని కోరుకుంటారు. నాకు ఏదైనా చిన్న రోగం వస్తే బాగుంటుందని బాగా బిజీగా పని చేసేటప్పుడు అనుకునేదాన్ని. మళ్లీ పెద్ద సమస్యలు రాకూడదనుకునేదాన్ని. అసలు షూటింగ్‌కే వెళ్లలేకపోతే ఇబ్బంది కదా. ఓ నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే రెస్ట్ దొరుకుతుంది. ఆ మాత్రం చిన్న రోగం చాలనుకునేదాన్ని. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా? నాకెందుకు ఇన్ని కష్టాలు, బాధ్యతలు అనుకున్నారా? (నవ్వుతూ...) ఎప్పుడూ దేవుణ్ణి తిడుతూనే ఉంటా! ఆయనతో నా సంభాషణ జరుగుతుంటుంది. నేను సాయిబాబాను నమ్ముతా. ఎవరూ నాకు తోడు లేరు. ఆయనే తోడు. ముందు రాఘవేంద్రస్వామిని నమ్మేదాన్ని. ఆయనను పూజించాలంటే చాలా నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు ఓపిక నశించేసరికి, ఆయనను మెయిన్టైన్ చేయడం కష్టమైంది (నవ్వు). అందుకే గోడ మీద నుంచి ఆయనను దింపి, బాబాను ఎక్కించా. మీ లైఫ్ తెలుసుకున్నాక ‘ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్గా రిజక్ట్ అయినా, రియల్ లైఫ్‌లో మీరు హీరోయినే’ అనిపిస్తోంది.. (గట్టిగా నవ్వుతూ...) థ్యాంక్స్ అండీ. కష్టమైనా.. సుఖమైనా.. దేన్నైనా దేవుడి ఇచ్చిన బహుమతిగా తీసుకోవాలి. మనం తీసుకునేదాన్ని బట్టి మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఆధారపడి ఉంటాయి. కష్టాన్నీ, ప్రతిఫలాన్నీ రెండిటినీ దేవుడు ఇస్తాడు. మనం కష్టాన్నే చెప్పుకోకూడదు. కష్టపడ్డాను కాబట్టే ప్రేక్షకుల అభిమానం, ఇంత పేరు సంపాదించుకున్నాను. జస్ట్ హౌస్‌వైఫ్‌గా ఉండి ఉంటే నేనెవరో ఎవరికీ తెలిసేది కాదు. మైనస్ ఉన్నా ప్లస్సూ ఉంది. జీవితంలో ఒకటి సాధించామనే క్రెడిట్ ఆటోమేటిక్‌గా బలం ఇస్తుంది. ఇంతమందిని నవ్వించారు. మీ లైఫ్‌లో బాగా బాధపడిన ఒక సందర్భం? చాలా సందర్భాలున్నాయి. నాన్నగారు మరణించడం అనేది పెద్ద బాధ. పిల్లలకు కష్టమనేది తెలీకుండా పెంచారు. ఆయనో పెద్ద మర్రిచెట్టు. ఆ నీడలో మేము హ్యాపీగా బతికేవాళ్లం. దేవుడు ఆ చెట్టును ఏనాడూ కూల్చడనే ధైర్యం. ఆ చెట్టు కూలిపోయిన టైమ్‌లో జీవితం అంటే ఏంటో ఏమీ తెలీదు. ఆయన లేకపోయే సరికి ప్రపంచ జ్ఞానం వచ్చింది. ఆయన ఇంత కష్టపడి మమ్మల్ని బతికించాడా? అని అప్పుడు తెలిసింది. మేం డిగ్రీలు చదవలేదు, మాకు ఉద్యోగాలు రావు. నాన్నగారి శవం ముందుంది. మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది తెలీదు. ఆ సమయంలో చాలా బాధపడ్డా. ఆ టైమ్‌లో బంధువులు హ్యాండ్ ఇచ్చేశారా? అది సహజం కదా. ఇప్పుడు మాత్రం ఎవరెవరో బీరకాయ పీచు సంబంధాలతో ఫోనులు చేస్తారు. ‘నేను మీ నాన్నగారి వైపు బంధువునమ్మా’ అంటారు. మొన్న ఓ ఫోన్ వచ్చింది. ఏదో రిలేషన్ అని చెప్పారు. ‘మాకెవరూ లేరమ్మా. మేం కష్టపడినప్పుడు ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరూ నాకు లేరు. మళ్లీ ఫోన్ చేయకు’ అని పెట్టేశా. ఫైనల్లీ... వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని నిలబెట్టుకుని హ్యాపీగా ఉండాలి. అవకాశాలు రాకపోతే ఆడియన్స్, ఇండస్ట్రీ మరచిపోయారేమో అనే బాధ ఉంటుంది. ‘కెరీర్ అయిపోయింది’ అని నిరుత్సాహంతో జీవితం వెళ్లబుచ్చకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. అందుకే ఎప్పుడు పిలిచినా రావడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. లోపల ఎన్ని భూకంపాలు ఉన్నా ఏమీ లేనట్లే కనిపించాలి. ఎవర్‌గ్రీన్‌గా ఉండాలి. ఇన్నేళ్ల కెరీర్లో నేను తెలుసుకున్నది ఇదే. