breaking news
Risk of Beas River
-
జాడ చెబితే 10 వేల బహుమతి
విద్యార్థుల మృతదేహాల కోసం హోంమంత్రి నాయిని ప్రకటన మండి జిల్లా, బియాస్ నదీపరీవాహక గ్రామాల్లో చాటింపు దుర్ఘటనపై సీఎంకు నివేదిక హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల జాడ తెలిపిన వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు బియాస్ నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలతోపాటు మండి జిల్లాలో చాటింపు వేయించినట్లు తెలిపారు. ఆ గ్రామాలకు గల్లంతైన విద్యార్థుల ఫోటోలను పంపించామన్నారు. అలాగే, బియాస్ నదీ పరీవాహకప్రాంతంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించి నీటిలో ఏదైనా మృతదేహం కనిపిస్తే సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయమని మండి జిల్లా కలెక్టరును, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరామన్నారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను గత ఎనిమిది రోజులుగా పర్యవేక్షిస్తున్న నాయిని నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థుల దుర్మరణానికి కారణమైన ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నానని చెప్పారు. దాని ఆధారంగా విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యంపై ఎలాంటి చర్య తీసుకోవాలనేది సీఎం నిర్ణయిస్తారని నాయిని వివరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గేట్లు తెరిచిన లార్జి ప్రాజెక్టు అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. దానికి సంబంధించి ఇక్కడి జిల్లా కలెక్టరు నివేదికను రూపొందిస్తున్నారన్నారు. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కాకుండా వారి బంధువులు ఉంటారని, అలాగే, కాలేజీ తరఫున మరో ఇద్దరు ఇక్కడే ఉంటారని నాయిని చెప్పారు. అవసరమైతే మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష కూడా చేయిస్తామని వెల్లడించారు. తాను, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నామని, తమస్థానంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ కార్యదర్శి అగర్వాల్‌లు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని నాయిని వెల్లడించారు. స్పెషల్ బెటాలియన్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది సైతం మృత దేహాలు దొరికేంతవరకు తన టీమ్‌తో ఇక్కడే ఉంటారన్నారు. ఎనిమిదో రోజూ ఫలితమివ్వని గాలింపు ఆదివారం ఎనిమిదో రోజు లార్జి, పాండో డ్యాంలలో గాలింపు బృందాలు.. నదీజలాల లోతుల్లో ఉన్న వాటిని కూడా గుర్తించగల అత్యాధునిక సోనార్ పరికరం ద్వారా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాలింపు జరిపినా ఒక్క మృతదేహాన్ని కూడా కనుక్కోలేకపోయాయి. నౌకా దళానికి చెందిన గజ ఈతగాళ్ల బృందం పాండో డ్యాం నుంచి లార్జి డ్యాం వరకు 17 కిలోమీటర్ల మేర జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. రాష్ట్రం నుంచి వెళ్లిన రాజీవ్ త్రివేది సైతం తన 25 మంది బృందంతో గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. పాండో డ్యాంకు ఎగువన మృతదేహాలు ఉండవచ్చని అనుమానించిన నేవీ అధికారులు ఆ ప్రాంతంలో కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఆ ప్రాంతాల్లో లోతుగా గాలించాలని నిర్ణయించారు. పెను ప్రమాదం జరిగి ఎనిమిది రోజులవుతున్నా గల్లంతైన వారిలో 16 మంది విద్యార్థుల జాడ తెలియక పోవడంతో వారి తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా ఉంది. కనీసం మా బిడ్డల మృతదేహాలైనా తెచ్చి ఇవ్వండంటూ మంత్రి నాయిని ముందు కన్నీరుమున్నీరవుతున్నారు. బురద లేదా బండరాళ్ల మధ్య ఒకవేళ మృతదేహాలు చిక్కుకుని ఉంటే పై నుంచి నీటిని వేగంగా వదలడం వల్ల అవి పైకి తేలే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సూచించారని, అయితే అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించలేదని నాయిని తెలిపారు. అది ఇసుక తవ్వకం కోసం వేసిన రోడ్డు సిమ్లా: బియాస్ నదిలో తెలుగు విద్యార్థుల దుర్మరణం.. హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. డ్యాం కిందనున్న నదిలోకి విద్యార్థులు ఇసుక తవ్వకం కోసం వేసిన ఒక అక్రమ రోడ్డు ద్వారానే వెళ్లారు. ఆ దుర్ఘటనను చిత్రీకరించిన వీడియోలోనూ నదీతీరం నుంచి ఇసుకను తీసుకువెళ్తున్న ఒక ట్రాక్టర్ కనిపించింది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి ఆదివారం సందర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నదీతీరానికి దారితీసే అన్ని అనధికార దారులను మూసేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఫీజులు వాపసు: నాయిని విహారయాత్రలో మృతిచెందిన విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి చెల్లించేందుకు విజ్ఞానజ్యోతి కాలేజీ యాజమాన్యం అంగీకరించిందని నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. బ్యాంకు రుణం ద్వారా ఫీజులు చెల్లించి ఉంటే, దానిని కూడా మాఫీ చేయిస్తారని చెప్పారు. అలాగే, మృతుల కుటుంబానికి చెందిన వారికి తమ కాలేజీలో ఇంజనీరింగ్ సీటును ఉచితంగా ఇచ్చేందుకు కూడా కాలేజీ యాజమాన్యం ఒప్పుకుందని తెలి పారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చే విషయంలో.. తమ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలను జరిపి ఎంపిక చేస్తామని, అవసరమైతే నిబంధనలను పక్కనబెట్టే విషయాన్ని కూడా ఆలోచిస్తామని వారు హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. -
అంతా కలలా..
