breaking news
RGIA Police
-
నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని..
సాక్షి, శంషాబాద్: నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని ముగ్గురు మహిళలను నమ్మించి వాళ్ల కాళ్ల కడియాలు, వెండిపట్టీలతో పాటు బాలికను తీసుకుని పరారైన మోసగాడి ఉదంతమిది. రంగారెడ్డి జిల్లాలోని రెండు కల్లు కంపౌండ్ల వేదికగా సాగిన ఈ తతంగంలో మోసపోయిన బాధితులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయిచారు. రంగంలో దిగిన పోలీసులు మైనర్ బాలికను సురక్షితంగా రక్షించి వారికి అప్పగించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నందిగామ మండలం అంతిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, బాలిక(15)తో కలిసి కొత్తూరు కల్లుకంపౌండ్కు కల్లు తాగడానికి వెళ్లారు. అక్కడ అపరిచిత వ్యక్తి వారితో మాటలు కలిపాడు. అక్కడ కల్లు సేవించి తిరిగి శంషాబాద్ కల్లు కంపౌండ్‌కు చేరుకున్నారు. వారితోపాటే వచ్చిన అపరిచిత వ్యక్తి తాను పూజలు చేసి నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని నమ్మించాడు. అందుకు కావల్సిన పూజా సామగ్రి కోసం డబ్బులు కావాలని నమ్మించాడు. డబ్బులు లేకపోవడంతో వారి వద్దనున్న కాళ్లకడియాలు, వెండి పట్టీలు ఇస్తే వాటిని విక్రయించి పూజా సామన్లు తీసుకొస్తానని చెప్పాడు. ఇది నమ్మిన వారు సుమారు 30 తులాల కాళ్ల కడియాలు, వెండిపట్టీలు ఇవ్వడంతో పాటు అతడి వెంట బాలికను పంపారు. బాలికను తీసుకొని వెళ్లిన నిందితుడు వెండి వస్తువులు విక్రయించి బాలికను నగరంలోని కూకట్‌పల్లిలో వదిలేసి వెళ్లాడు. మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళలు రాత్రి 10 గంటల సమయంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలో గౌలిగూడ ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో ఉన్న బాలికను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికను వారికి అప్పగించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మోసగాడి కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒంటిపై బంగారం కోసం దాడి యాలాల: ఒంటరిగా పొలంలో పత్తి తీస్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బెన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మీ గ్రామ శివారులోఉన్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసింది. కాగా ఆదివారం ఉదయం తన కొడుకు అశోక్‌తో కలిసి పొలానికి వెళ్లి ఒంటరిగా పత్తి తీస్తుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఓ దుండగుడు లక్ష్మీపై కర్రతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన లక్ష్మీ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తల్లిపై జరిగిన దాడిని గమనించిన అశోక్ వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు పత్తి పొలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న లక్ష్మీని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మీ ఒంటిపై ఉన్న బంగారం కోసమా? మరేమైనా కారణంతో దాడికి పాల్పడి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ, బెన్నూరు పంచాయతీలో 6వ వార్డుకు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సమాచారం తెలియడంతో గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ అశోక్‌బాబు తెలిపారు. -
విమానంలో స్వీడన్ దేశస్తుడి వింత ప్రవర్తన
శంషాబాద్: గోవా నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ విదేశీయుడు మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించాడు. స్వీడన్‌కు చెందిన అలెగ్జాడ్రా జాక్ ఫ్ల్రీవ్ (35) అనే వ్యక్తి ఢిల్లీ వెళ్లడానికి గోవాలో శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం ఎక్కాడు. అయితే, విమానం ప్రయాణిస్తుండగానే.. అతడు వింతగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా సీటులో నుంచి లేచి తాను వేసుకున్న దుస్తులు విప్పేసి అటూఇటూ పరిగెత్తాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అలెగ్జాడ్రాను అదుపు చేసి తిరిగి దుస్తులు వేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం విఫలమవడంతో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అతడిని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. వారు అతడిని అదుపులోకి తీసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అలెగ్జాడ్రాను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. అతడి శరీరంపై ఎర్రటి మచ్చలు ఉండటంతో డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. -
అండర్వేర్లో రూ.19 లక్షల బంగారం
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా...బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్ వేర్లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్‌వేర్‌కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు. 612.5 గ్రాముల ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇక గత పది రోజులుగా శంషాబాద్‌లో 3 కేజీల 400 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. -
శంషాబాద్‌లో కిడ్నాప్ కలకలం
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో కిడ్నాప్ కలకలం రేగింది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైన వ్యక్తితో మాట్లాడడానికి తీసుకుపోవడంతో ఆందోళన చెందిన భార్య తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సోమవారం సాయంత్రం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతానికి చెందిన బురాన్(55) పట్టణంలోని మధురానగర్ కాలనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ తన భార్య నర్సమ్మతో కలిసి ఉంటున్నాడు. దేవరకద్ర గ్రామానికి చెందిన జయమ్మ వద్ద వీరు రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల అప్పును తిరిగి చెల్లించకపోవడంతో జయమ్మ మరో నలుగురు వ్యక్తులతో కలిసి అప్పు విషయమై మాట్లాడడానికి కారులో బురాన్‌ను తీసుకుని వెళ్లింది. ఆందోళనకు గురైన అతడి భార్య తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు గంటల తర్వాత బురాన్ ఇంటికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది.