ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామంది మలయాళీ దర్శకులే గుర్తొస్తారు. మర్డర్ మిస్టరీ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికి ఎన్ని మూవీస్ తీసుంటారో లెక్కలేదు. వీటిలో చాలావరకు అద్భుతమైన హిట్స్ అయ్యాయి. ఇలాంటి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అలా గత నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ అయిన 'సంభవం అధ్యాయం ఒన్ను'.. రీసెంట్గా హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? నిజంగా అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?కేరళ-తమిళనాడు సరిహద్దులోని ఓ పోలీస్ స్టేషన్‌కి ఆనంద్(అస్గర్ అలీ) బదిలీ అవుతాడు. ఊరి లోపలికి వెళ్తుండగా వీళ్ల జీపుని ఢీకొని ఓ పోలీస్ గాయపడతాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చుతూ సదరు పోలీస్ దగ్గరున్న వాకీ టాకీని ఆనంద్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఈ క్రమంలోనే తను చేరాల్సిన స్టేషన్‌లోని అశోకన్, రెజీ అనే తోటి పోలీసులు ఆనంద్కి పరిచయమవుతారు. అనుకోని పరిస్థితుల్లో వాకీ టాకీలో తనని కాపాడమని ప్రాధేయపడుతున్న పోలీసుని కాపాడేందుకు వీరు ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్తారు. కాకి తల, మనిషి శరీరం ఉన్న ఆలయం దగ్గరకెళ్తారు. అప్పటినుంచి వింత సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? అడవిలో చిక్కుకుపోయిన పోలీసుని వీళ్లు కాపాడారా లేదా? కాకి ఆకారంలో ఉన్న గుడి మిస్టరీ ఏంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉంది?మలయాళం నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా ఇది. క్రైమ్, మిస్టరీ అనే అంశాలకు టైమ్ లూప్ అనే క్రేజీ కాన్సెప్ట్ జోడించారు. అయితే ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. కానీ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యేలా తీశారు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.1960లో ఓ విదేశీయుడు, ఓ భారతీయ మహిళ హత్యకు గురవడంతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తారు. ఆనంద్, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది నింపాదిగా చూపిస్తారు. తొలి అరగంట కాస్త ఓపిక పట్టాలి. ఎప్పుడైతే ఆనంద్, అశోకన్, రెజీ కలిసి పోలీసుని వెతికేందుకు అడవిలో వెళ్తారో అక్కడి నుంచి ట్విస్టులు మొదలవుతాయి. అప్పటివరకు సాగదీసినట్లు అనిపించిన కథ కాస్త గ్రిప్పింగ్‌గా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయి.మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌కి ముందొచ్చే సీన్, ఇంటర్వెల్ బ్లాక్‌లోని సీన్స్ ఆశ్చర్యపరుస్తాయి. అడవిలో జరిగే ఒక్కో సంఘటన చూస్తూ ఇటు ప్రేక్షకుడు, అటు ఆనంద్ మెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైతే కాకి ఆలయం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుందో.. అప్పుడు మొదట సీన్‌కి ప్రస్తుతం జరుగుతున్న దానికి లింక్ తెలుస్తుంది. చివరి అరగంట నలభై నిమిషాలైతే వరస పెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కనీసం వీటిలో ఒక్కటి కూడా మీరు ఊహించలేకపోవచ్చు. అరె అప్పుడే సినిమా అయిపోయిందా అనుకునేలోపు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి ముగించారు. బోలెడన్ని సందేహాలని వదిలేసి తర్వాత చాలానే భాగాలున్నాయని చెప్పకనే చెప్పేశారు.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన ఒక్కరూ కూడా మనకు తెలిసిన ముఖాలు కావు. అయినా సరే ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఎందుకంటే అలా నటించారు. చూస్తున్నంతసేపు వాళ్లు యాక్టర్స్, ఇది మూవీ అని అస్సలు గుర్తుకురానంత సహజంగా కుదిరేసింది. దర్శకుడు జీతూ సతీషన్కి ఇదే తొలి సినిమా అంటే అస్సలు నమ్మశక్యంగా అనిపించదు. దాదాపు అడవిలోనే తీశారు. సినిమాటోగ్రఫీ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ మరింత ఎలివేట్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.మలయాళీ దర్శకులకే ఇలాంటి క్రేజీ ఐడియాలు ఎందుకొస్తాయి? తెలుగు డైరెక్టర్స్‌కి ఎందుకు రావు అని.. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా అనిపిస్తుంది. దీని బడ్జెట్ కూడా రూ.5 కోట్లకు మించి ఉండదు. ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఓ మంచి క్రేజీ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)