breaking news
Sri Lanka-India
-
లంక పని పట్టాలి!
కొలంబో: నిదహస్ ట్రోఫీలో ఫైనలే లక్ష్యంగా ఆతిథ్య శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. ఈ టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో ఉండటంతో అందరిని ఫైనల్ బెర్తు ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌పైనో, మరో జట్టు జయాప జయాలతోనో సంబంధం లేకుండా... తమ శక్తిసామర్థ్యాలతోనే టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే సోమవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిందే. ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్ బ్యాటింగ్ ఫర్వాలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌తో పాటు, నిలకడలేని బౌలింగ్ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా కాపాడుకోలేకపో యింది. రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడటంతో చండిమాల్ స్థా నంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు. రోహిత్ చెలరేగాలి... కోహ్లి గైర్హాజరీలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వ్యక్తిగతంగా గత రెండు టి20ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆతిథ్య జట్టుతో కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణిస్తే తిరిగి పుంజుకునే అవకాశముంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్‌కు రో‘హిట్స్’ జతయితే జట్టు భారీస్కోరు ఖాయమవుతుంది. టి20ల్లో ధావన్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో చెలరేగిన అతను ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలు బాదాడు. మనీశ్ పాండే అతనికి అండగా నిలిచాడు. నిలకడగా ఆడిన పాండే రెండు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన రైనా బంగ్లాపై ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు అవకాశం ఇస్తే...పంత్ బెంచ్‌కు పరిమితం కావొచ్చు. బౌలింగ్ విభాగం కూడా కెప్టెన్ ఫామ్‌లాగే టీమ్ మేనేజ్మెంట్లో ఆందోళన పెంచుతోంది. ఉనాద్కట్ గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినప్పటికీ తొలిపోరులో చేతులెత్తేశాడు. చహల్ మ్యాజిక్ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ బంగ్లాపై రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అయితే సమష్టిగా రాణిస్తేనే భారీస్కోర్లు చేస్తున్న శ్రీలంకను నిలువరించగలం. లేదంటే తొలి మ్యాచ్ ఫలితం పునరావృతమయ్యే అవకాశముంది. లంక బలం కూడా బ్యాటింగే... ఈ టోర్నీలో శ్రీలంక బ్యాటింగ్ అద్భుతం. తొలి మ్యాచ్‌లో భారత్ తమ ముందుంచిన లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండొందల పైచిలుకు స్కోరు చేసింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ ఓవరాల్‌గా బ్యాటింగ్ ఫామ్ స్థిరంగా ఉంది. ముఖ్యంగా కుశాల్ పెరీరా స్ట్రయిక్‌రేట్ అసాధారణంగా ఉంది. ఇద్దరు ప్రత్యర్థులపైనా అతను రెండు మెరుపు అర్ధశతకాలు సాధించాడు. అతనితో పాటు కుశాల్ మెండిస్ గత మ్యాచ్‌లో కనబరిచిన జోరు భారత బౌలర్లకు మింగుడు పడని అంశమే. వీరికి గుణతిలక, తరంగలు కూడా జతయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాహుల్/రిషభ్ పంత్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, చహల్, విజయ్ శంకర్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), లక్మల్, తరంగ, గుణతిలక, కుశాల్ మెండిస్, షనక, కుశాల్ పెరీరా, జీవన్ మెండిస్, నువాన్ ప్రదీప్, చమీర, ధనంజయ డిసిల్వా. స్లో ఓవర్‌రేట్... చండిమాల్ సస్పెన్షన్ స్లో ఓవర్‌రేట్ కారణంగా శ్రీలంక సారథి చండిమాల్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. దీంతో అతను నేటి మ్యాచ్‌తో పాటు, 16న బంగ్లాదేశ్‌తో పోరుకూ దూరమయ్యాడు. బంగ్లాతో శనివారం జరిగిన పోరులో లంక నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఆదివారం కెప్టెన్ చండిమాల్ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం ఆయన ‘సీరియస్ స్లో ఓవర్‌రేట్’ కావడంతో శిక్ష ఖరారు చేశారు. సస్పెన్షన్‌తో పాటు సహచరులపై పది శాతం జరిమానా పడింది. ఈ 12 నెలల్లో మరోసారి ఇది పునరావృతమైతే ఏకంగా రెండు టెస్టులు లేదంటే నాలుగు వన్డేలు/నాలుగు టి20ల సస్పెన్షన్ వేటు పడుతుంది. బంగ్లా సారథి మçహ్ముదుల్లాపై కూడా స్లో ఓవర్‌రేట్ కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. పిచ్, వాతావరణం ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. పిచ్ మరోసారి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. రాత్రివేళలో వర్షం కురిసే అవకాశం ఉంది. -
ఆరంభం అదిరినా!
