ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య?
బొబ్బిలి: పుట్టింది పేదరికంలోనైనా చదువులో దిట్ట..పదోతరగతి, ఇంటర్లో ప్రతిభను చూపి సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాడు. ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్ రెండో సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థి బావిలో శవమై తేలవడంతో తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. మృతుడి స్నేహితులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన షేక్ ఆలీ ఖాన్(18) అనే విద్యార్థి బొబ్బిలి పట్టణంలో ఐటీఐ కాలనీ సమీపంలోని బావిలో ఆదివారం శవమై కనిపించాడు. ఆలీఖాన్ తండ్రి మదీనా సాెహ బ్ టైలరింగ్ వృతిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాత తవుడు, అమ్మమ్మ బంగారమ్మల వద్దే ఆలీఖాన్ ఎక్కువగా ఉంటూ పెరిగాడు. చదువులో మంచి ప్రతిభ చూపుతుండడంతో స్థానికులు కూడా ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సహించేవారు.
మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, ఆయన తండ్రి దివంగత జయప్రకాశ్లు ఆలీఖాన్ చదువులో ముందుకెళ్లడానికి సహకరించారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న గురుకుల పాఠశాలలో అలీఖాన్ 8,9,10 తరగతులు చదువుకున్నాడు. బాడంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. ఇంటర్ పూర్తయిన తరువాత స్వయం ఉపాధితో ముందుకెళ్లాలని యోచించి బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో చేరాడు. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రూ.1800 ఫీజు కూడా చెల్లించాడు. శుక్రవారం ఐటీఐలో నిర్వహించిన వర్క్షాపు కాలిక్యులేషన్ పరీక్ష రాసిన తరువాత మందులు కొనుక్కుని వస్తానని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి చేరలేదు. దీంతో స్నేహితులతో పాటు బంధువులు ఆలీఖాన్ కోసం వెతికి చివరకు బాడంగి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
అలీఖాన్ చదువుతున్న ఐటీఐ కళాశాలకు కొద్ది దూరంలో ఉన్న బావిలో ఆదివారం శవమై కనిపించాడు. ఆదివారం కావడంతో ఆ బావికి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్న యువకులు స్నానం కోసం బావి దగ్గరకు వెళ్లగా మృతదేహం తేలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆలీఖాన్ కోసం వెతుకుతున్న స్నేహితులు వచ్చి చూసి బంధువులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల నుంచి ఇంట్లో ముభావంగా ఉంటున్నాడని, తిండి కూడా సరిగ్గా తినడం లేదని ఆలీఖాన్ అమ్మమ్మ బంగారమ్మ మనవడు మృతదేహం చూసిన తరువాత అక్కడున్న వారితో చెప్పింది. ఏమైందని అడిగినా సమాధానం ఇవ్వలేదని, నేను ఐటీఐకు వెళ్లను.. పరీక్షలు రాయను భయమేస్తోందని అన్నాడని చెబుతోంది.. తెలివైన విద్యార్థి ఐటీఐ పరీక్షలు రాయడానికి వెళ్లను అనడానికి కారణాలు ఏమై ఉంటాయా? స్థానికులు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలీఖాన్కు ఐటీఐలో వచ్చే కష్టాన్ని ఎప్పుడూ తమకు చెప్పలేదని స్నేహితులు అంటున్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.