breaking news
siardie
-
ఎకరానికి లక్ష !
సీఆర్డీఏలో మామూళ్లు మామూలే ఉడా అవినీతిమయమంటూ మొదట్లో హడావుడి ఆ తర్వాత అందరూ కలిసి దోపిడీ లేఅవుట్లు, అపార్టుమెంట్లకు యథేచ్ఛగా వసూళ్లు విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడా స్థానంలో ఆవిర్భవించిన సీఆర్డీఏ మొదట్లో ఉప్పులా కనిపించినా ప్రస్తుతం చప్పగా మారిపోయింది. మామూళ్లు, పైరవీలు ఉడా మాదిరిగానే చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. ఉడాలో పనిచేసిన అధికారులు, సిబ్బంది అవినీతిపరులని, ఎవరికీ పని రాదని, అందరినీ మార్చేస్తామని తొలుత సీఆర్డీఏ పగ్గాలు చేపట్టిన ఉన్నతాధికారులు ఘీంకరించారు. దీంతో పాత ఉడా ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోనని బెంగపెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఆ సమయంలో పాత ఉద్యోగులను సీఆర్డీఏ కార్యాలయంలో దోషులుగా చూసే పరిస్థితి ఉండేది. దీన్ని తట్టుకోలేక కొందరు హెచ్వోడీలు వేరే శాఖల్లోకి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం అవినీతిలో సీఆర్డీఏ ఉడాను మించిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత, కొత్త యంత్రాంగం కలిసి అందినకాడికి దోచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు నిబంధనలే, మామూళ్లు మామూలే అన్నట్లుంది అక్కడ పరిస్థితి. అన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి అయినా ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి. రియల్ వెంచర్లు, అపార్టుమెంట్లకు అనుమతులిచ్చే డెవలప్మెంట్ కంట్రోల్ విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఉన్నతాధికారులంతా రాజధాని వ్యవహారాల హడావుడిలో మునిగితేలుతుంటే ఈ విభాగంలో పనిచేసేవారు చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు తప్పనిసరి... కిందిస్థాయి నుంచి విభాగాధిపతి వరకూ అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు సమర్పించుకుంటే గానీ ఫైలు కదలడం లేదు. లేఅవుట్లకు అనుమతి ఇచ్చేందుకు ఏరియాను బట్టి మామూళ్ల రేట్లను ఫిక్స్ చేశారు. విజయవాడ పరిసరాల్లో ఎక్కడైనా ఎకరం భూమిని లేఅవుట్ చేయించుకోవాలంటే కనీసం లక్ష ఖర్చు పెడితేగానీ పని జరగడంలేదు. సాధారణంగా ఎకరం భూమి లేఅవుట్ కోసం సీఆర్డీఏకు కట్టాల్సిన ఫీజులే రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటున్నాయి. మామూళ్లతో కలిపి ఈ ఖర్చు రూ.5 లక్షలకు చేరుతోంది. సర్వేయర్ మొదలు పైస్థాయి అధికారులకు ఇచ్చే మొతం లక్షకు మించిపోతోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలో నాలుగు ఎకరాల భూమికి లేఅవుట్ మంజూరు చేసేందుకు ఒక రియల్ కంపెనీ నుంచి రూ.4.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. అన్నీ సక్రమంగా ఉంటేనే ఈ రేటు. ఏదైనా తేడా ఉంటే ఇక ఆ కంపెనీ ప్రతినిధులను రోజుల తరబడి తమ చుట్టూ తిప్పుకుని సాధారణంగా ఇచ్చే మామూలు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఫైలు ప్లానింగ్ అధికారి దగ్గర ఉందని, డెరైక్టర్ పెండింగ్‌లో పెట్టారని, కొన్నిసార్లు కమిషనరే ఆపేశారని చెబుతూ డబ్బు గుంజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కంకిపాడు సమీపంలోని రియల్ కంపెనీ మూడున్నర ఎకరాల లేఅవుట్‌కు రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. గాలిలో కలుస్తున్న నిబంధనలు... ఇక అపార్టుమెంట్ల నిర్మాణానికి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి శివార్లలో నిబంధనలు అతిక్రమించి మరీ ఇష్టానుసారం భవనాలు కట్టేస్తున్నారు. కానూరు నుంచి కంకిపాడు వరకూ, గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ, ఎనికేపాడు నుంచి గన్నవరం వరకూ అనేక భవనాలు సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటిని చూసీచూడకుండా ఉండడం కోసం సీఆర్డీఏ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇందులో భాగం ఉంటోంది. కానీ వాటి గురించి ఎవరైనా వారి వద్ద ప్రస్తావిస్తే అలా జరుగుతోందా, నిజమా.. మాకు తెలియదే! అంటూ నటిస్తున్నారు. దీనివల్ల సీఆర్డీఏ నిబంధనలు గాలిలో కలిసిపోతుండగా, అధికారుల జేబులు మాత్రం నిండుతున్నాయి. పైకి సీఆర్డీఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీలా ఉందనే కలరింగ్ ఇస్తున్నా లోపల మాత్రం అంతా మామూళ్ల మయంగా మారిపోయింది. -
‘సీఆర్డీఏ’లో లేఅవుట్లకు గ్రీన్‌సిగ్నల్
గుట్టుచప్పుడు కాకుండా 130 అనుమతులు మంత్రి నారాయణ ఆదేశంతో పరుగులు పెడుతున్న ఫైళ్లు సాక్షి, విజయవాడ బ్యూరో: మూడు నెలల కిందట నిలిచిపోయిన లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సీఆర్డీఏ వాయువేగంతో అనుమతులు మంజూరు చేస్తోంది. మరిన్ని ఫైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన సీఆర్డీఏ పరిధిలోని లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులివ్వాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ నాలుగురోజుల కిందట మౌఖిక ఆదేశాలిచ్చారు. ఆందోళనలు, ఉద్యమాల వల్ల పని జరగదనే వాస్తవాన్ని గ్రహించిన కొందరు రియల్ పెద్దలు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే టీడీపీ ముఖ్య నాయకుడి అనుగ్రహం సంపాదించారు. ఆయన ఈ సాయం ఉచితంగా చేసిపెట్టారా? లేక చేతుల మార్పిడి వ్యవహారం ఏమైనా జరిగిందా అనేది తెలియక పోయినప్పటికీ ఏదో జరిగిందని మాత్రం అధికారవర్గాలు ఘంటాపథంగా ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేస్తున్నాయి. జూన్‌లో అనుమతులు నిలిపివేత రాజధాని భూసమీకరణకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో అప్పటి వీజీటీఎం ఉడా పరిధిలో కొత్త లేఅవుట్లు, గ్రూపు భవనాలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం నిలిపేసింది. పట్టపగ్గాలు లేకుండా దూసుకెళుతున్న రియల్ వ్యాపారానికి కళ్లెం వేసే ఆలోచన కూడా అనుమతులు నిలిపేయడానికి మరో కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రియల్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది. లేఅవుట్లకు అనుమతి రాకపోవడంతో రియల్ వ్యాపారులు అప్పటికే వేసిన వెంచర్ల అమ్మకాలు నిలిచిపోయాయి. కొత్త వెంచర్లకు అవకాశం లేకుండాపోయింది. నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోవడంతో అపార్టుమెంట్లు, గ్రూప్ భవనాల పరిస్థితి కూడా అలాగే మారింది. ప్రభుత్వం అనుమతులు నిలిపేసే నాటికి గత సంవత్సరం జూన్‌కు ముందు స్వీకరించిన లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను ఉడా పరిశీలిస్తోంది. కొత్త మార్గదర్శకాలు లేకుండానే.. సీఆర్డీఏ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తుందని, అప్పటివరకు అనుమతులు ఉండవని అధికారులు చెబుతూ వచ్చారు. దీంతో రాజధాని మాస్టర్‌ప్లాన్ వచ్చేవరకు అనుమతులు ఇవ్వరనే ప్రచారం జరిగింది. మాస్టర్‌ప్లాన్ వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి అనుగుణంగా రోడ్ల వెడల్పు, కామన్ సైట్లు వంటి నిబంధనలు మారతాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చినప్పుడు లేఅవుట్లు, నిర్మాణాల ఫైళ్లను క్లియర్ చేయాలని, కొత్త వాటికి అనుమతివ్వాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ ప్లానింగ్ విభాగం అధికారులు ఫైళ్ల దుమ్ము దులిపి ఆగమేఘాల మీద వాటిని క్లియర్ చేయడం ప్రారంభించింది. నాలుగు రోజుల్లోనే లేఅవుట్లు, నిర్మాణాలు, భూమార్పిడికి సంబంధించిన 130కి పైగా ఫైళ్లను క్లియర్ చేశారు. మిగిలిన ఫైళ్లను పండుగ తర్వాత క్లియర్ చేయనున్నారు. అనుమతులు నిలిపేసే సమయంలో ఆ విషయం గురించి ప్రచారం చేసిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిన విషయాన్ని పెద్దగా ప్రాధాన్యత లేని అంశంగా చూడడం విశేషం. ఇటీవల టీడీపీ నేత నగరానికి వచ్చినప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రియల్ వ్యాపారులు ఆయనతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే వారిమధ్య ఒక అంగీకారం కుదిరిందని, ఆ మేరకే మాస్టర్‌ప్లాన్, నిబంధనల గురించి కనీసం ఆలోచించకుండా లేఅవుట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.