► తడబడిన భారత మిడిల్ ఆర్డర్ ► తొలి ఇన్నింగ్స్ 329/6 ► ధావన్ శతకం ► రాహుల్ అర్ధ సెంచరీ ► రాణించిన లంక బౌలర్లు విదేశీ గడ్డపై తొలిసారిగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తున్న భారత్‌కు ఈ సిరీస్‌లో తొలిసారిగా శ్రీలంక బౌలర్ల నుంచి ఇబ్బంది ఎదురైంది. తొలి సెషన్లో భారత్ చెలరేగినా... తర్వాతి రెండు సెషన్లలో శ్రీలంక బౌలర్లు పైచేయి సాధించారు. శిఖర్ ధావన్, రాహుల్ తొలి వికెట్‌కు 188 పరుగులు జత చేయడంతో.. ఇక మరోసారి భారీ స్కోరు ఖాయమే అనిపించింది. ఓపెనర్లు పెవిలియన్‌కు చేరాక సీన్ రివర్స్ అయ్యింది. మిడిల్ ఆర్డర్ తడబాటుతో భారత్ 141 పరుగుల తేడాలో ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో 600 పైచిలుకు స్కోరు చేసిన భారత్ ఈసారి 400 పరుగులు దాటే విషయం టెయిలెండర్ల చేతుల్లో ఆధారపడి ఉంది. పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఎప్పటిలాగే తొలి రోజు భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు) సిరీస్‌లో రెండో శతకంతో చెలరేగడంతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో టీమిండియా 400 పరుగులు కూడా సులువుగా దాటేస్తుందేమో అనిపించినా... అనూహ్యంగా శ్రీలంక బౌలర్లు విజృంభించారు. దీంతో ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ కూడా పూర్తిగా తడబడింది. ఫలితంగా శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (84 బంతుల్లో 42; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... క్రీజులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (38 బంతుల్లో 13 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (1 బ్యాటింగ్) ఉన్నారు. పుష్పకుమారకు మూడు, సందకన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా స్థానంలో ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ భారత తుది జట్టులోకి వచ్చాడు. సెషన్–1 ఓపెనర్ల జోరు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శిఖర్ ధావన్, రాహుల్ జోడి అద్భుత ఆరంభాన్ని అందించింది. పిచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో ఈ జోడి యథేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించింది. ఆరో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు బాదగా, ధావన్ మరో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ ఆన్‌లో పుష్పకుమార జారవిడిచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ వన్డే తరహాలో చెలరేగిన వీరిద్దరు 107 బంతుల్లోనే జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. అటు చక్కటి ఫోర్‌తో రాహుల్ 67 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో కూడా అతను వరుసగా రెండు ఫోర్లు బాది పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. ఓవర్లు: 27, పరుగులు: 134, వికెట్లు: 0 సెషన్–2 ధావన్ శతకం లంచ్ అనంతరం కూడా శిఖర్, రాహుల్ దూకుడును కొనసాగించారు. అయితే 39 ఓవర్ల అనంతరం ఎడంచేతి వాటం స్పిన్నర్ పుష్పకుమారను బరిలోకి దింపిన లంక ఫలితం పొందింది. వరుసగా ఏడోసారి కూడా తన హాఫ్ సెంచరీని శతకంగా మలచకుండా రాహుల్ మిడ్ ఆన్‌లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే తన జోరును కొనసాగించిన ధావన్ మాత్రం 107 బంతుల్లో సిరీస్‌లో రెండో శతకాన్ని అందుకున్నాడు. కానీ కొద్దిసేపటికే పుష్పకుమార... ధావన్ వికెట్ కూడా తీసి లంక శిబిరంలో డబుల్ సంతోషాన్ని నింపాడు. పుజారా (8) కూడా త్వరగానే అవుట్ కావడంతో కోహ్లి, రహానే జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు. ఓవర్లు: 29, పరుగులు: 101, వికెట్లు: 3 సెషన్–3 తడబాటు ఆఖరి సెషన్లో లంక బౌలర్ల హవా సాగింది. స్పిన్నర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. రహానే (17) వికెట్‌ను కూడా పుష్పకుమార తీయడంతో భారత్ 264 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, అశ్విన్ (75 బంతుల్లో 31; 1 ఫోర్) జోడి లంక బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంది. 