breaking news
rtc bus hits
-
ధర్మవరంలో విషాదం: మరణంలోనూ వీడని స్నేహం
ధర్మవరం రూరల్: ఆ యువకులు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు.. చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రకమైన వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అవివాహితులైన వీరిద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అంకే ధనుశ్ (25), రాంనగర్‌కు చెందిన భీమనపల్లి అనిల్‌కుమార్ (27) మిత్రులు. వీరిద్దరూ మగ్గం నేస్తూ పట్టు చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మగ్గం సామగ్రి కోసం ఆదివారం గోరంట్లకు వెళ్లారు. పని ముగించుకుని అక్కడి నుంచి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ధర్మవరం మండలం మోటుమర్ల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రగాయాలవడంతో ధనుశ్, అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోని, సీటీఎం గోపాల్‌రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి డిపో మేనేజర్లు మల్లికార్జున, ఇనయతుల్లా, ఈయూ నాయకులు నాగార్జునరెడ్డి, సుమో శీనా తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై స్థానికులను ఆరా తీశారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
ఇద్దరు యువ ఇంజినీర్లు మృత్యువాత
కుక్కునూరు (పోలవరం): మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువ ఇంజినీర్లు మృతిచెందారు. ఈ దుర్ఘటన కుక్కునూరు మండలంలోని కమ్మరిగూడెం టర్నింగ్ వద్ద గురువారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఎస్సై సాధిక్ పాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో మరుగుదొడ్లు(ఐహెచ్ఎస్ఎల్)నిర్మించే బాధ్యతను కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు న్యాక్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. సంస్థ తరపున ఇంజినీర్లు లాడియా తిరుపతి(26), పెనుకా గౌతమ్(24) ఇటీవల మండలానికి వచ్చారు. వీరిద్దరూ కూలీలను తీసుకువచ్చేందుకు ఉదయం అమరవరం నుంచి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కమ్మరిగూడెం టర్నింగ్ వద్ద భూర్గంపాడు నుంచి రాజమండ్రి వెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మణుగూరు డిపోకు చెందిన బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే మృతిచెందగా, గౌతమ్ భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతులలో తిరుపతి వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వాడు కాగా గౌతమ్ మహబూబాబాద్ నివాసి అని ఎస్సై తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.