దాడులతో బలపడేందుకు సంఘ్ శక్తుల కుట్ర
వామపక్షాల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులు, గిరిజ నులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం ద్వారా బలపడాలని సంఘ్‌పరివార్ శక్తులు కుట్రపన్నుతున్నాయని 10 వామపక్షాలు ఆరోపించాయి. దీనిలో భాగంగానే నల్లగొండలో దళిత క్రిస్టియన్లపై దాడి జరిగిందన్నాయి. ఆదివారం రాత్రి నల్లగొండలోని దళితకాలనీలో క్రిస్టియన్లు, చర్చి పాస్టర్లపై ఆరెస్సెస్ శక్తులు దాడిచేయడా న్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి.
దాడులకు పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలని, మైనారిటీల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వానికి తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), సాధినేని వెంకటేశ్వరరావు(న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ), జానకి రాము లు(ఆర్ఎస్పీ), భూతం వీరన్న (సీపీఐ- ఎంఎల్), సీహెచ్ మురహరి(ఎస్‌యూసీఐ-సీ), బి.సురేందర్‌రెడ్డి(ఫార్వర్ట్‌బ్లాక్), రాజేశ్ (లిబరేషన్) విజ్ఞప్తి చేశారు. మతోన్మాద శక్తుల దాడులను అదుపునకు చర్యలు తీసుకోకపోతే ఆ శక్తులు పేట్రేగిపోయే ప్రమాదముందని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.