12 ఓవర్లు ఆడిన ఈ జోడి ఒక్క బౌండరీ కూడా నమోదు చేయలేకపోయింది. చివరికి 79వ ఓవర్లో స్పిన్నర్ సందకన్‌కు కోహ్లి దొరికిపోయాడు. మరో రెండు ఓవర్లలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా అశ్విన్ కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫెర్నాండో బౌలింగ్‌లో అవుట్ కావడంతో జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఓవర్లు: 34, పరుగులు: 94, వికెట్లు: 3 గతంలో నా ఆట గాడి తప్పినప్పుడు పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడేవాణ్ని. కానీ ఇప్పుడలా కాకుండా నా సహజ శైలినే నమ్ముకుంటున్నాను. అదే ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. రాహుల్, నేను బాగా ఆడాం. అయితే దూకుడుగా వెళుతున్నప్పుడు అదే తరహాలోనే అవుట్ కూడా అవుతుంటాం. చివరి రెండు సెషన్లలో వికెట్లను కోల్పోవడం సాధారణమే. స్పిన్నర్లు పుష్పకుమార, సందకన్ నిలకడగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినా తొలి రోజు మేం సాధించిన 329 పరుగులు మరీ తక్కువేమీ కాదు. అయితే ఈ పిచ్‌పై భారీ స్కోరు కోసం పరుగులు చేయడం కష్టమే. – భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ⇒ వరుసగా ఏడు టెస్టుల్లో అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా కేఎల్.రాహుల్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఎవర్టన్ వీక్స్, ఆండీ ఫ్లవర్, చందర్‌పాల్, సంగక్కర, క్రిస్ రోజర్స్ ఇలా చేశారు. ⇒ మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా 3 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజే 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. ⇒ కోహ్లి కెప్టెన్సీలో భారత్ వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో కనీసం ఒక మార్పుతో బరిలోకి దిగింది. ⇒ శ్రీలంక గడ్డపై టెస్టుల్లో తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల (188) భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా ధావన్, రాహుల్ గుర్తింపు. ⇒ శిఖర్ ధావన్ టెస్టుల్లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. ఇందులో ఐదు విదేశీ గడ్డపైనే వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) చండిమాల్ (బి) పుష్పకుమార 119; రాహుల్ (సి) కరుణరత్నే (బి) పుష్పకుమార 85; పుజారా (సి) మాథ్యూస్ (బి) సందకన్ 8; కోహ్లి (సి) కరుణరత్నే (బి) సందకన్ 42; రహానే (బి) పుష్పకుమార 17; అశ్విన్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 31; సాహా బ్యాటింగ్ 13; పాండ్యా బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో ఆరు వికెట్లకు) 329. వికెట్ల పతనం: 1–188, 2–219, 3–229, 4–264, 5–296, 6–322. బౌలింగ్: ఫెర్నాండో 19–2–68–1; లాహిరు కుమార 15–1–67–0; కరుణరత్నే 5–0–23–0; పెరీరా 8–1–36–0; సందకన్ 25–2–84–2; పుష్పకుమార 18–2–40–3. -
శ్రీలంక బౌలర్లను తప్పుబట్టిన సంగక్కర
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన శ్రీలంక బౌలర్లను ఆ దేశ మాజీ కెప్టెన్ సంగక్కర తప్పుబట్టాడు. స్లో ఓవర్ రేటు కారణంగా శ్రీలంక తాత్కలిక కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్‌లు నిషేదం విదించిన విషయం తెలిసిందే. సీనియర్ బౌలర్లు ఉన్న స్లో ఓవర్ రేటు ఎందుకు వేయాల్సి వచ్చిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ లసిత్ మలింగా, మరో ఇద్దరూ స్సిన్నర్లు ఉన్నా 39 నిమిషాలు మ్యాచ్ ఆలస్యం కావడం ఆహ్వానించదగిన విషయం కాదని ఐసీసీకి రాసిన కాలమ్‌లో సంగక్కర అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ వేగంగా జరిగేందుకు వికెట్ కీపర్, ఫీల్డర్లు కూడా భాగమవ్వాలని సూచించాడు. ఇక దూకుడ మీద ఉన్న భారత్‌ను శ్రీలంక సగర్వంగా ఎదుర్కోవాలన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయం పొందడంతో గురువారం భారత్‌తో జరిగే మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది. ఆత్మస్థైర్యంతో సానుకూలంగా భారత్ ఎదుర్కోవాలని సంగక్కర శ్రీలంక ఆటగాళ్లకు సూచించాడు. పాక్‌పై విజయం సాధించి ఊపు మీద ఉన్నభారత్ను ఎదుర్కోవడం అంత సులువు కాదని సంగక్కర అభిప్రాయపడ్డాడు.భారత్ పై గెలవాలంటే 10 ఓవర్లలోపే వికెట్లు తీయాలన్నాడు. ఇక భారత్ బౌలింగ్‌కు అప్రమత్తంగా ఉండాలని, ఈ మధ్య కాలంలో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని సంగక్కర హెచ్చరించాడు. ముఖ్యంగా పేస్ విభాగం పటిష్టంగా ఉందని, ఇక స్పిన్ వారి అదనపు బలమన్నాడు. ఉపుల్ తరంగపై నిషేదం, కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్‌పై సందిగ్థత నెలకోవడంతో శ్రీలంకకు సానుకూల పరస్థితులు కనబడటం లేదని సంగక్కర పేర్కొన్నాడు.