breaking news
Smart City structure
-
నగరంలోకి ఎలక్ర్టికల్ బస్సులు
సాక్షి కరీంనగర్ : తెలంగాణ ఆర్టీసీ ఇంధన పొదుపు, కాలుష్యానికి విరుగుడుతోపాటు లాభాలు ఆర్జించడంపై దృష్టి సారిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లకుండా.. చడీచప్పుడు కాకుండా రోడ్లపై పాములా దూసుకుపోతూ మెరుగైన ప్రయాణ సేవలు అందించే ఎలక్ట్రిక్ బస్సులు నడిపించడంపై కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రజల ఆదరణతో సంస్థను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడపించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించడానికి కావాల్సిన వసతులు, సౌకర్యాలు, రోడ్లు, ప్రజల ఆదరణపై గత నెల అధికారులు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే బ్యాటరీ బస్సులు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు.. జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు కరీంనగర్ స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌కు ముందస్తుగా 30 బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్సుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అభివృద్ధి చెందుతున్న సిటీలకు రాయితీపై బ్యాటరీ బస్సులు అందిస్తోంది. స్మార్ట్‌సిటీలకు 50వరకు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ముందస్తుగా కొన్నింటిని ఏర్పాటు చేసి ప్రజాదరణకు అనుగుణంగా మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అద్దె ప్రాతిపదికన.. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్లో ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బ్యాటరీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనుంది. ముందుగా కరీంనగర్లో ఎన్ని బస్సులు అవసరం ఉంటుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి యాజమాన్యం ప్రభుత్వానికి పంపిస్తుంది. బస్సుల అవసరం మేరకు బ్యాటరీ బస్సులు ఇవ్వడానికి ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నిబంధనల ప్రకారం బస్సు ధరలో రాయితీపై బ్యాటరీ బస్సులు అందచేస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకంలో ద్వారా ఇస్తున్న బ్యాటరీ బస్సులను ఆర్టీసీలో అద్దె బస్సులుగా ఏర్పాటు చేస్తుంది. కరీంనగర్లో ఏర్పాటుకు.. స్మార్ట్‌సిటీగా గుర్తించిన కరీంనగర్లో ఆర్టీసీ బ్యాటరీ బస్సులు నడిపించే ఆలోచన చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని సిటీబస్సులుగా సేవలు అందించాలా, కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి తేవాలా అనే విషయంపై ఇంకా అధికారులు ఆలోచనలోనే ఉన్నారు. ముందుగా బస్సు కండీషన్, బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఎంతదూరం ప్రయాణం చేయవచ్చు, అందుబాటులో ఉన్న గ్రామాలు, ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం, రోడ్ల పరిస్థితిని ఆలోచించాల్సిన అసవరం ఉంది. వీటితోపాటు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా నిర్వహణ వ్యయం అధికమవుతుందని, దీంతో చార్జీలు పెంచాల్సి ఉంటుందని సమాచారం. ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు.. బ్యాటరీ బస్సు ఒక్కసారి చార్జీ చేస్తే 300 కిలోమీటర్లు తిరుగుతుంది. గరిష్టంగా 300 కిలోమీటర్ల పరిధిలోనే బస్సులు నడిపించాల్సి ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్లో కూడా బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇంకా బస్సుల ఏర్పాటుపై తుది నిర్ణయం కాలేదు. - జీవన్‌ప్రసాద్, రీజినల్ మేనేజర్, కరీంనగర్. -
డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత
