ఇరాక్‌లో కారు బాంబు పేలుడు:14 మంది మృతి
ఇరాక్‌లోని సమర్రానగరంలో మార్క్ట్ వద్ద నిన్న సాయంత్రం కారు బాంబు పేలుడు సంభవించన ఘటనలో 14 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అయితే గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు.ఈద్- అల్- అదా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్ వద్ద ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. ఆ శబ్దానికి భయపడి ప్రజలు భయంతో పలు వైపులకు పరుగులు తీశారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.
ఇరాక్‌లో ఇటీవల కాలంలో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వివిధ సంఘటనల్లో 6 వేలమంది పౌరులు మరణించారని, 14 వేల మంది గాయపడ్డారని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ పేర్కొంది.