breaking news
Satisfaction of people
-
మా మంచి మెట్రో!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన లండన్, మెల్బోర్న్, మాంచెస్టర్, బోస్టన్ తదితర మహానగరాల కంటే మెరుగైన మెట్రో సేవలందిస్తూ ప్రయాణికులను సంతృప్తి పరుస్తోందని తేలింది. ప్రయాణికుల సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98 శాతం మెరుగైన స్కోరు సాధించి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లు మెట్రో ప్రాజెక్టు నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. కియోలిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో వివిధ రకాల ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. ఇందులో లండన్ ఆటోమెటిక్ మెట్రో, మెల్బోర్న్ ట్రామ్వే, బోస్టన్ కమ్యూటర్ ట్రెయిన్, స్టాక్హోమ్ సిటీ బసెస్, లయాన్ మెట్రో అండ్ బస్ సర్వీసెస్, మాంచెస్టర్ ట్రామ్వే తదితర ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో పరుగులు తీయనున్న 57 మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, టికెటింగ్, టికెట్ల విక్రయాలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థల నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును కియోలిస్ సంస్థ 2012లో దక్కించుకున్న విషయం విదితమే. సర్వే సాగిందిలా.. ఈ సర్వేలో ప్రధానంగా మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారా.. మెట్రో సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఎలా ఫీలవుతున్నారు.. ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో సరైన సమాచారం అందుతుందా.. సిబ్బంది వారికి సహకరిస్తున్నారా.. మెట్రో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారా.. తాము చెల్లించిన డబ్బుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికులు అనుకుంటున్నారా.. తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది అభిప్రాయాలను కియోలిస్ సంస్థ పరిశీలించింది. ఈ ఏడాది 25 జూన్ నుంచి– జూలై 11 మధ్య కాలంలో సేకరించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఎల్బీనగర్– మియాపూర్ 1.14 లక్షల మంది.. ఎల్బీనగర్– మియాపూర్ మార్గం (29 కి.మీ)లో మంగళవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో ప్రయాణం చేశారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు మెట్రో రైళ్లు నిండుగా రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎల్బీనగర్– అమీర్పేట్ మార్గంలో ఏకంగా 69 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఇక మియాపూర్– అమీర్పేట్ మార్గంలో 45 వేల మంది రాకపోకలు సాగించారన్నారు. నిత్యం ఈ మార్గంలో సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పా రు. ఇక మంగళవారం నాగోల్– అమీర్పేట్ మార్గంలో 51 వేల మంది మెట్రో ప్రయాణం చేశారని తెలిపారు. -
‘ఉపాధి’ పనులపై 76శాతం మందికి సంతృప్తి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులతో ఎంతో మంచి జరిగిందని ప్రజలు అనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉపాధి పథకం పనుల నాణ్యతపై 76% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. తమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇటీవల చేపట్టిన సర్వేలో కేవలం 0.5శాతం మంది మాత్రం ఉపాధి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. గ్రామాల్లో ఉపాధి వనరులను కల్పించటం ద్వారా స్థిరమైన అభివృద్దికి అవసరమైన వనరులను సృష్టించటమే ఉపాధి హామీ పథకం ఉద్దేశం. దీనికోసం గత మూడేళ్లుగా చేపట్టిన అనేక పనులను పూర్తి చేసి, నాణ్యతను పెంచినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దేశంలో 2016–17 కాలంలో దాదాపు 1.02 కోట్ల పనులను పూర్తి చేసినట్లు పేర్కొంది. -
ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి
ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందే విధంగా పరిపాలన సాగించాలని సీఎం చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విజయవాడలో మంగళవారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం పొందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పాలనా పరమైన సంస్కరణలను సూచించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయలేదన్నారు. వాటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఎన్టీఆర్ సురక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్సీల సమావేశంలో ప్రారంభించారు.