- వెల్లడించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ - మైక్రోసాఫ్ట్ సీఈవోసత్య నాదే ళ్లతో భేటీ - రాష్ట్రంలో స్మార్ట్ సిటీ, గ్రామాల్లో ఆరోగ్య సేవలకు చేయూత - పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు ముంబై: రాష్ట్రంలో డిజిటల్ గ్రామాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. వారం రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన సీఎం గురువారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ గ్రామాలకు సాంకేతిక సహాయం చేయడానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని భేటీ అనంతరం సీఎం ట్వీట్ చేశారు. అమరావతి జిల్లాలోని మెల్ఘాట్ గ్రామంలో పెలైట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలు పెడతామని చెప్పారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) మదిరిగా స్మార్ట్‌సిటీ నిర్మాణానికి సహకరిస్తానని ఐటీ దిగ్గజం హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని చెప్పారు. అనంతరం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ సీఈఓ రేమండ్ కార్నర్‌తో సీఎం సమావేశ మయ్యారు. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో విమానాల నిర్వహణ, మరమ్మతుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని, శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తామని బోయింగ్ హామీ ఇచ్చిందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) జాయ్ మినారిక్తో సమావేశమైన సీఎం రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీకి సహకరించాలని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏడబ్ల్యూఎస్ సిద్ధంగా ఆసక్తి చూపుతోందని ఆయన పేర్కొన్నారు. కీలక కంపెనీలతో భేటీ వారంరోజుల పర్యటనలో భాగంగా అమెరికా వచ్చిన సీఎం న్యూయార్క్, న్యూజెర్సి, డెట్రాయిట్లలో పర్యటించారు. జనరల్ మోటార్స్, క్రిస్లర్ హెడ్‌క్వార్టర్స్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కో బయలు దేరిన సీఎం తర్వాత లాస్ఏంజిల్స్ వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, రాష్ట్ర కేబినెట్ మంత్రులతో అమెరికా బయలుదేరిన సీఎం గూగుల్, సిస్కో, ఆపిల్ సంస్థలతో భేటీ అయ్యారు. బ్లాక్‌స్టోన్, పంచ్సిల్లతో వివిధ జాయింట్ వెంచర్ల ప్రాజెక్టులకుగానూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఓఎన్ ఫ్రీ ఓన్ సెజ్‌లో రూ. 750 కోట్లు, హింజెర్వాడీలో రూ. 1,200 కోట్లు, సెంట్రల్ ముంబైలోని ఐటీ పార్క్‌లో రూ. 1,500 కోట్లు, ముంబైలోని మరో ఐటీ పార్క్‌లో రూ. 1050 కోట్లు పెట్టుబడి పెట్టడానికి బ్లాక్‌స్టోన్ అంగీకరించిందని సీఎం ట్వీట్ చేశారు. చిప్లున్ ఎంఐడీసీలో రూ. 500 కోట్లు కోకకోలా కంపెనీ పెట్టుబడి పెట్టనుంది. సీఎం కారణం కాదు: ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాదని ఆయనతోపాటు విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు అన్నారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల ప్రయాణం ఆలస్యమైందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా జూన్ 30న అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యంగా బయలు దేరిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీఎంతో పాటు అమెరికా పర్యటనకు బయలుదేరిన ఓ అధికారి సరైన డాక్యుమెంట్లు తీసుకురాకపోవడం వల్ల విమానం నిలిపివేయాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని శుక్రవారం ట్వీట్ చేశారు. ఆయనతోపాటు ప్రయాణించిన మరో ఇద్దరు ప్రయాణికులు ఆయన మద్దతు పలికారు. విమాన ప్రయాణం ఆలస్యానికి కారణం సీఎం ఫడ్నవీస్ కాదని ట్వీట్ చేశారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల విమానం ఆలస్యంగా బయలు దేరిందని ఉదయ్‌పూర్‌కు చెందిన రచయిత, జర్నలిస్ట్ దుశ్యంత్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశారు. విమానాన్ని ఆపమని సీఎం చెప్పలేదని, ఆ సమయంలో ఆయన ఏవో ఫైళ్లు చూస్తున్నారని మరో ప్రయాణికుడు అరవింద్ షా ట్వీట్ చేశారు. అయితే తప్పదోవ పట్టించడానికే ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ పర్దేశీతో కలసి సీఎం ఫడ్నవీస్ జూన్ 30న అమెరికా బయలుదేరిన సమయంలో ఘటన జరిగింది. పర్దేశీ సరైన యూఎస్ వీసా తీసుకురాకపోవడంతో ఆయన వీసా తీసుకువచ్చాక విమాన బయలుదేరిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఘటనపై కాంగ్రెస్ సీఎం ఫడ్నవీస్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రజలను సీఎం క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది.