breaking news
section8
-
'ఇద్దరు సీఎంలు సినిమా చూపిస్తున్నారు'
కాకినాడ: సెక్షన్ 8 పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని సీపీఐ సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర పుష్కరాలకు నిధులున్నాయి కానీ..పేదలకు మాత్రం నిధులు లేవని మంగళవారం కాకినాడలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలను వ్యాపారంగా మర్చారని నారాయణ ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థతో డబ్బు ఖర్చు తప్ప పెద్దగా ఒరిగేదేమీలేదన్నారు. -
'శత్రుదేశం కన్నా దారుణంగా టీ సర్కారు తీరు'
మా ఓపిక నశించింది ఇక కేంద్రం జోక్యం చేసుకోవాలి మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్: శత్రుదేశం కన్నా దారుణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ దేశంలో ఆ రాష్ట్రం ఒక అంతర్భాగమన్న అంశాన్ని విస్మరిస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆప్రాంత ప్రజలు, విద్యార్ధుల పట్ల అన్యాయంగా ప్రవరిస్తోందని విమర్శించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఇప్పటివరకు చాలా ఓపికతో ఉన్నాం. రాజీధోరణితో వెళ్తున్నా మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు కావాలని అడుగుతున్నాం. మా ఓపిక నశిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్ రాకతప్పదు’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారిగా కాకుండా రాజకీయ సమావేశం మాదిరిగా అధికారులతో భేటీ అయి పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తమకే చెందుతాయని, అక్కడి ఆంధ్రా సిబ్బందిని పంపేయండని, ఎవరికీ సహకరించవద్దని ఆదేశించడం దారుణమన్నారు. చివరకు ఏపీకి చెందిన లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. అంబేద్కర్వర్సిటీలో ఉమ్మడి పరీక్షలు నిర్వహించి కేవలం తెలంగాణ ఫలితాలు విడుదల చేసి ఏపీవి నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తమను రెచ్చగొట్టడమేనన్నారు. ఉన్నత విద్యామండలి రికార్డులు అందిస్తామని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి స్వయంగా అందరి ముందు అంగీకరించి చివరకు ఒక్క ఫైలుకానీ, చివరకు కంప్యూటర్లలోని డేటాను కూడా తీసుకోనివ్వకుండా చేశారని ఆరోపించారు. లక్షలమంది ఎంసెట్ అడ్మిషన్లతో ముడిపడి ఉన్నప్పటికీ రికార్డులు ఇవ్వలేదని, అయినా విద్యార్ధులు ఇబ్బంది పడకుండా సకాలంలో అడ్మిషన్లు పూర్తిచేయించామన్నారు. ఎన్టీరామారావు మానసపుత్రిక అయిన తెలుగువర్సిటీలో ఏపీవారికి ప్రవేశం లేదనడం ఏమేరకు సమంజసమన్నారు. ఎన్నిసార్లు భేటీ అయినా ఫలితం శూన్యం తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ నరసింహన్‌ను ఈ ఆరునెలల్లో 27 సార్లు కలసి విన్నవించామని, అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదని మంత్రి వాపోయారు. మరోసారి గవర్నర్‌ను కలుస్తామని, న్యాయపోరాటమూ సాగిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వంపై కూడా అనేకరకాలుగా ఒత్తిడి చేస్తున్నామని, మళ్లీ వెళ్లి ఇక్కడి సమస్యలను కేంద్రానికి గట్టిగా చెబుతామని వివరించారు. గవర్నర్‌ను మార్చాలా వద్దా అన్నది ముఖ్యం కాదని చట్టం ప్రకారం నడచుకోవాలని పేర్కొంటున్నామన్నారు. -
బాబు స్వప్రయోజనాల కోసమే సెక్షన్ 8 తెరపైకి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసమే సెక్షన్ -8 తెరపైకి తెస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.