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా?.. ఎరేంజ్డా.. మీ భర్త గురించి? లవ్ మ్యారేజే చేసుకున్నాను. నేనెక్కువగా పర్సనల్ విషయాలు మాట్లాడనండి. అలా కాదు మేడమ్.. ఆయన ఆరడుగుల అందగాడా? మీ రంగుకి దీటైనవాడా? కొన్ని విషయాలు షేర్ చేసుకోండి? ఆరడుగుల హీరో అని అనను. ఒంటి రంగుకి నేను ప్రాధాన్యం ఇవ్వను. మనసు రంగు మంచిది. చాలా మంచి ఆయన. బిజినెస్ చేస్తుంటారు. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయనే ఆశతోనే సినిమాలు చేయాలనుకుంటున్నా. భగవంతుడు ఇచ్చిన ఇల్లు ఉంది. ఉండటానికి, తినడానికి లోటు లేదు. కష్టాల్లో ఉండి యాక్ట్ చేయాలనుకోవడంలేదు. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేశాను. ఇప్పుడు ఖాళీగా ఉండటం అంటే కష్టమే. హైదరాబాద్‌లో ఉంటే ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నట్లు ఉంటుందని మా ఆయనతో అంటే... వెళ్లమన్నారు. కష్టంగా అనిపిస్తే మాత్రం వద్దన్నారు. బాగా మెరిసిపోతున్నారు. ఏం తింటారేంటి? కమెడియన్స్‌కి ఓ అడ్వాంటేజ్ ఏంటంటే.. హీరోయిన్స్‌లా ఫిజిక్ మెయిన్టైన్ చేయాల్సిన అవసరం లేదు కదా! మెరుపుకి కారణం ఏమీ లేదండి. మేకప్ కూడా వేసుకోలేదు. ‘ఆనంద భైరవి’, ‘రెండు జళ్ల సీత’ టైమ్‌లో కూడా మేకప్ వేసుకునేదాన్ని కాదు. కాకపోతే ఆ రోజుల్లో తిండి తినేదాన్ని కాదు. దాదాపు పదేళ్లు సరిగ్గా తినలేదు. మా ఇంట్లోవాళ్లు చక్కగా బిర్యానీ తింటుంటే, నేను గోధుమ గంజి తాగేదాన్ని. ఓ యాపిల్ పండుతో సరిపెట్టుకునేదాన్ని. ఎంత కమెడియన్ అయినా మోటుగా కనిపించడకూడదు కదా! అందుకని కొంచెం మెయిన్టైన్ చేశాను. ఓ పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు తిన్నాను. మొహం మొత్తే రేంజ్లో తిన్నానంటే చూసుకోండి. దేవుడు ఏదో రూపంలో శాటిస్ఫై చేస్తాడనుకుంటా. ఆ పదేళ్లు తిండి పరంగా తృప్తిపరిచాడు. మా ఆయన అయితే ‘ఏంటి ఇలా తింటున్నావ్’ అనేవారు. ‘ఒకప్పుడు నేనెంత శాక్రిఫైస్ చేసానో తెలుసా’ అనేదాన్ని. మీ ఏజ్ ఎంత మేడమ్? మా ఆయన 50 దాటితే 50 ప్లస్.. 40 దాటితే 40 ప్లస్ అని చెప్పమన్నారు. సో.. ఫిఫ్టీ ప్లస్‌లో ఉన్నాను. - డి.జి. భవాని -
గంట వ్యవధిలో 4 స్నాచింగ్స్
ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో రెచ్చిపోయిన దొంగలు అమీర్‌పేట్: సంజీవరెడ్డినగర్ ఠాణా పరిధిలో చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. గంట వ్యవధిలో నలుగురు మహిళల మెడలో నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయారు. సినీనటి శ్రీలక్ష్మి స్నాచింగ్ సంఘటన మరిచిపోకముందే దొంగలు ఎస్సార్‌నగర్ పరిధిలో వరుసగా నాలుగు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... మధ్యాహ్నం 12 గంటలు: మధురానగర్‌కు చెందిన వెంకాయమ్మ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 6 తులాల గొలుసుకు తెంచుకుని పారిపోయారు. మధ్యాహ్నం 12.15: అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో