breaking news
rupee slide
-
రూపాయి పతనం షాకే, కానీ...
ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ ప్రకటన కరెన్సీ క్షీణత తాత్కాలికమే... మళ్లీ పుంజుకుంటుంది సంస్కరణలపై వెనక్కితగ్గం... పెట్టుబడులపై నియంత్రణల ప్రసక్తే లేదు... కఠినమైన సంస్కరణలకు సమయం ఆసన్నమైంది... న్యూఢిల్లీ: రూపాయి ఘోర పతనంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. దేశీ కరెన్సీ కుప్పకూలడం కచ్చితంగా దిగ్భ్రాంతికరమైన విషయమేనని.. అయితే, సంస్కరణల ప్రక్రియ నుంచి వెనక్కితగ్గకుండానే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు. విదేశీ పెట్టుబడులు దేశం విడిచివెళ్లకుండా ఎలాంటి నియంత్రణలూ(క్యాపిటల్ కంట్రోల్) విధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఆయన శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నమాట వాస్తవమేనని, ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారని కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఇక్కట్లు మాత్రమేనని.. వృద్ధిరేటు గాడిలోపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలూ కారణమే... రూపాయి భారీగా కుప్పకూలడానికి దేశీయ అంశాలతోపాటు పలు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని ప్రధాని వివరించారు. సవాళ్లను అధిగమించగలమన్నారు. ఇక కఠిన సంస్కరణలే... గడిచిన రెండు దశాబ్దాలుగా ఆర్థిక సరళీకరణ ప్రయోజానాలు భారత్‌కు చాలా మేలు చేకూర్చాయని ప్రధాని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇప్పటికీ చాలా పటిష్టంగానే ఉన్నాయని.. భారతదేశ అసలుసిసలు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఇప్పటిదాకా చేపట్టిన ఆర్థిక సంస్కరణలన్నీ ఒకెత్తయితే.. ఇకపై మరిన్ని కఠిన సంస్కరణలతో ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దీనికి రాజకీయపక్షాల నుంచి ఏకాభిప్రాయం అవసరమని కూడా చెప్పారు. సంస్కరణలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వృద్ధిరేటుపై... 2013-14లో జీడీపీ వృద్ధిరేటు కాస్త మెరుగ్గానే 5.5 శాతంగా నమోదుకావచ్చని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక సంస్కరణలు అవసరం: కార్పొరేట్లు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపు, క్యాపిటల్ కంట్రోల్స్ విధించబోమన్న ప్రధాని హామీపై కార్పొరేట్ ఇండియా స్పందించింది. దీనికితోడు జీఎస్టీ, సబ్సిడీలకోత ఇతరత్రా పలు కీలక, కఠిన సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరం నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పసిడిపై మోజు వద్దు... అధిక క్యాడ్(మూల ధన పెట్టుబడులు మినహా దేశంలోకివచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం) దేశానికి ఆందోళనకరంగా పరిణమిస్తోందని ప్రధాని అంగీకరించారు. రూపాయి క్షీణతకు ఇది కూడా ఆజ్యం పోస్తోందన్నారు. పసిడి, ముడిచమురు దిగుమతులు దూసుకెళ్తుండటమే క్యాడ్ పెరుగుదలకు కారణమని చెప్పారు. ప్రజలు బంగారంపై మోజు తగ్గించుకోవాలని, తద్వారా క్యాడ్‌కు కళ్లెం పడుతుందని సూచించారు. అదేవిధంగా పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచే చర్యల ద్వారా క్యాడ్‌కు అడ్డుకట్టవేయొచ్చని పేర్కొన్నారు. క్యాడ్‌ను జీడీపీలో 2.5 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8 శాతం-90 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా, విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చేలా సానుకూల ఆర్థిక వాతావరణాన్ని కల్పించడం ద్వారా క్యాడ్‌ను పూడ్చుకునేందుకు వీలవుతుందన్నారు. 1991 నాటి చెల్లింపుల సంక్షోభానికి భారత్ మళ్లీ చేరువవుతోందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. దేశ కరెన్సీ మారకం రేటు మార్కెట్ ఆధారితంగానే కొనసాగుతోందని, దేశంలో 278 బిలియన్ డాలర్ల విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ఏడు నెలలకు సరిపడా దిగుమతుల బిల్లుకు సమానమని కూడా గుర్తుచేశారు. -
ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పోయింది
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా..ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాల నమ్మకాన్ని భారత్ కోల్పోయిందన్నారు. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్సింగ్ సారథ్యంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. మన్మోహన్‌సింగ్‌పై గౌరవం ఉందంటూనే .. దేశాన్ని ముందుండి నడిపించే సత్తా లోపించిందంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పీకల్లోతు సమస్యల్లో ఉన్న భారత్.. ప్రపంచ దేశాల నమ్మకాన్ని కోల్పోయిందని రతన్ టాటా ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. ప్రైవేట్ రంగంలోని స్వార్థపర శక్తుల ప్రభావానికి ప్రభుత్వం లొంగిపోతోందని ఆక్షేపించిన టాటా .. విధానాలను మార్చేయడం, జాప్యాలు చేయడం లాంటివి చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్.. భారత్ గర్వంగా తలెత్తుకునేలా చేశారని, కానీ ఇటీవలి కాలంలో ఆ ప్రతిష్ట మసకబారుతోందని ఆయన చెప్పారు. ఇన్వెస్టర్లకు భారత్‌పై విశ్వాసం సన్నగిల్లుతున్నా.. ప్రధాని మౌనం వహిస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మనం ప్రపంచం నమ్మకాన్ని కోల్పోయాం. మన ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించింది’ అని టాటా వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా గతేడాది డిసెంబర్లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. విధానాలు సరిగ్గా అమలు కావాలి.. విధానాలను పకడ్బందీగా రూపొందించినట్లుగానే.. వాటిని అమలు కూడా చేస్తే దేశానికి మంచిదని టాటా చెప్పారు. ప్రభుత్వం ప్రకటించే విధానాలను .. ప్రైవేట్ రంగంలోని స్వార్థపూరిత శక్తులు కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలంగా మార్చుకోవడమో లేదా వాటి అమల్లో జాప్యమయ్యేలా చూడటమో చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. కారణమేదైనా కావొచ్చు ప్రభుత్వం కూడా ఆయా శక్తులకు అనుగుణంగా పనిచేసిందని టాటా విమర్శించారు. అంతర్గత కుమ్ములాటలపై విచారం... ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలను కూడా టాటా సునిశితంగా విమర్శించారు. ‘ప్రభుత్వాన్ని అందరూ అన్ని వైపులా లాగేస్తున్నారు. అంతర్గతంగా కూడా ఇది జరుగుతోంది. ప్రభుత్వం అన్నాకా ఒక్కతాటిపై ఉండాలి.. కానీ ప్రభుత్వ టీమ్ సభ్యులు తలో దారిలో పోతున్నారు.. మిత్రపక్షాలు తలో దారిలోకి లాగుతున్నాయి.. రాష్ట్రాలు మరో దారిలోకి లాగుతున్నాయి. ప్రభుత్వం ఏకతాటిపై ఉండటం లేదు’ అని టాటా పేర్కొన్నారు. మోడీపై ఇలా... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. ఆయన గుజరాత్లో తన నాయకత్వ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారని టాటా చెప్పారు. అయితే, జాతీయస్థాయిలో దేశాన్ని ఏ విధంగా నడిపించగలరన్న దానిపై తాను వ్యాఖ్యానించలేనని తెలిపారు. ప్రధానిపై గౌరవం ఉంది..కానీ... 1991 నాటి సంస్కరణలను రతన్ టాటా ప్రస్తావిస్తూ.. ఇప్పుడున్న బృందమే అప్పట్లో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించిందని టాటా పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం కొన్ని శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. అటువంటి శక్తులకు తలొగ్గకుండా.. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని టాటా అభిప్రాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంపై తనకు అపార గౌరవం ఉందని, ఇకపైనా ఉంటుందని టాటా చెప్పారు. అయితే, దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వం లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మనం ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నామో.. దేశాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నామో.. అలాంటి నాయకత్వం లేదు’ అని టాటా వ్యాఖ్యానించారు.