స్నేహితులను కాపాడలేకపోయా.. కళ్లెదుటే కొట్టుకుపోయారు పరుగెత్తినా పట్టుకోలేకపోయా.. ప్రత్యక్షసాక్షి రఘువంశీ దొరకని శ్రీనిధి ఆచూకీ ‘అప్పటిదాకా అందరం అక్కడే ఎంజాయ్ చేశాం. ఫొటోలు దిగాం. మేం ఉన్నచోట రాళ్లు చిన్నగా ఉన్నయ్. అక్కడికి కొద్దికొద్దిగా నీళ్లు రావడంతో ఎందుకైనా మంచిదని నాతోపాటు మరో ఇద్దరు మిత్రులు ఒడ్డుకు వచ్చాం. మా వెనకాలే మరొకరు వచ్చారు. ఇంతలో నీళ్లు ఒక్కసారిగా వరదలా వచ్చాయి. అతడు మునిగిపోతుంటే పట్టుకున్నాం.మిగతావారిని మాత్రం కాపాడలేకపోయాం. అసలు ఏం జరిగిందో అర్థంకాలేదు.అంతా కలలా అయిపోయింది. వారు బతికిరావాలని కోరుకుంటున్నా..’ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ జిల్లా కేంద్రానికి చెందిన కొక్కుల రఘువంశీ మంగళవారం ఇంటికి చేరుకున్నాక చెప్పిన మాటలు. ఆనాటి ప్రమాదం జరిగిన తీరు అతడి మాటల్లోనే... ‘ఈ నెల 8న ఆదివారం అందరం కలిసి కులుమనాలి వెళ్లడానికి నిర్ణయించుకుని, మధ్యలో బియాస్ నది వద్ద ఆగాం. మొత్తం 49మందిమి కిందికి దిగి గ్రూపులు గ్రూపులుగా అటూ... ఇటూ వెళ్లాం. నది అందంగా కనిపించడంతో సాయంత్రం 6.15గంటల సమయంలో బియాస్‌నదిలోకి ఫొటోలు దిగేందుకు వెళ్లాం. కొందరు ఒకవైపు...మరికొందరు ఇంకోవైపు వెళ్లాం. 20నిమిషాల అనంతరం మేం ఉన్న చోట చిన్నచిన్న రాళ్లు కొంచెంకొంచెం మునుగుతుండడంతో ఎందుకైనా మంచిదని మేం త్వరగా నడుచుకుంటూ ఒడ్డుకు వచ్చాం. మాతోపాటు ఉన్న ఒకరు నీటిలో పడిపోతుంటే పట్టుకుని పైకి లాగాం. మాకు సమీపంలోనే 24 మంది మూడు గ్రూపులుగా విడిపోయి పెద్దపెద్ద రాళ్లు ఎక్కి ఫొటోలు దిగుతున్నరు. నీటి లెవల్ పెరగడంతో వారు ఒడ్డుకు చేరలేకపోయారు. అటూ.. ఇటూ... తిరుగుతూ బయటపడేందుకు ప్రయత్నం చేసి నా.. క్షణాల్లోనే వేగంగా వచ్చిన నీటిలో కొట్టుకుపోయారు. రక్షిద్దామని అరుచుకుంటూ ఒడ్డు వద్దకు కొందరితో కలిసి చేరినం. ఒడ్డు వెంట పరిగెత్తినా కూడా లాభం లేకపోయింది. అంతా మునిగిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చా లాసేపటి దాకా కోలుకోలేకపోయాం. మాకు తెలిసినవారందరికీ సమాచారం అం దించాం. ప్రమాదం జరిగిన రెండున్నర గంటల తర్వాత పోలీసులు వచ్చారు. చీకటి కావడంతో గాలింపు చేపట్టలేమని ఉదయం చూద్దామని చెప్పి కొందరు సిబ్బందిని అక్కడ ఉంచి వెళ్లిపోయారు. ఉదయం దాకా అక్కడే పడిగాపులు పడ్డాం. తెల్లారి 10 గంటలకు గాలింపు మొదలుపెట్టారు. అప్పటికే నది ఇంకా వేగంగా ప్రవహిస్తోంది. ఒడ్డు వద్ద ఎవరైనా ఉంటారని ఆశగా గాలించినా లాభం లేకపోయింది. అప్పటిదాకా కేరింతలతో ఆనందంగా గడిపిన మిత్రులు గల్లంతయ్యారంటే ఇప్పటికీ నమ్మలేకున్నా... అధికారులు నాతోపాటు 24 మందిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. రాత్రి 12 గంటలకు హైదరాబాద్ వచ్చినా... ఆ ఘటన తల్చుకుంటేనే.. చాలా భయంగా అనిపిస్తోంది.’