breaking news
resolved Ratnakar
-
ఇక ఉద్వాసనే!
లోక్‌సభ ఫలితాల ప్రభావం .. విజయానికి సహకరించని, పని తీరు సరిగాలేని మంత్రులపై వేటు! జాబితాలో ఆరుగురు త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అసంతప్తి నేతలకు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు ప్రతిభకు పెద్ద పీట.. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించని, పని తీరు సరిగాలేని అమాత్యులకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని కాంగెస్ భావిస్తోంది. ఒక వేళ అసంతప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సరైన సహాయ సహకారాలు అందించని మంత్రులపై వేటు వేయాలని అధిష్టానం యోచిస్తోంది. వీరితో పాటే పని తీరు బాగా లేని మంత్రులకు కూడా ఉద్వాసన పలకనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేత ృత్వంలో మంత్రుల పని తీరును బేరీజు వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు మంత్రుల నెత్తిపై కత్తి వేలాడుతోంది. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ పదవులను కోల్పోయే అవకాశాలున్నాయని సమాచారం. వీరిలో ప్రకాశ్ హుక్కేరి మొన్న జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో ఇప్పటికే మూడు ఖాళీలున్నాయి. కనుక కొత్తగా తొమ్మిది మందికి అవకాశం లభించవచ్చు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ అసంత ృప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణలో అనుభవం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గం, ప్రాంతం లాంటి వాటిని పక్కన పెట్టి ప్రతిభకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రి వర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కలిగేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎగువ సభల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలపై చర్చించడానికి దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మల్లిఖార్జునకు స్థానం తోటలు, ఉద్యాన వనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప వయో భారంతో బాధ పడుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీని వల్ల కీలకమైన రెవెన్యూ శాఖ అచేతనంగా పడి ఉంది. కరువు, వరదల సమయాల్లో ఆయన పర్యటనలకు వెళ్లే స్థితిలో లేరు. మునిసిపల్ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం అనేక శాఖలతో సతమతమవుతున్నారు. ఆయన పని తీరు బాగా లేదని పార్టీలో పెదవి విరుస్తున్నారు. గుల్బర్గ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు అక్కడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మండ్యలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్య ఓటమి పాలైంది. దీనికి ఆయన బాధ్యత వహించాలనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అతి మంచితనమే ఆయన కొంప ముంచేట్లుంది. విద్యా శాఖ లోటు పాట్లను తెలుసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శివమొగ్గ జిల్లాలోని సొంత నియోజక వర్గం తీర్థహళ్లిలోనే ఎక్కువ రోజులుంటారని సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. -
పంతుళ్ల కొరత తీరనుందిక
11 వేల మంది టీచర్ల నియామకం జూన్‌లో ప్రక్రియ పూర్తి విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో వచ్చే జూన్‌లో కొత్తగా 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం 24 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, 11 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిందని వెల్లడించారు. గురువారం ఆయన్కికడ విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు 9,500 మందిని, ఉన్నత పాఠశాలలు, పీయూ కళాశాలలకు 1,500 మందిని నియమించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించినందున, నియామకాలకు సంబంధించి ఇంకా విధి విధానాలు సిద్ధం కాలేదని చెప్పారు. కనుక నియామకాల్లో జాప్యం జరగవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల నియమావళి త్వరలో అమలులోకి రానున్నందున, జూన్‌లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన 13 వేల పోస్టులను దశల వారీ భర్తీ చేస్తామని తెలిపారు. బదిలీలపై ఆర్డినెన్స్ ఉపాధ్యాయుల బదిలీలపై ఆర్డినెన్స్‌ను తీసుకొస్తామని, లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్‌లో బదిలీలను చేపడతామని ఆయన వివరించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని, దీని వల్ల భార్య, భర్త వేర్వేరు చోట్ల పని చేయాల్సి వస్తోందన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా బదిలీలు కోరుకుంటున్న వారికి కూడా అవకాశం లభించడం లేదన్నారు. ఈ అంశాలను అఫిడవిట్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా కౌన్సెలింగ్‌ను పక్కన పెట్టి బదిలీలు చేపడతామని తెలిపారు.