సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో ఘనంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.పుష్కరాల్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు సరస్వతీ అంత్య పుష్కరాలు సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించారు. పవిత్ర పుష్కర స్నానం అనంతరం వారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారికి శేష వస్త్రాలు బహుకరించి, జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా పాల్గొన్నారు.తరువాత గవర్నర్ దంపతులు కాళేశ్వరంలో నూతనంగా నిర్మించిన మ్యూజియం ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సప్త హారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్తో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన నదీ హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.