breaking news
revising committe
-
రివైజింగ్ కమిటీకి వెళతా
‘‘బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు. కానీ రైతు అప్పు కట్టకపోతే పొలాల్ని, ఇంటిని జప్తు చేస్తారు. వాటిని నా ‘అన్నదాత సుఖీభవ’ చిత్రంలో చూపించా. సినిమాకి కీలకమైన ఆ సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడం బాధ కలిగించింది. అసలు రైతుల బాధలను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం తీశా’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక రైతు అంటారు. అన్నం పెట్టే అన్నదాత పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నోట్ల రద్దు వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వల్ల వేల కోట్ల ధనం ప్రజలు కోల్పోతున్నారు. ఈ అంశాలన్నింటినీ మా సినిమాలో ప్రస్తావించా. ఈ నెల 14న సినిమాను విడుదల చేయాలని మార్చిలో సెన్సార్‌కు అప్లై చేశా. వారం క్రితం సినిమా చూసిన సెన్సార్ బోర్డు నోట్ల రద్దు, జీఎస్టీ సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకున్నా. కానీ, సినిమాకి కీలకమైన రైతు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకోలేదు. అందుకే నా సినిమాకు సెన్సార్ చేయలేదు. సెన్సార్ బోర్డు తీరుకు నిరసనగా నేను రివైజింగ్ కమిటీకి వెళ్తున్నా. 30 ఏళ్లుగా నేను ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నా. సెన్సార్ విషయంలో శ్యామ్ బెనగల్ సూచనలను అమలు చేయాలని అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు పోరాటాలు చేయాలి’’ అన్నారు. -
రివైజింగ్ కమిటీకి ఐ!
ఐ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్లనుందని తెలిసింది. సియాన్ విక్రమ్, లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ జంటగా నటించిన భారీ చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ అద్భుత సెల్యులాయిడ్ ఇది. ఆస్కార్ రవిచంద్రన్ భారీ నిర్మాణ విలువకు నిదర్శనం. ఐ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీపావళికే తెరపైకి వస్తుందనుకున్న ఐ సంక్రాంతికి ముస్తాబవుతోంది. జనవరి తొమ్మిదిన తెరపైకి రానున్న నేపథ్యంలో సెన్సార్ బృందం చిన్న షాక్ ఇచ్చింది. ఐ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ ఘటన చిత్ర యూనిట్‌ను విస్మయానికి గురి చేసింది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వస్తే ప్రభుత్వ రాయితీలు వర్తించవు. దీంతో ఐ చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధమైనట్లు సమాచారం.