ఉండే విజయలక్ష్మి స్థానికంగా ఉన్న తమ సూపర్ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా... వెనుక నుంచి వచ్చిన దొంగలు ఆమె మెడలోని 15 తులాల గొలుసు తెంచుకెళ్లారు. మధ్యాహ్నం 12.30: బల్కంపేట బీకేగూడకు చెందిన శ్యామల (70) తమ ఇంటి ముందు నిలిచి ఉండగా ఆమె మెడలో ఉన్న 6 తులాల గొలుసును తెంపుకెళ్లారు. మధ్యాహ్నం 12.40: వరంగల్‌కు చెందిన రజని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బంధువును చూసేందుకు వచ్చింది. రోడ్డుపై నడుకుంటూ వెళ్తుండగా దుండగులు ఆమె మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఇదీ దొంగల రూట్... ముందుగా మధురానగర్‌లో స్నాచింగ్‌కు పాల్పడ్డ దొంగలు.. అక్కడ రోడ్డు క్రాస్‌చేసి అమీర్‌పేటకు వచ్చారు. ధరమ్‌కరమ్ రోడ్డులో మరో స్నాచింగ్‌కు పాల్పడి.. బీకేగూడ మీదుగా వచ్చి వృద్ధురాలి గొలుసును తెంచుకెళ్లారు. అక్కడ చివరగా ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో మరో మహిళ మెడలోని చైన్‌ను లాక్కుని జాతీయ రహదారి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు మాయం!
నంద్యాల టౌన్: ఇన్నాళ్లు అడవిని కొల్లగొట్టిన ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఏకంగా నేషనల్ హైవే, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఏఎస్పీ ఆఫీసు సమీపంలో ఉన్న నంద్యాల డివిజనల్ ఫారెస్టు అధికారి కార్యాలయంలో చోరీకి పాల్పడ్డారు. అధికారుల సంరక్షణలో ఉన్న రూ.50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చోటు చేసుకొని నెల గడిచినా అటవీ శాఖ అధికారులు బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బొమ్మలసత్రంలో అటవీ శాఖ కార్యాలయం ఉంది. పక్కనే ఆర్అండ్బీ శాఖ, నందిపైపుల ఫ్యాక్టరీ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఏఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. డివిజన్ పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను డీఎఫ్ఓ కార్యాలయ ప్రాంగణంలో భద్రపరుస్తారు. కార్యాలయానికి కాపలా కూడా ఉంటుంది. అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సిబ్బంది కళ్లు కప్పి నెల క్రితం ఆర్డీఓ బంగ్లాకు వెళ్లే దారిలో లారీని నిలిపి రాత్రికి రాత్రే చడి చప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను ఎక్కించి చోరీ చేసినట్లు సమాచారం. మూడు టన్నులకు పైగా బరువు ఉన్న 80 ఎర్రచందనం దుంగలను అపహరించినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.50 లక్షలు పైమాటే. పనిలో పనిగా దొంగలు నాణ్యతను పరిశీలించకుండా మరో 20 సండ్రా దుంగలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ వ్యవహారం నాలుగైదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే అటవీ శాఖ అధికారులు అసలు నిజం వెలుగులోకి రాకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చోరీ జరగలేదు: డీఎఫ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎలాంటి చోరీ జరగలేదని నంద్యాల డీఎఫ్ఓ శ్రీలక్ష్మి చెప్పారు. ఇక్కడ ఉన్న ఎర్రచందనం దుంగలను ఎప్పటికప్పుడు ప్రొద్దుటూరు డిపోకు తరలించామని ఆమె వివరించారు.